A3 Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబును ఏ3 గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీసీ యాక్ట్ కింద సీఐడీ కేసు నమోదు చేసింది. పిటిషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు అనుమతించింది. (A3 Chandrababu)
చంద్రబాబు హయాంలో భారీ మద్యం కుంభకోణం
తమకి అనుకూలమైన రెండు బేవరేజ్ లు, మూడు డిస్టలరీలకు లబ్ది చేకూర్చడానికి మద్యం పాలసీనే చంద్రబాబు మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ1 గా ఐఎస్ నరేశ్, ఏ2 గా కొల్లురవీంద్ర, ఏ3 గా చంద్రబాబు పేర్లు నమోదు చేసింది సీఐడీ. నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన బేవరేజ్ కి మరొక బేవరేజ్ కి, 3 డిస్టలరీలకి అడ్డంగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు సర్కారు అడ్డదారులు తొక్కిందన్న ఆరోపణలున్నాయి.
రెండు మద్యం బేవరేజ్ లకి, 3 డిస్టలరీ లకు అనుకూలంగా ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చి బాబు సర్కార్ అనుమతులిచ్చిందన్న ఆరోపణలున్నాయి. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి వచ్చిన పన్నులు రూ.2,900 కోట్లుగా తేలింది. 2015 లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చంద్రబాబు ప్రభుత్వం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. టర్నోవర్ పై 8 శాతం వ్యాట్ తో పాటు అదనంగా 6 శాతం పన్నులు చంద్రబాబు ప్రభుత్వం తీసేసిందన్న అభియోగాలున్నాయి.
6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని కమిటీ సిఫార్సు లను నాటి చంద్రబాబు సర్కారు బేఖాతరు చేసిందన్న అభియోగాలు నమోదయ్యాయి. రెండు బేవరేజ్ లు, మూడు డిస్టలరీ లకి లబ్ది చేకూర్చడానికి బాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ పేర్కొన్నారు.
పుండు మీద కారం…
ఇప్పటికే వరుస కేసులతో సతమతమవుతున్న చంద్రబాబుకు ఇప్పుడు మరో కేసు మెడకు చుట్టుకుంది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ కేసు బలంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆధారాలతో సహా కేసులు పెడుతుండడంతో టీడీపీ అధినేతకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. దానికితోడు పార్టీలో ఎవరూ ఉత్సాహంగా చంద్రబాబు కేసులపై మాట్లాడలేకపోవడం, నిరసన కార్యక్రమాలు కూడా విజయవంతం చేయలేకపోవడంతో ప్రతిష్ట మరింత మసకబారుతోంది.
కక్ష సాధింపునకు మానవరూపం జగన్ : నారా లోకేష్
సీఎం జగన్‌కు కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదంటూ లోకేష్ సెటైర్లు వేశారు. జగన్ తెచ్చిన పిచ్చి ముందుకు 35 లక్షల మంది రోగులయ్యారన్నారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మద్యపాన నిషేధం పేరుతో ప్రజాధనం తింటున్న జగన్, చంద్రబాబుపై కేసు పెట్టడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. కక్ష సాధింపులో నువ్వు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ బ్రదర్ అంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు.
ఇదీ చదవండి: CM Jagan Humanity: మానవత్వం అంటే ఇదే కదా.. వృద్ధుడి కన్నీళ్లు తుడిచిన సీఎం జగన్