R 5 Zone: అమరావతి ప్రాంతంలోని ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ఈనెల 24వ తేదీన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాలకు అనుమతి పత్రాలను సీఎం జగన్ అందించనున్నారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది అధికార యంత్రాంగం. (R 5 Zone)
ఆర్ 5 జోన్‌లో 47 వేల మంది పేదలకు ఈనెల 24వ తేదీన అనుమతి పత్రాలను సీఎం జగన్ అందజేస్తారు. సచివాలయాల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతులు కొందరు చాలా కాలంగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.
వ్యతిరేకిస్తున్న టీడీపీ, కొందరు రైతులు
ఏకైక రాజధానిగా అమరావతిని (Amaravati) ప్రకటించి అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఇచ్చిన ప్లాట్లను తొలుత అభివృద్ధి చేసి తమకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా ఇతర ప్రాంతాల వారికి ఇంటి స్థలాలు ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. పేదల పక్షపాతిగా నిలుస్తూ వారి కోసం ఇంటి నిర్మాణాలను శరవేగంగా చేపట్టడంపై ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే ఈ కేసుపై పలుమార్లు కోర్టుల్లో వాదనలు నడిచాయి. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్లింది. అయితే, అక్కడ ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలంటూ అటు ప్రభుత్వానికి, ఇటు అమరావతి ప్రాంత రైతులకు ధర్మాసనం సూచించింది. తాజాగా ఈ కేసుపై ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణ చేసింది.
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
అమరావతిలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 45 పై హైకోర్టు ఫుల్ బెంచ్, సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని, కాబట్టి ఇళ్ల నిర్మాణాలు చేసుకోవచ్చని అర్ధం అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలకు కొంత మంది అడ్డుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు 1656 ఎకరాలను సంస్థలకు అమ్మేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ తప్పు కాబట్టే ప్రభుత్వం సవరించిందని, సీఆర్డీఏ చట్టంలో 5 శాతం భూమిని నిరుపేదలకు ఇవ్వాలని ఉందని గుర్తు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు ప్రభుత్వ లాయర్లు వాదించారు.
ఆర్ 5 జోన్‌లో ఇళ్ల అంశంపై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. అనంతరం ఆర్ 5 జోన్‌లో ఇళ్ల అంశంపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో మరోవైపు జగన్ సర్కార్ పేదలకు ఇళ్లు కట్టించేలా కార్యాచరణ ముమ్మరం చేసింది.
Read Also : Amaravati: దద్దరిల్లిన అమరావతి.. 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ!