Chandrababu Projects tour: ప్రతిపక్షనేత చంద్రబాబు రేపటి నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. ప్రాజెక్టులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తోందంటూ ఇటీవల చంద్రబాబు వరుసగా ప్రెస్‌మీట్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాజెక్టుల పరిస్థితిని మీడియాకు తెలిపేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు. (Chandrababu Projects tour)
సీమలో చంద్రబాబు, బాలయ్య, పయ్యావుల కేశవ్ మినహా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఈ క్రమంలో ఆయన పర్యటకు జనం నుంచి ఏ మేరకు రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు తరలి వచ్చినా భారీ జనసమీకరణ, బహిరంగ సభలకు స్పందన ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆగస్టు 1 నుంచి చంద్రబాబు రాయలసీమ పర్యటన
చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన రూట్ మ్యాప్ ఖరారైంది. ఆగస్టు 1న ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదేరోజు ముచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టుల సందర్శన ఉంటుంది. ఆగస్టు 2న కొండాపురం ప్రాజెక్టును సందర్శించనున్న చంద్రబాబు.. అనంతరం పులివెందులలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు.
Read Also : Ambati Rambabu fire on CBN: వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు: అంబటి రాంబాబు
ఆగస్టు 3న ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంటుందని తెలుగుదేశం పార్టీ తెలిపింది. ఆగస్టు 3న పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శన ఉంటుందని తెలిపింది. అనంతరం గొల్లపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించనున్నారు. ఆగస్టు 3న పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని కియా కార్ల పరిశ్రమకు చంద్రబాబు వెళ్తారు.
ఆగస్టు 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు బ్రాంచ్ కెనాల్‌ను చంద్రబాబు సందర్శిస్తారు. అదేరోజు పూతలపట్టులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ ఉంటాయని టీడీపీ వెల్లడించింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఊపిరితీసిన ప్రాజెక్టులు, పోలవరం పేరిట టీడీపీ నేతలకు దోచిపెట్టడం, బస్సుల్లో టూర్ల పేరిట ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారనేది ప్రజలకు తెలియజేయాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.