Registrations AP: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ మరింత బలోపేతమవుతోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ స్థాయిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. గ్రామ స్థాయిలో ఏ సేవలు అవసరమైనా పౌరులు ఊరు దాటి పోవాల్సిన పని లేకుండా సర్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందిస్తున్నామని, ఈ వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకెళ్తూ అన్ని సేవలూ అందిస్తామని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రెవెన్యూ అండ్ సీసీఎల్ ఏ సాయి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో 294 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయని వెల్లడించారు. (Registrations AP)
పంచాయితీ సెక్రెటరీలకు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసే అధికారాలు ఇచ్చామని ఆయన తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సాయి ప్రసాద్ తెలిపారు. సాఫ్ట్ వేర్ అప్ డేట్ కు దేశంలోని ఉత్తమ పద్ధతులు పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. డాక్యుమెంట్ నచ్చిన రీతిలో రాసుకునే అవకాశం ఇప్పుడు కూడా ఉందని తెలిపారు.
లింక్ డాక్యుమెంట్ చూసుకునే ఛాన్స్ కూడా ఉందని సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలు ఆన్ లైన్ లో ఉంటాయని వివరించారు. స్టాంప్ డ్యూటీ కూడా ఆటోమేటిక్ గా ఆన్ లైన్ లో వస్తుందని చెప్పారు. ఒకే చలానాలో అన్ని ఫీజులు కట్టొచ్చు అని తెలిపారు. రిజిస్ట్రేషన్ తో పాటు ఆటో మ్యుటేషన్ జరుగుతుందని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ తర్వాత ఈసీ, రెవెన్యూ రికార్డ్స్ ఇస్తారని సాయి ప్రసాద్ వెల్లడించారు. స్కాన్ చేసిన డాక్యుమెంట్ మాత్రమే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉంటుందని, ఐటీ యాక్ట్ 2000 ప్రకారం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ చెల్లుతాయని ఉందని వివరించారు. అక్టోబర్ 4న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేసిన డాక్యుమెంట్స్ చెల్లుతాయని తెలిపిందని వెల్లడించారు.
ఏపీలో మూడు రోజులుగా కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ
- కొత్త సాఫ్ట్ వేర్ (కార్డ్ ప్రైమ్) ఎక్కడా అభ్యంతరం రాలేదు
- 23 రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో మాత్రమే కొత్త సాఫ్ట్ వేర్ తో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం
- నెల రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేశాకే కొత్త విధానం అమలు
- ఆన్ లైన్ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- అపోహలను నమ్మొద్దని కోరుతున్నాం
- కొత్త విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వరని ఎవరూ చెప్పలేదు
- ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వరని అసత్య ప్రచారం చేస్తున్నారు
- పాత, కొత్త విధానాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తాం
- సిస్టమ్ మీద అవగాహన లేని వారే జిరాక్స్ కాపీలంటూ ప్రచారం చేస్తున్నారు
- దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం
- 3 రోజుల్లో 700 రిజిస్ట్రేషన్లు చేస్తే… అన్నింటిని ఫిజికల్ డాక్యుమెంట్లతో చేశాం
- ఆప్షనల్ గా మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నాం. అని ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Weather Report Now: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన