Girls in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత జనరేషన్ యూత్‌కు అమ్మాయిలు దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాబోయే 15-20 ఏళ్లలో అమ్మాయిలే ఎక్కువగా ఉండనున్నారు. ప్రస్తుతం ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 1,046 మంది అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆ నివేదిక స్పష్టీకరించింది. (Girls in Andhra Pradesh)
దేశంలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా అమ్మాయిల సంఖ్య నమోదైంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఏపీ ఉండటం విశేషం. చాలా కాలంగా.. అంటే సుమారు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అబ్బాయిలు ఎక్కువగా ఉంటున్నారు. గతంలో భ్రూణహత్యలు ఎక్కువగా ఉండటం, అమ్మాయి అని తెలిస్తే చాలు.. పురిట్లోనే చంపేసే దారుణ పరిస్థితులు ఉండేవి. అయితే, క్రమంగా తల్లిదండ్రుల్లో అవగాహన పెరగడం, ఆడ పిల్ల అయినా, మగపిల్లాడయినా ఎవరైనా ఒకటేననే భావన ఎక్కువ శాతం తల్లిదండ్రుల్లో కలుగుతోంది. సంతానం విషయంలో ఎవరైనా ఇద్దరుంటే చాలు అనుకొనే పరిస్థితి ఏర్పడింది. మగపిల్లాడు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను చూసుకుంటాడా లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
చాలా మంది మగపిల్లలు తల్లిదండ్రులను పండు వయసులో వృద్ధాశ్రమాలకు వదిలేస్తుండడంతో ఇప్పటి యువత అలర్ట్ అవుతున్నారు. కేవలం అబ్బాయిలే కాదు.. అమ్మాయిలైనా తల్లిదండ్రులను చూసుకోగలరన్న నమ్మకం ఏర్పడుతోంది. దీంతో అమ్మాయిలే బెటర్ అనే స్థాయికి పరిస్థితి చేరుకుంటోంది.
ఏపీలో ఆడ పిల్లలు పెరుగుతున్న తీరును శ్రామిక శక్తికి సంబంధించి 2012-22 నివేదికలో కేంద్రం వెల్లడించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మాయిలు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1040కి చేరుకోవడం గమనార్హం. మరోవైపు కేరళలో దేశంలోనే ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు కలిగిన రాష్ట్రంగా పేరుగాంచింది. కేరళలో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు ఉండటం విశేషం. దేశంలోనే అత్యల్పంగా హర్యానా రాష్ట్రంలో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 887 మంది అమ్మాయిలు మాత్రమే ఉండటం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్లు కాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 1,063 మంది అమ్మాయిలు ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే.. ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 1,038 మంది అమ్మాయిలు ఉన్నారు. మాతా శిశు మరణాలు తగ్గడం కూడా అమ్మాయిల సంఖ్య పెరగడానికి కారణం అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రసవాలన్నీ దాదాపు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. దీంతో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగా మంచి ఫలితాలు వెలువడుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
ఏపీలో ఆరోగ్య కార్యక్రమాలతో సత్ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తోంది. పుట్టినప్పటి నుంచే తల్లీ బిడ్డకు పౌష్టికాహారం అందేలా చూస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అమలవుతోంది. అంగన్వాడీల్లో సరుకుల నాణ్యత పెరిగింది. గుడ్లు, పాలు, బియ్యం, కందిపప్పు, డ్రైఫ్రూట్స్ తదితరాలు అందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమం అమలవుతోంది. చిన్నారులకు అంన్వాడీల ద్వారా వ్యాధి నిరోధక టీకాలు అందిస్తోంది. చాలా గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, సిబ్బంది అందుబాటులో ఉండటంతో గర్భిణులకు ఇబ్బందులు తగ్గాయి. తాజాగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను కూడా ఏపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తోంది.దీని వల్ల ఇంటికే వైద్యుడు వచ్చి కావాల్సిన వైద్యం అందిస్తున్నారు.
భారత్‌లో సగటున ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు ఉన్నారని నివేదిక పేర్కొంది. 1,000 మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, 1,046 అమ్మాయిలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. 1031 మంది అమ్మాయిలతో హిమాచల్ ప్రదేశ్ మూడో స్థానంలోనూ, 1026 మంది అమ్మాయిలతో తమిళనాడు నాలుగోస్థానం, 1016 మంది అమ్మాయిలతో ఛత్తీస్‌గఢ్ ఐదో ప్లేస్‌లోఉంది. అలాగే 1001 అమ్మాయిలతో ఝార్ఖండ్ ఆరోస్థానం, 991 మంది అమ్మాయిలతో కర్ణాటక రాష్ట్రం ఏడో ప్లేస్‌లో ఉంది. ఇక 988 మందితో ఒడిశా ఎనిమిదో స్థానం, 971 మంది అమ్మాయిలతో ఉత్తరప్రదేశ్ పదో స్థానంలో కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు కేవలం 955 మంది మాత్రమే అమ్మాయిలు ఉండటం గమనార్హం.
Read Also : Habits That Women Hate: మగాళ్లలో స్త్రీలకు నచ్చని అలవాట్లు ఏవి? ఓ లుక్కేయండి!