HomeAndhra PradeshYS Jagan Pressmeet: హే రామ్.. సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..! రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోందన్న...

YS Jagan Pressmeet: హే రామ్.. సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..! రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోందన్న వైఎస్ జ‌గ‌న్

YS Jagan Pressmeet: రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా పక్కకు పోయి మొత్తం ‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌’ రాజ్యమేలుతోందని, పోలీస్‌ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదని ఆయన చెప్పారు. చంద్రబాబుగారు తాను చేస్తున్న దోపిడి, అవినీతి, దుర్మార్గపు పాలనతో పాటు, తాను మోసం చేసిన సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లపై ఎవరైనా ప్రశ్నిస్తే, ఆ గొంతు నొక్కడం కోసం చట్టాన్ని, పోలీస్‌ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

తమకు ఎదురు లేదని, తామేం చేసినా చెల్లుతుందన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉందని, అందుకు ఇటీవలి సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఘటనలు ఒక ఉదాహణ అని ప్రస్తావించారు. చివరకు తాను వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలిసే వరకు, ప్రభుత్వంలో చలనం రాలేదని, దాదాపు 46 రోజుల పాటు, విషయాన్ని గోప్యంగా ఉంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, విత్తనాలు, యూరియా కొరత మొదలు అన్నీ సమస్యలే అని, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని జగన్‌ చెప్పారు. తీవ్ర కష్టాల్లో ఆక్వా రంగం ఉందని, నష్టాల్లో ఆ రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారని, మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపంలా మారిందని అన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలోనూ అక్రమాలు జరుగుతున్నాయన్న జగన్, వైయస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగిస్తున్నారంటూ, అధికారులకు స్వయంగా మంత్రుల ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని ప్రెస్‌మీట్‌లో ఆధారాలు కూడా చూపారు. ఇంకా ‘మావిగన్‌’ రాజధానికే కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ‘మావిగన్‌ వర్సెస్‌ అమరావతి’గా జరుగుతాయని స్పష్టం చేశారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అక్కడ నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నామని, అక్కడి రైతుల సమస్యలపై పోరాడుతున్నామని చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

నాడు అభివృద్ధి.. సంక్షేమం
రెండేళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంట అయినా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. అదే చంద్రబాబునాయుడుగారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా ఏయే అంశాల మీద చర్చ జరుగుతోందంటే.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, కస్టోడియల్‌ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం. అక్కడి నుంచి మొదలు పెడితే చంద్రబాబు చేసిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్ల మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, ఆయన చేస్తున్న టాపిక్‌ డైవర్షన్స్‌ వరకు ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.

‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యం’:
రాష్ట్రంలో ఇప్పుడు రూల్‌ ఆఫ్‌ లా పక్కకు వెళ్లిపోయి ‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌’ రాజ్యమేలుతోంది. పోలీస్‌ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం సన్నగిల్లిపోయింది. పోలీస్‌ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితులు ప్రజల్లో కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరిగినవి కావు. చంద్రబాబుగారు తాను చేస్తున్న దోపిడి, అవినీతి, దుర్మార్గపు పరిపాలన.. ఇంకా తాను సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్ల ద్వారా చేసిన మోసం, ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు.. వీటికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ గొంతు నొక్కుతున్నారు. అందుకోసం ఆయన చట్టాన్ని, పోలీస్‌ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు.. వాళ్లందరినీ అణిచి వేస్తున్నారు. అలా ఆయన చట్టాన్ని, పోలీస్‌ వ్యవస్థను వెపనైజ్‌ చేశాడు. ఆ కారణంగానే ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యవసానాలు మనకు కనిపిస్తున్నాయి.

న్యాయం, ధర్మం అనేది గాడి తప్పింది. వ్యవస్థలు దిగజారిపోతే వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. మనం ఏం చేసినా కూడా పర్వాలేదు, ఎవరూ మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్లంతట వీళ్లే ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. అదే ఈరోజు జరుగుతోంది.

అందుకు ఎన్నెన్నో ఉదాహరణలు
విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్నా, పోలీసుల వేధింపులకు గురై క్రాంతికుమార్‌ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్‌ డెత్‌ కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్నా, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్నా, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్నా, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్‌ వ్యవస్థకు ఇవన్నీ కూడా అద్దం పడతాయి.

ఒక మనిషిని కస్టడీలోకి తీసుకుని, దారుణంగా కొట్టి చంపి, కుట్రపూరితంగా సీసీ ఫుటేజీలను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి, ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో చివరకు కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన. అది కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్‌ హెడ్‌ క్వార్టర్స్‌.. అంటే చంద్రబాబునాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే విధంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబునాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట.

నిలదీస్తే వ్యక్తిత్వ హననం
ఇలాంటి ఘటనలు మన కళ్ల ఎదుటే జరుగుతున్నా సాక్షాత్తూ విజయవాడలోనే, స్టేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లోనే ఇవన్నీ జరుగుతున్నా చంద్రబాబును ఎవరూ నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, నిలదీస్తే వెంటనే వాళ్ల దగ్గర నుంచి వచ్చే మాటలేమిటి? క్రిమినల్స్‌కు మద్దతిస్తారా? అంటూ తాను ఎదురు దాడి చేయడమే కాకుండా తనకు తానా, తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయించేస్తారు, వ్యక్తిత్వ హననం చేస్తారు.

అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్‌ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజీలను మాయం చేయడం, చివరకు శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య.. దాని గురించి ఎవరూ మాట్లాడరు. సో కాల్డ్‌ ఎల్లో మీడియా.. తానా తందానా అంటూ చంద్రబాబుకు భజన చేస్తున్న వీళ్లు మాట్లాడే మాటలు ఏంటి?

మీకిదే నా సూటి ప్రశ్న. దమ్ముంటే సమాధానం చెప్పండి:
పోలీస్‌ కస్టడీలో దారుణంగా చంపి, మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా కాల్చి, చివరకు ఆ కుటుంబానికి బూడిద కూడా ఇవ్వని వైనాన్ని ప్రశ్నిస్తే ఏమంటున్నారు? రౌడీ షీటర్‌కు మీరు సపోర్ట్‌ చేస్తారా వంటి మాటలు. నిజంగా ఈ టాపిక్‌ను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబునాయుడు గారి పార్ట్నర్‌ కూడా.. ఆయన కూడా ఒక సైడ్‌ క్యారెక్టర్‌ మాదిరిగానే వీళ్లతో తానూ తందానా అంటూ పొలిటికల్‌ డ్రామాలు ఈరోజు అందరూ చేస్తున్న పరిస్థితులు.

నేను చంద్రబాబుగారిని, ఆయన పార్టనర్‌గారిని ఇద్దరినీ సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏదనిపిస్తే అది చేస్తామని, తమ చేతిలో ఉన్న కొంత మంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని బూడిద కూడా ఇవ్వమని, అధికారిక ప్రకటన చేయగలరా? ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఇదే.

యూటర్న్‌. కవరప్‌ యాక్షన్‌:
సాయికృష్ణ కేసును దాచి పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. విషయం బయట పడడంతో కవరప్‌లో భాగంగా సాయికృష్ణ మొదట రౌడీషీటర్‌ అన్నారు. ఒక రౌడీషీటర్‌ను వెనకేసుకుని వస్తారా? అని మాపై ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలు పెట్టారో, అప్పుడు వెంటనే మళ్లీ యూటర్న్‌ తీసుకుని ఇదే చంద్రబాబునాయుడు తన మనుషులను ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి, అదే సాయికృష్ణ కుటుంబాన్ని తన దగ్గరకు పిలిపించుకుని, సెక్రటేరియట్లో వాళ్లకు టైమ్‌ ఇచ్చి, వాళ్ల పక్కన కూర్చుని, వాళ్ల చేయి పట్టుకుని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని కబుర్లు చెప్పారు.

జగన్‌ కదిలితే కానీ, చలనం రాలేదు:
అసలు ఏరకంగా ఏకంగా 40 రోజుల పాటు బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్‌ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే.. దాదాపు 46 రోజులు. నేను అక్కడికి వెళ్లిన తర్వాతనే నాలుగు రోజులకు అరెస్టులు. 46 రోజులు ఈ కేసును తొక్కి పెట్టి. ఈ కేసుపై యావత్‌ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే, అసలు ఏం జరిగిందో, చట్టప్రకారం ఎంత మంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? అని అడుగుతున్నా.

