Rama chandra Yadav: భారత చైతన్య యువజన పార్టీ పేరుతో ఇటీవల హడావుడి చేస్తున్న రామచంద్ర యాదవ్.. మంత్రి పెద్దిరెడ్డిని ఓడిస్తానంటూ హల్ చల్ చేస్తున్నారు. రాజకీయాల్లో కాకలు తిరిగిన పెద్దాయనపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ మీడియా ఫోకస్‌లో ఉండాలని రామచంద్ర యాదవ్ తాపత్రయపడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డిపై రామచంద్ర యాదవ్ కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. (Rama chandra Yadav)
మంత్రి పెద్దిరెడ్డిపై కేంద్రమంత్రి అమిత్ షాకు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.35 వేల కోట్ల అవినీతిపై ఆధారాలున్నాయని ఆయన చెబుతున్నారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారంటూ శోకాలు పెడుతుఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నిరకాలుగా అక్రమాలు చేసి వేలకోట్లు సంపాదించారని ఆరోపిస్తున్నారు.
ఎన్నికల అఫిడవిట్ లో చాలా దాచిపెట్టారని, 60కి పైగా సూట్ కేసు కంపెనీలు సృష్టించారని ఆరోపణలు గుప్పించారు. 2019 అఫిడవిట్ లో ఆస్తులను పేర్కొనలేదన్నారు. ఎన్నికల కమిషన్‌ను పెద్దిరెడ్డి పక్కదోవ పట్టించారంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేశారని విమర్శించారు. న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు. ఇలాంటి అవినీతిపరులు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నీతులు చెబుతున్నారు.
అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్కన పెట్టుకుని రాష్ట్ర సంపద వేల కోట్లు లూటీ చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు రామచంద్ర యాదవ్. ఇలాంటి వారిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలని చెప్పుకొచ్చారు. అప్పుడే వైసీపీకి కనీసం డిపాజిట్ దక్కుతుందని వ్యాఖ్యలు చేశారు. లేకుంటే వైసీపీ భూస్థాపితం అవుతుందంటూ రామచంద్రయాదవ్ పేర్కొన్నారు.
చంద్రబాబుకు సొంత ప్రాంతంపై మమకారం లేదు: మంత్రి పెద్దిరెడ్డి
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సొంత ప్రాంతంపై మమకారం లేదని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఓవైపు రామచంద్ర యాదవ్ మీడియా గొట్టాల ముందు పెద్దిరెడ్డి పేరు చెబుతూ రెచ్చిపోతున్నా మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. యథాతథంగా చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైరవుతున్నారు. తిరుపతిలో ఇవాళ మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ఇన్ని రోజులు లేనిది కొత్తగా రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు శ్రద్ధ చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించిన విషయాన్ని ఎవరూ మర్చిపోరన్నారు. సొంత జిల్లా అభివృద్ధిని కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పం ప్రాంతాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చొరవతోనే కుప్పం ప్రాంతానికి హంద్రినీవా నీళ్లు వస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.