Chandrababu on Jagan: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు గుంటూరు జిల్లామంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్‌జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల సమస్యల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. భూముల రేట్ల విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలో తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయని, జగన్ పాలనలో ఏపీలో భూముల రేట్లు పడిపోయాయన్నారు. ఒకప్పుడు ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో వందెకరాలు కొనే పరిస్థితి నుంచి ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వందెకరాలు కొనే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శలు చేశారు. (Chandrababu on Jagan)
రాజకీయ మైలేజీ కోసం సొంత రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని కూడా తక్కువ చేసి ఎద్దేవా చేయడం చంద్రబాబుకే చెల్లిందంటూ విశ్లేషణలు వస్తున్నాయి. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబు.. తాను నవ్యాంధ్రకు సీఎం అయినప్పుడు ఎందుకు అమరావతిని అభివృద్ధి చేయకుండా కాలయాపన చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలనే చంద్రబాబు చేయడం ఇక్కడచెప్పుకోదగ్గ విషయం. ఒకప్పుడు సై అంటే సై అని సవాల్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్ పేరెత్తడానికే భయపడే పరిస్థితులు ఎందుకు వచ్చాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జగన్ పాలనలో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు చెప్పారు. సాగును చంపేశారని, రైతన్నను ముంచేశారంటూ వ్యాఖ్యానించారు. అన్నదాత పథకం ద్వారా రైతుల భవిష్యత్తు కు గ్యారెంటీ ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. చేతకాని అసమర్థ ప్రభుత్వం వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని శోకాలు పెట్టారు చంద్రబాబు. రైతుపై ప్రేమ, అవగాహన బాధ్యత ఏమాత్రం లేదన్నారు. రాష్ట్రంలో ఏ రైతు అయినా బాగున్నారా ? ఏ ఒక్క రైతు అయినా నేను బాగుపడ్డానని చెప్పే స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నలు వేశారు.
రాష్ట్రంలో ఇంకా లోటు వర్షపాతం ఉంటే కనీస సమీక్ష చేయలేదన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో సాగయ్యే పంట .. గంజాయి మాత్రమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పంట పండించలేము .. పండించే అమ్ముకోలేని పరిస్థితులున్నాయన్నారు. రైతును ఆదుకోలేని జగన్ కు పరిపాలించే హక్కు లేదని చెప్పారు. నాలుగేళ్లలో 3 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు అప్పులపాలయ్యారని చెప్పారు.
రైతుపై సగటు అప్పు రూ. 2.45 లక్షల పైనే ఉందని, నష్టపోయిన రైతులకు ఇచ్చింది అరకొర సాయమేనన్నారు. భూమి అమ్మేద్దాం అనుకుంటే .. ధర కూడా లేదన్నారు. వ్యవస్థలను చంపేసి రివర్స్ గేర్ లో నడిపిస్తున్నారని మండిపడ్డారు. దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్ సీఎం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నాశనమయ్యారని, రాజధానిలో రైతుల భూమి వేరొకరికి దానం చేసిన జగన్ దానకర్ణుడా ? అని ప్రశ్నించారు. అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా ? అన్నారు. కోర్టుల్లో అనుమతి వచ్చిందా ? అని ప్రశ్నించారు. ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. అమరావతి రైతులపై జగన్ కు ఎందుకు కక్ష ? అని చంద్రబాబు ప్రశ్నించారు.