కేసు నీరు గారుస్తున్నారు:
ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబునాయుడులో కానీ, ఈ ప్రభుత్వంలో గానీ చిత్తశుద్ధి అనేది కనిపించడం లేదు. ఎక్కడా ఏ కోశానా పశ్చాత్తాపం కూడా లేదు. సాయికృష్ణ రిమాండ్‌ రిపోర్టు ఒకసారి చూస్తే, వీళ్లు చేస్తున్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే, కేసును వీక్‌ చేసేందుకు, పైవాళ్లను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా కనిపిస్తాయి.
ఇక్కడ నాలుగైదు పాయింట్లు లాజికల్‌ గా చెబుతాను. వాటిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాలని కోరుతున్నాను.
– సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు. వాళ్ల రిమాండ్‌ రిపోర్టులోనే ఇది చెప్పారు. వాళ్లు సాయికృష్ణను కృష్ణలకం పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌ కూడా తీసుకున్నారని రిమాండ్‌ రిపోర్టులో చెప్పారు. మరి టాస్క్‌ ఫోర్స్‌ పని చేసేది పోలీస్‌ కమిషనర్‌ కింద కాదా?
– ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తేదీన. కాగా, సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గం.కు ఇదే విజయవాడ సీపీకి అర్జీ ఇచ్చారు.
(అంటూ ప్రెస్‌మీట్‌లో దాన్ని పీపీటీలో చూపారు)
తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్‌ డెత్‌ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సీపీ.. పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీ గారిని కలిసినా, ఆయన కూడా పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కాదా?.

– సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్‌ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్‌ వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.

క్రాంతికుమార్‌. మరణ వాంగ్మూలం:
మరో ఘటన. దళిత యువకుడు క్రాంతికుమార్‌ మరణ వాంగ్మూలం ఇస్తూ సోషల్‌ మీడియాలో తాను మాట్లాడి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో క్రాంతికుమార్‌ మాట్లాడుతూ.. తన చావుకు ఇదే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్, ఇదే సీఐ నాగరాజు పేర్లు చెప్పాడు. ఆ వీడియో వైరల్‌ అయినా కూడా, ఇదే సీపీ పరిధిలోకి వచ్చినా ఏ చర్యలూ తీసుకోలేదు. సీపీ ఏం చేయడు. డీజీపీ ఏం చేయడు. మరి క్రాంతికుమార్‌ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? ఒక తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? తన కొడుకు కోసం సాయికృష్ణ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ అర్జీలు పెట్టుకున్న దానికి విలువ లేదు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణ వాంగ్మూలానికి విలువ లేదు. నేరాన్ని కప్పి పెట్టి, నిందితుడిని ప్రోత్సహించిన ఈ సీపీకి, స్పందించడానికి 46 రోజులు పట్టింది.

వారినెందుకు బాధ్యులను చేయడం లేదు? ఇక్కడ చంద్రబాబు ఇంట్రెస్ట్‌ ఏమిటి?:
సాయికృష్ణ కేసులో జగన్‌ వెళితే గానీ నాలుగు రోజులకు అరెస్టులు జరగలేదు. అది కూడా పెద్దవాళ్లని విడిచిపెట్టి చిన్న చిన్నవాళ్లని అరెస్టు చేశారు. సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యుడిని చేయడం లేదు? సీఐను సీపీ కాపాడుతున్నాడు.. సీపీని డీజీపీ కాపాడుతున్నడు.. డీజీపీని చంద్రబాబు కాపాడుతున్నాడు. ఇందులో ఇంతగా బరితెగించి.. పై అధికారులను కాపాడుతున్న చంద్రబాబుకు ఇందులో ఉన్న ఇంట్రెస్ట్‌ ఏంటని ప్రశ్నిస్తున్నా. ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ కేసును కవరప్‌ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా.

ఎప్పుడు ఈ ఘటనలు జరిగాయి? తప్పనిసరి పరిస్థితుల్లో వీరు రియాక్ట్‌ అయ్యారు. ఈ ఘటన ఇంత పెద్దది కాకుంటే.. జగన్‌ సాయికృష్ణ ఇంటికి వెళ్లకుండా ఉంటే.. అసలు ఇన్సిడెంటే లేదు. అంతా కవరప్‌. సాయికృష్ణ ఇన్సిడెంట్‌ లేదు. అతని తల్లి ఆవేదన బయటికి రాదు. క్రాంతికుమార్‌ ఇన్సిడెంట్‌ లేదు. తన ఆత్మహత్య.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మరణ వాంగ్మూలం ఏమీ లేవు.

లోతైన కుట్ర. అందుకే ఇదే ఉదాహరణ:
కుట్ర కోణం ఎంత లోతుగా ఉందని చెప్పడానికి ఇంకో ఉదాహరణ. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ లో వీరు మొదట ఫైల్‌ చేసిన రిమాండ్‌ రిపోర్టులో మే 1 నుంచి జూన్‌ 1 వరకు సీసీ ఫుటేజీ లేదని రాసుకొచ్చారు. మధ్యలో నిన్న ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వారి రిమాండ్‌ రిపోర్టులో 18 నెలలుగా సీసీ టీవీ లేదని, అంతా తొలగించినట్లు రాశారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగాయో ఈ 18 నెలల్లో?

18 నెలలుగా సీసీ ఫుటేజీ లేదంట! ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నా.
విజయవాడలో.. సో కాల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో.. డీజీపీ ఆఫీసు ఇక్కడే.. సీపీ ఆఫీసు ఇక్కడే.. చంద్రబాబు ఉండేది ఇక్కడే.. హోం మినిస్టర్‌ ఆఫీసు ఇక్కడే. వీళ్లందరి కళ్ల ముందర.. ఏ రకంగా పోలీస్‌ స్టేషన్‌లో సీసీ ఫుటేజీ లేకుండా పోతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఫుటేజీ డిలీట్‌ చేయడం కుదురుతుందా? అలా అయితే సీసీ కెమెరాలు పెట్టడం ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిలీట్‌ చేసుకుంటూ పోతే.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? సరే.. ఇక్కడ పోలీస్‌ స్టేషన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ డిలీట్‌ చేస్తే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న వీడియో ఫుటేజీ ఏమైంది? ఒక చోట డిలీట్‌ చేస్తే ఇంకోచోట ఫుటేజీ ఎక్కడా ఉండదా? సీపీ ఆఫీసులో ఉన్న ఫుటేజీ ఏమైంది? డీజీపీ ఆఫీసులో దీనికి సంబంధించిన ఫుటేజీ ఏమైంది? పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం కాదా?

ఆ దిశలో ‘సిట్‌’ ఎందుకు పని చేయడం లేదు?:
సరే.. పోలీస్‌ స్టేషన్‌లో సీసీ ఫుటేజీ లేదంటున్నారు. విజయవాడ నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్‌ జంక్షన్లు, పబ్లిక్‌ ప్లేస్‌ల్లో ఉన్న వీడియో ఫుటేజీ ఏమైంది? ఆయా చోట్ల ఉన్న కెమెరాల ద్వారా సాయికృష్ణ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలుసుకోవచ్చు కదా? ఎందుకు సిట్‌ ఈ దిశగా అడుగులు వేయలేదు?. మెట్రిక్‌ సిస్టం క్లౌడ్‌ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజీ ఉంటుందని తెలిసినా వాటిని ఎందుకు సిట్‌ స్వాధీనం చేసుకోవడం లేదు? సీఐతో పాటు సంబంధిత పోలీసు బాస్‌ల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్‌ రికార్డులు, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్లను పరిశీలించే కార్యక్రమం ఎందుకు చేయలేదు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు తమ ఫోన్లను ఆర్థిక ఇబ్బందుల వల్ల నాగపూర్‌ లో అమ్మేశారంట!

యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన. సామాన్యుడి పరిస్థితి ఏమిటి?:
ఒక మనిషిని చంపేశారు. శవాన్ని కనిపించకుండా చేశారు. వీడియో ఫుటేజీని కూడా మాయం చేశారు. ఫోన్లు నాగపూర్‌ లో అమ్మారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటిదంటే.. వింటుంటే వెంట్రుకలు నిగ్గబొడుచుకుంటున్నాయి. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? విజయవాడలో.. పోలీస్‌ స్టేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో.. ఇక్కడే ఇలా ఉంటే.. మరి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? మానవహక్కులకు ఎక్కడైనా విలువ ఉందా? చంద్రబాబుగారి పాలనలో ఇలా వ్యవస్థలు..వాటికి బాధ్యత వహిస్తున్న అధికారులు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్తేం కాదు.. ఈ రెండేళ్లలో ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు.. ఇలాంటివి శత కోటి ఉదాహరణలు ఇవ్వొచ్చు. సీసీ ఫుటేజీ మాయం సహా ఆధారాలను నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలు పుట్టించడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం.. కొన్ని కొన్ని కేసుల్లో వీళ్లే డబ్బులు కూడా తెచ్చి పెడుతున్నారు. ఈ స్థాయిలోకి వ్యవస్థలన్నీ దిగజారిపోయి.. రెండేళ్లుగా రెడ్‌ బుక్‌ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు చూస్తున్నాం. రాష్ట్రంలో ఇదే జరుగుతోంది.

అందుకే ‘జంగిల్‌రాజ్‌’ అయింది:
ఒకరిని పిన్‌ పాయింట్‌గా గుర్తిస్తున్నారు. వారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. అందులో ఎలాంటి నైతిక విలువలు లేవు. నియమాలు కూడా పాటించడం లేదు. వారి జీవితాలను నాశనం చేస్తున్నామన్న పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికి దిగజారిపోయినా పర్వాలేదు. చంద్రబాబు ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా వీటన్నింటినీ చూసినప్పుడే జంగిల్‌ రాజ్‌ అంటారు. జంగిల్‌ రాజ్‌ అని ఎక్కడో బీహార్‌ లో మాట్లాడుతుంటారు. బీహార్‌లో కాదు. ఆంధ్రాలో ఉంది. దీన్నే జంగిల్‌ రాజ్‌ అంటారు. అడ్డూ అదుపూ లేకుండా ఏమైనా చేసేస్తాం అనేదాన్నే జంగిల్‌రాజ్‌ అంటారు.

ఇక్కడ బాధితులే నిందితులు:
చంద్రబాబుగారి జంగిల్‌ రాజ్‌లో బాధితులే నిందితులవుతారని చెప్పడానికి మరో ఉదాహరణ. మొన్న మీరంతా ఉండవల్లిలో చూసి ఉంటారు. రైతుల కోరిక మేరకు రైతు నాయకులు, మా పార్టీకి సంబంధించిన నాయకులు అమరావతికి వెళుతుంటే ఏం జరిగింది? అమరావతిలో చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను, రైతులు పడుతున్న బాధలను బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చేయడానికి ఒక ప్లాన్‌ ప్రకారం.. అక్కడికి వెళ్లిన మా పార్టీ వారి మీద వాళ్లే దాడి చేసి.. బాధితులైన మా పార్టీ వాళ్లను నిందితులుగా చూపిస్తున్నారు. వీళ్లే దాడి చేశారంట. ఆ కఠోర వాస్తవాలు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇక్కడ న్యాయం, ధర్మం పూర్తిగా భూ స్థాపితం చేసేశారు.

ఇటీవలే రాజధాని ప్రాంత రైతులు నన్ను కలిశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, తాము పడుతున్న బాధలను నాకు వివరించారు. వారి గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ నుంచి ఒక కమిటీని, లీగల్‌ టీమును పెట్టాం. కోర్టుల్లో వారి తరపున పోరాడటానికి ఓవైపు సిద్ధమవుతూ.. మరో వైపు గ్రౌండ్‌ లో జరుగుతున్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. వీళ్లంతా రైతుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళుతుంటే.. ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకుల మీద దాడులు చేసి.. హత్యాయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు.. రాళ్లు విసిరారు. వారి దాడిలో ఒక కానిస్టేబుల్‌ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. తిరిగి మా వాళ్ల మీదే.. మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు పెట్టారు. మన కళ్ల ముందే కనిపిస్తున్న చిన్న ఘటనను ఉదహరిస్తున్నా.. చెప్పుకుంటా పోతే ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని కనిపిస్తాయి.

అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలను బలై పోతున్న రైతులకు తోడుగా నిలవడం ఏమైనా తప్పా అని ప్రశ్నిస్తున్నా? చంద్రబాబు కు భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసులు పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం. ఇంకా దారుణం ఏంటంటే.. కొండవీటి వాగు నీటిని వీళ్ల భూముల్లోకి బలవంతంగా మళ్లించి.. వారి భూముల చుట్టూ నీళ్లు నింపి.. చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు భూములను వదిలేసుకునే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వమే సృష్టిస్తే.. నిజంగా విలన్లనే ఎక్కడో సినిమాల్లో ఉండరు..చంద్రబాబుగారి రూపంలో ఇక్కడే కనిపిస్తారు.. ఇవన్నీ సినిమాల్లోనే విలన్లు చేయడం చూస్తాం..కాని ఇక్కడ కళ్ల ముందే కనిపిస్తున్నాయి.

విలన్లు అనే వాళ్లు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు రూపంలో ఇక్కడే కనిపిస్తున్నారు. విలన్లు చేసే ఈ పనులన్నీ సినిమాల్లోనే చూస్తాం. కానీ ఇప్పుడు కళ్లముందే కనిపిస్తున్నాయి. ఇవన్నీ దారుణాలు కావా? దాడులకు గురైన మా పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులను రౌడీషీటర్లు అంటున్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ వెళ్ళిన వారిని రౌడీషీటర్లు అంటున్నారు. దాడి చేసింది, కొట్టింది, కొట్టించింది, రౌడీలను పెట్టుకున్నది, రాళ్లు విసిరింది, కారు అద్దాలు పగలకొట్టిందీ, అన్నీ చంద్రబాబే. కానీ మా వాళ్లనే రౌడీ షీటర్లు అంటున్నాడు.

నిజంగా ఎన్టీఆర్‌ గనుక బతికి ఉండి చంద్రబాబుని ప్రశ్నించే సమయం ఆయనకు ఉండుంటే ఆయన్ను కూడా రౌడీ షీటర్‌ అనేవాడు. ఆయనకు ఎన్టీఆర్‌ అయినా, లక్ష్మీపార్వతి అయినా, ఎవరైనా ఒకటే. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా అని అడుగుతున్నా.
(అంటూ ఇటీవల పెనుమాకలో చేసిన దాడి ఫోటోలు, వీడియోలు పీపీటీలో చూపారు)

ఇదిగో చూడండి. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్‌. రాయి పట్టుకున్న టీడీపీ నేత పెంచలయ్య. మట్టి మాఫియా నేత నాగరాజు. టీడీపీ గూండాలను దాడికి ఉరికొల్పుతున్న నారా లోకేష్‌ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. ఆశ్యర్యం ఏమిటంటే, ఇవన్నీ ఫొటోలు, వీడియోల రూపంతో కళ్ల ముందే కనిపిస్తున్నాయి. పోలీసుల సమక్షంలోనే రాళ్లు పట్టుకుని దాడులు చేస్తున్నారు. కార్లు పగలగొడుతున్నారు. చివరికి ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా ఈ దాడిలో ఆస్పత్రి పాలయ్యాడు. తిరిగి మా వారిపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేమైనా పాకిస్థాన్‌ బోర్డరా? మీరు తప్పు చేసి మా వారి మీద కేసులు పెడుతున్నారు. కొందరు పోలీసులు పొలిటికల్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు. ఏ తెలుగుదేశం గూండానీ అరెస్ట్‌ చేయలేదు.

రైతులు ఏం తప్పు చేశారు?:
రైతులు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా మీకు భూములు ఎందుకయ్యా అని అడుగుతున్నారు. కేవలం చంద్రబాబునాయుడు తన బినామీలకు, నాయకులకు ఆయన మనుషులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్నారు. మీ స్వార్థం కోసం భూములు తీసుకుని మమ్మల్ని మా గ్రామాల నుంచి వెళ్లగొడతారా అని రైతులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా అమరావతి పేరు మీద అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు ఈ దాడులు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీయే.

