Karthika Masam Dhanassu Rasi: కార్తీక మాసం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అటు శైవ క్షేత్రాలు, ఇటు విష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు వారు అత్యంత పవిత్రంగా భావించే ఈ కార్తీక మాసంలో భక్తి భావంతో పూజాదికాలు నిర్వహించి తరిస్తున్నారు. ఈ మాసంలో ద్వాదశ రాశుల్లో కొందరికి అనుకూల ఫలితాలు, మరికొందరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక ఈ కార్తీక మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. (Karthika Masam Dhanassu Rasi)
ధనుస్సు రాశి ద్వాదశ రాశుల్లో 9వది. ఈ రాశికి అధిపతి గురువు. చతుర్విద ఫలప్రదాతగా గురువును పేర్కొంటారు. ఉద్యోగ యోగం, ఉన్నత యోగం, సంఘంలో గౌరవం వచ్చేలా చేస్తాడని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు మేష రాశిలో మిత్ర స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ కార్తీక మాసంలో ఉద్యోగాల్లో ఉన్న వారందరికీ పదోన్నతులు, శుభవార్తలు వినడం లాంటివి ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. నిలకడ అయిన ధన యోగం ఉంటుందని సూచిస్తున్నారు. సాధారణంగా లక్ష్మీదేవి ఎక్కడా నిలకడగా ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన వద్ద ఉంటే రేపు మరొకరి వద్ద ఉంటుంది. అయితే, ఈ కార్తీక మాసంలో ధనుస్సు రాశి వారికి ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ మాసంలో చేసే వ్యవహారాలు, వ్యాపారాల్లో అధిక ధనయోగం గురు గ్రహం వల్ల ధనుస్సు రాశి వారికి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అన్ని రకాలుగా కార్తీక మాసంలో ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుందని, యోగ దాయకమైన కాలంగా చెబుతున్నారు.
ఈ రాశి వారికి కార్తీక మాసంలో సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయట. పలుకుపడి పెరగడం, చక్కటి ఆదాయాన్ని చవిచూస్తారని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. స్త్రీలాభం కూడా చేకూరుతుందంటున్నారు. అంటే ఆడవారు ఉద్యోగాలు, ఉద్యోగ యజమానులు ఉంటే వారి వల్ల అంటే లేడీ బాస్‌ల వల్ల పదోన్నతులు, ధన లాభం లాంటివి కలుగుతాయని చెబుతున్నారు. ఉన్నతమైన పదవులు దక్కుతాయని సూచిస్తున్నారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుందట. ధనానికి లోటు లేకుండా ఉంటుందంటున్నారు. అధికమైన ఖర్చులు చేస్తారని, సాధారణంగా వంద రూపాయలు ఖర్చు పెట్టే చోట వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తారని చెబుతున్నారు.
దూర ప్రాంతాల ప్రయాణం, విందు, వినోదాల్లో పాల్గొనడం లాంటివి చేస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆరోగ్య పరంగా చాలా యోగ్యమైన కాలమని చెబుతున్నారు. అనారోగ్య సమస్యలేవీ దరిచేరవంటున్నారు. వ్యాపారులు, రాజకీయ నాయకులకూ మంచి కాలమేనట. రాజకీయ నాయకులకు ఉన్నతమైన స్థానం కలుగుతుందని పండితులు అంటున్నారు. అయితే, విద్యార్థులకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉందంటున్నారు. అంటే అనుకున్న దానికంటే తక్కువ ర్యాంకులు రావడం, మార్కులు కాస్త తగ్గడం లాంటివి చూస్తారట.
ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే కార్తీక మాసంలో ప్రథమ గురువారం నాడు అంటే ఈనెల 28వ తేదీన కేజింపావు శనగలను నానబెట్టాలి. ఎల్లో కలర్ వస్త్రం, గులాబీ పువ్వు, పాలకోవా పావు కిలో తెచ్చుకోవాలి. గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల్లోపు సాయి బాబా గుడికి వెళ్లాలి. అక్కడ బాబాకు నమస్కరించి శనగలను నివేదన చేయాలి. అక్కడున్న భక్తులకు పంచిపెట్టాలి. ఇంటికి వచ్చి శనగల కూరతోనే భోజనం తినాలి. మధ్యాహ్నం సాయిబాబా మంత్రోఛ్చారణ, గురు దత్తాత్రేయ మంత్రాన్ని పఠించాలి. సాయంత్రం శివాలయంలో పరమేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. ఇలాంటివి చేయడం మూలాన ధనుస్సు రాశి వారికి మరింత శుభం కలుగుతుందని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Karthika Masam: కార్తీక మాసంలో ఏ పూజలు చేస్తే పుణ్య ఫలాలు కలుగుతాయి?