Perni Nani: వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్‌పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. వైఎస్ జగన్‌పై ఉన్న విద్వేషం పవన్ మాటల్లో కనిపించిందన్నారు. చంద్రబాబుపై ప్రేమ కూడా పవన్ మాటల్లో కనిపించిందని పేర్ని కామెంట్ చేశారు. పవన్ చంద్రబాబు జపం చేయడమే తప్పితే మరో పనిలేదని ఎద్దేవా చేశారు. (Perni Nani)
మహిళల మిస్సింగ్‌పై పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, పవన్ నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల మిస్సింగ్‌పై మాట్లాడరెందుకు? అని ప్రశ్నించారు. పవన్ చెప్పిన 30 వేల మంది మహిళల వివరాలకు ఆధారాలు చూపాలని సూచించారు. ఎవరో ఏదో చెబితే గుడ్డిగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వలంటీర్ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్‌కు భయం పట్టుకుందన్న పేర్ని నాని.. సీఎం జగన్ సంక్షేమ పాలనతో వీరిద్దరూ ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
పేద, బలహీన వర్గాలకు వలంటీర్లు ఎనలేని సేవ చేస్తున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. వలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్‌కు మంచి పేరు రావడాన్ని వీరిద్దరూ తట్టుకోలేకపోతున్నారన్నారు. అబద్దాలు చెప్పను అంటూ పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. వలంటీర్లు చేస్తున్న సేవ పవన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టాలని పేర్ని నాని సవాల్ చేశారు. వలంటీర్లలో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారని, అలాంటి వారిపై ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతారా? అని మండిపడ్డారు.
మీకు తప్పుడు లెక్కలు ఇస్తున్న రామోజీరావు, రాధాకృష్ణను అడగాలంటూ పవన్‌కు పేర్ని నాని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతీ పథకాన్నీ పేదలకు వలంటీర్లు అందిస్తున్నారని, మనిషి జన్మ ఎత్తినవాడెవడూ ఇలా మాట్లాడడంటూ ఫైర్ అయ్యారు పేర్ని నాని. రాజకీయ పదవుల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌లవి నీచ రాజకీయాలు ప్రజలు గమరిస్తున్నారన్నారు. పవన్‌కు విజ్ఞత ఉంటే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఏ రోజూ మీ తల్లి, భార్య గురించి తప్పుగా మాట్లాడలేదని గుర్తు చేశారు.
రాజకీయంగా రెచ్చగొట్టేందుకు ఇలా మాట్లాడటం భావ్యం కాదని పేర్ని నాని హితవు పలికారు. పేదల కోసం పనిచేస్తున్న వలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరచడం సబబు కాదన్నారు. మీరు మాట్లాడే మాటలు ప్రవచనాలా? మీకు మాత్రమే వ్యక్తిత్వం ఉంటుందా? వలంటీర్లకు వ్యక్తిత్వం ఉండదా?.. అని పేర్ని నాని ప్రశ్నించారు. కొల్లేరు సరస్సుపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం ఏం చేసిందో పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రామోజీరావు ఇచ్చిన తప్పుడు లెక్కలు తీసుకుని పవన్ మాట్లాడుతున్నారన్నారు. కొల్లేరుపై పవన్‌కు అసలు అవగాహన ఉందా? అని నిలదీశారు.
సీఎం జగన్ వచ్చాక ఒక్క కరువు మండలమైనా ఉందా? అని పేర్ని నాని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో కొల్లేరు ఎండిపోయినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ వచ్చాక ఎప్పుడైనా కొల్లేరు ఎండిందా? అవాస్తవాలతో ప్రభుత్వంపై పవన్ బురద జల్లుతున్నారని ఆగ్రహవ వ్యక్తం చేశారు. సీఎం జగన్ వైద్య, ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, రాష్ట్రంలో మూడు కొత్త పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక్క మెడికల్ కాలేజీ అయినా గత ప్రభుత్వం తెచ్చిందా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఆనాడు కాపులను బీసీల్లో చేరుస్తామని మోసం చేశారన్నారు. కాపు ఓట్లు వైఎస్ జగన్‌కు రాకూడదని కుట్రలు చేశారన్నారు. చంద్రబాబు కోసమే పవన్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని, ప్రజలు ఆయన చేష్టలు నమ్మరని పేర్ని నాని స్పష్టం చేశారు.