అమరావతి నిర్మాణంలో దోపిడి. అందుకే దాడులు:
కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. దీనికి మినిస్ట్రీ ఆఫ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ కేబినెట్‌ అప్రూవల్‌ ఇచ్చింది. వారు రిలీజ్‌ చేసిన ప్రెస్‌ రిలీజ్‌ ఇది. మరోవైపు చంద్రబాబు కడుతున్న కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి ఆయన ఖర్చు చేస్తున్నది అడుగుకి రూ.20,439. తెలంగాణ సెక్రటేరియట్‌ 10 లక్షల చదరపు అడుగులు కూడా లేదు. కానీ ఏపీ సెక్రటేరియట్‌ మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా 52 లక్షల చదరపు అడుగులు. కేంద్ర ప్రభుత్వ కళ్ల ముందు జరుగుతున్న దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నా.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ఏ సిటీ తీసుకున్నా 5 స్టార్‌ ఫెసిలిటీస్‌ విత్‌ ఇటాలియన్‌ మార్బుల్‌ నిర్మాణ వ్యయం ఒక్కో చదరపు అడుగుకు రూ.4500 దాటదు. కానీ ఇక్కడ ఏకంగా ఒక్కో చదరపు అడుగుకు చేస్తున్న ఖర్చు రూ.20,439. ఇంకా నేషనల్‌ హైవే నిర్మాణం కి.మీకు రూ.24 కోట్లు అవుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీన్నే పార్లమెంట్‌కి రాతపూర్వకంగా రాసిచ్చాడు. కానీ అమరావతిలో కి.మీ రోడ్డుకు చేస్తున్న వ్యయం సగటున రూ.53 కోట్లు. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ఇవన్నీ బయటకు రాకూడదని దాడులు చేయిస్తున్నాడు. అమరావతిలో రైతులకు జరుగుతున్న మోసం, రాజధాని పేరుతో చేస్తున్న అవినీతి బయటకు రాకూడదనే ఇలాంటి దాడులు చేయిస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ గొంతులను నలిపేయడానికే కదా ఈ దాడులు.

ఏ జిల్లా చూసినా రైతుల ధర్నాలు:
అమరావతిలో రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల పరిస్థితి కూడా ఇంకా ఘోరంగా ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ జిల్లా తీసుకున్నా రైతుల సమస్యలు కనిపిస్తాయి. రైతులు ట్రాక్టర్లు ఎక్కి రోడ్ల మీదనే కనిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మీద నిత్యం ధర్నాలు చేస్తూ కనిపిస్తున్నారు. అయినా ఇవేవీ చంద్రబాబుకి పట్టడం లేదు.

కూటమి ప్రభుత్వం రైతులకు శాపం:
మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే. అదే మా ప్రభుత్వంలో ప్రతి ఏటా రూ.3 వేల కోట్లు వెచ్చించి ఏకంగా ఆర్బీకేల్లో పోస్టర్లు పెట్టాం. ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర ఇది అని పోస్టర్లు పెట్టాం. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా ఆర్బీకే పరిధిలోనే సీఎం–యాప్‌ (కంటిన్యూయస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌) యాక్టివేట్‌ అయ్యేది. సీఎం యాప్‌ ద్వారా అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వెంటనే మెసేజ్‌ పెట్టేవాడు. మార్క్‌ఫెడ్‌ జాయింట్‌ ఎండీగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ వెంటనే కలగజేసుకుని పంటల కొనుగోలు జరిపేవాడు. మార్కెట్‌లో పోటీ పెరిగేది. రైతులకు పంట రేట్లు పెరిగేవి. ధరల స్థిరీకరణ ద్వారా ఏకంగా రూ.7800 కోట్లు వెచ్చించి రైతుల కష్టాల్లో పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చేశాం.

కానీ, ఈరోజు చంద్రబాబు పుణ్యమా అని ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించారు. మా హయాంలో ఏదైనా పంట వేస్తే నష్టపోయినా ప్రభుత్వం అండగా ఉందన్న గ్యారెంటీ ఉండేది. కానీ ఈరోజు పంట దెబ్బ తింటే ఉచిత పంటల బీమా కూడా లేదు. మా హయాంలో అమలైన ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేశారు. రద్దు చేయడమే కాదు, ఏకంగా రైతులకు రూ.3500 కోట్లు బకాయిలు పెట్టాడు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోపు వచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడేశాడు. చంద్రబాబు వల్ల రాష్ట్రంలో రైతులకు చేసిన మోసాలే ఇవాళ గ్యారెంటీలుగా కనిపిస్తున్నాయి. బాబు పాలన మోసం గ్యారెంటీ అనేది ఇవాళ రైతులకు కనిపిస్తోంది.

