Ganga Saptami 2026: హిందూ సంప్రదాయంలో గంగానది అత్యంత పవిత్రమైన నదిగా పూజించబడుతుంది. వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని గంగా సప్తమి అని పిలుస్తారు. ఈ రోజున గంగామాత భూలోకంలో మరోసారి ఆవిర్భవించిన పవిత్రమైన దినంగా భావిస్తారు. పురాణాల ప్రకారం జహ్నుమహర్షి చెవి నుంచి గంగానది బయటకు వచ్చిన రోజు ఇదే కావడం వల్ల ఈ రోజుకు జాహ్నవి ఆవిర్భావ దినం అనే ప్రత్యేకత కూడా ఉంది. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ రోజున గంగామాతను స్మరించి పూజలు చేయడం, గోమాతకు సేవ చేయడం ద్వారా జీవితంలోని పాపాలు తొలగి, దరిద్రం దూరమై ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం.
గంగానది ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ కథ
పురాణాల ప్రకారం సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు ఉండేవారు. వారు కపిల మహాముని ఆశ్రమం దగ్గర యజ్ఞ గుర్రాన్ని వెతుకుతూ వెళ్లి ఆయనను అనుమానించడంతో కపిల మహర్షి కోపంతో శాపం ఇస్తాడు. దాంతో వారు బూడిద కుప్పలుగా మారిపోతారు. తరువాత వారి వంశంలో జన్మించిన భగీరథుడు తన పూర్వీకులకు సద్గతి కలిగించడానికి గంగానదిని భూలోకానికి తీసుకురావాలని కఠిన తపస్సు చేస్తాడు. గంగామాత తన ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదని చెప్పినప్పుడు, భగీరథుడు శివుడిని ప్రార్థిస్తాడు.
శివుడు గంగాను తన జటాజూటంలో బంధించి ఆమె ప్రవాహాన్ని నియంత్రించి భూమిపైకి విడుదల చేస్తాడు. ఆ ప్రవాహం జహ్ను మహర్షి యజ్ఞశాలలోకి ప్రవేశించడంతో కోపంతో ఆయన గంగానదిని తాగేస్తాడు. భగీరథుని ప్రార్థనతో ప్రసన్నుడైన జహ్నుమహర్షి తన చెవి నుంచి గంగానదిని విడుదల చేస్తాడు. అందుకే గంగానదికి జాహ్నవి అనే పేరు వచ్చింది.
నింబ సప్తమి ఎందుకు అంటారు?
గంగా సప్తమిని నింబ సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు వేపచెట్టుకు పూజ చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున రెండు లేదా మూడు వేప చిగుళ్లు తినడం, వేప ఆకులతో స్నానం చేయడం వల్ల శరీరంలోని వ్యాధులు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేదంలో కూడా చెబుతారు.
గంగా సప్తమి రోజు చేయాల్సిన ముఖ్యమైన పూజలు
1. గంగా స్నానం
గంగానదిలో స్నానం చేయడం అత్యంత పుణ్యకార్యం. గంగానది దగ్గర లేకపోతే ఇంట్లోనే ఇలా చేయవచ్చు:
ముందుగా రెండు వేప చిగుళ్లు తినాలి
నీటిలో వేపాకులు వేయాలి
చేతిలో ఒక చెంబు నీటిని తీసుకుని
“గంగా గంగా గంగా” అని మూడు సార్లు జపించాలి
ఆ తర్వాత ఆ నీటిని తలపై పోసుకుంటే అది గంగాజల స్నానం చేసిన ఫలితం ఇస్తుందని విశ్వసిస్తారు.
2. గంగా స్తోత్రం పఠనం
గంగా సప్తమి రోజున గంగామాత స్తోత్రం చదవడం చాలా పవిత్రంగా భావిస్తారు.
ప్రముఖ శ్లోకం:
“దేవి సురేశ్వరి భగవతి గంగే
త్రిభువన తారిణి తరళ తరంగే
శంకర మౌళి విహారిణి విమలే
మమ మతిరాస్తాం తవ పద కమలే”
ఈ శ్లోకాన్ని ఒక్కసారి అయినా పఠిస్తే జన్మల పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని విశ్వాసం.
3. జలపాత్ర దానం
ఈ రోజు ఇత్తడి లేదా మట్టి కుండలో నీరు నింపి దానం చేయడం చాలా శుభకరం.
ఇలా చేస్తే
అఖండ శ్రేయస్సు
పుణ్యఫలాలు
నీటి కొరత లేకుండా జీవితం సాగుతుందని విశ్వసిస్తారు.
గోమాత సేవ ఎందుకు ముఖ్యము?
పురాణాల ప్రకారం గోమాతలో 33 కోట్ల దేవతలు నివసిస్తారు. గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుందని కూడా విశ్వాసం ఉంది.
గోవును సేవించడం వల్ల
గ్రహదోషాలు తొలగుతాయి
అష్ట దరిద్రాలు దూరమవుతాయి
పాపాలు తగ్గుతాయి.
గంగా సప్తమి రోజున గోమాతకు కొన్ని ప్రత్యేక పదార్థాలను సమర్పించడం వల్ల జీవితంలో శుభఫలాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
గంగా సప్తమి రోజు గోమాతకు ఇవి తినిపిస్తే కలిగే ఫలితాలు
ఆధ్యాత్మిక ప్రయోజనాలు
తవుడు కలిపిన నీరు – పాపాలు తొలగుతాయి
నానబెట్టిన శనగలు – దైవచింతన పెరుగుతుంది
నానబెట్టిన పచ్చి శనగలు – కుటుంబ సఖ్యత పెరుగుతుంది
ధన, ఐశ్వర్య ఫలితాలు
గోధుమపిండి + బెల్లం – ఉద్యోగ ప్రాప్తి
మినప్పిండి + బెల్లం – ధనాభివృద్ధి
బీట్‌రూట్, పాలకూర – ఐశ్వర్యం పెరుగుతుంది
నానబెట్టిన బొబ్బర్లు – ధనలాభం
కుటుంబం, విద్య కోసం
నానబెట్టిన పొట్టు పెసరపప్పు – పిల్లల విద్యాభివృద్ధి
అరటి పళ్లు – ఉన్నత పదవి
వంకాయలు – సంతానప్రాప్తి
సమస్యల నివారణ
దోసకాయ – శత్రు బాధలు తగ్గుతాయి
దొండకాయలు – మానసిక ప్రశాంతత
బంగాళదుంపలు – నరఘోష నివారణ
టమాటాలు – వివాహ ప్రాప్తి
గంగా సప్తమి రోజు పాటించాల్సిన నియమాలు
ఈ రోజు
గంగామాత పూజ
దానం
గోసేవ
ఉపవాసం
చేయడం వల్ల జీవితంలో శుభఫలాలు కలుగుతాయని విశ్వసిస్తారు. గంగామాతను భక్తితో స్మరించడం ద్వారా పాపాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందని హిందూ సంప్రదాయం చెబుతుంది.
గంగా సప్తమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున గంగామాతను స్మరించి పూజలు చేయడం, గోమాతకు సేవ చేయడం, దానాలు చేయడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగి శుభఫలాలు కలుగుతాయని విశ్వసిస్తారు. భక్తితో చేసిన చిన్న సేవ కూడా మహా పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: Varalakshmi Vratham : వరమహాలక్ష్మి వ్రతం.. ఆచరిస్తే మంచి ఫలం!
Monday Puja: సోమవారం ఉదయం శివారాధన ఎలా చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది?
