Congress Working Committee: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పునర్ వ్యవస్థీకరించారు. సీడబ్ల్యుసీలో ఆరుగురు తెలుగు నేతలకు చోటు దక్కడం విశేషం. సీడబ్ల్యుసీలో మొత్తం 39 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులుగా పేర్కొన్నారు. మరో 14 మంది ఇన్ ఛార్జ్ లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. (Congress Working Committee)
నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి సీడబ్ల్యుసీలో చోటు దక్కడం చెప్పుకోదగ్గ పరిణామంగా నిలుస్తోంది. శాశ్వత ఆహ్వానితుల జాబితాలో ఉమ్మండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీగా పని చేసిన సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనరసింహ ఉన్నారు.
ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, వంశీచంద్ రెడ్డి ఉన్నారు. రాజస్థాన్ అసమ్మతి నేత సచిన్ పైలట్, వివాదాస్పద నేత శశి థరూర్ కు చోటు దక్కడం గమనార్హం. కమిటీలో అధిర్ రంజన్ చౌదరి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, దిగ్విజయసింగ్, పి.చిదంబరం, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ ముందు నుంచి సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 20న నూతన సీడబ్ల్యుసీ ఏర్పాటు కానుందని తెలుస్తోంది.
సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం హైదరాబాద్‌కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొంటారని చెప్పారు. సెప్టెంబర్ 17 మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ర్యాలీలోనే ఎన్నికలకు 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించనుందని తెలిపారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీలు బస చేయనున్నారని, సెప్టెంబర్ 18న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: Modi on G20: జీ-20 సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