నాడు పొగాకు ధర రూ.411. ఇప్పుడు రూ.160:
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వరుసగా రెండో ఏడాది పొగాకు ధరలు పడిపోయిన పరిస్థితి. గతేడాది పొగాకు ధరలు పతనమైతే రైతులకు అండగా నిలవడానికి నేను వెళ్లి మద్ధతు తెలపడం జరిగింది. ఈసారి వరుసగా రెండో ఏడాది కూడా ధరలు పడిపోయిన పరిస్ధితి. మా హయాంలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా తొలిసారి బిడ్డింగ్‌ ఫ్లాట్‌ఫాం మీదకు మార్క్‌ఫెడ్‌ రంగప్రవేశం చేసింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి మార్కెట్‌లో పోటీ క్రియేట్‌ చేశాం. పొగాకు రైతులకు మా హయాంలో ఒక భరోసా ఉండేది. 2023–24లో పొగాకు రైతులకు రికార్డు రేటు వచ్చింది. రూ.411. అత్యధిక ధర. ఇంకా సగటు ధర రూ.281. ఇది రికార్డు అని మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ ప్రెస్‌ రిలీజ్‌ చేసింది. కానీ ఇప్పుడు పొగాకు రైతులు వరుసగా రెండో ఏడాది రోడ్లమీదనే కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి మాత్రం పొగాకు కొనుగోలు కంపెనీలతో సమావేశమై కొనుగోలు ధర రూ.200 కు తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియాలో ఒకటే ఊదరగొడుతున్నారు. ఈయన చెప్పాడో లేదో కానీ రేటు రూ.160కి ఢమాల్‌ మని పడిపోయింది. ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు నాయుడు హుకుం జారీ అని ఒకటే భజన. ఈయన చెప్పిన మరుసటి రోజే ధర రూ.160కి పడిపోయింది.

ఇంకా ఈ సీజన్‌లో 240 మిలియన్‌ కిలోల పొగాకు పండితే 75 రోజులైనా ఇప్పటివరకు కొన్నది కేవలం 29 మిలియన్‌ కిలోలు మాత్రమే. ఇలాంటి పరిస్థితులుంటే రైతులు రోడ్డెక్కక ఏం చేస్తారు? అసలు చంద్రబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఆయన బాధ్యతలు నెరవేరుస్తున్నాడా? రైతులను గాలికొదిలేసి చంద్రబాబు చేస్తున్న పాలన ఏమిటి అంటే, అవినీతి, దోపిడీ, రెడ్‌బుక్‌ అమలు.

ఆక్వా రైతుల కడగండ్లు:
ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. నాడు ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మా ప్రభుత్వం ‘అప్సడా’ చట్టాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసేలా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ద్వారా ఫీడ్, సీడ్‌ సహా ఆక్వా రంగంలోని కొనుగోళ్లను నియంత్రించే అథారిటీని ఏర్పాటు చేశాం. కానీ ఇప్పుడు ‘అప్సడా’ అనుమతి లేకుండానే, రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కంపెనీలన్నీ కలిసి ఫీడ్‌ ధరలను ఏప్రిల్, జూన్‌ నెలల్లో రెండుసార్లు పెంచాయి. కిలోకు రూ.14 నుంచి రూ.16 వరకు పెంచేశారు. దీనిపై చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 100 కౌంట్ల రొయ్యల ధర రూ.220కి పడిపోయింది. రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని ప్రకటించిన తర్వాతే చంద్రబాబు స్పందించారు. కేజీకి రూ.4 తగ్గించాలని ఆదేశించారట. కానీ కంపెనీలు తగ్గించింది కేవలం రూ.2 మాత్రమే. అంటే పెంచింది రూ.16 అయితే తగ్గించింది రూ.2 మాత్రమే. ప్రస్తుతం ఆక్వా రైతులు ఎంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో దీనితోనే అర్థమవుతోంది.

మామిడి రైతులకు అంతా చేదు
మామిడి రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్య గోచరం. గత ఏడాది మామిడి ధరలు పతనమైనప్పుడు నేను స్వయంగా బంగారుపాలెం మార్కెట్‌యార్డుకు వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపి తోడుగా నిలిచాను. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. రైతులు పంటను తెగనమ్ముకునే స్థితికి చేరుకున్నారు. గతేడాది కిలోకు రూ.12 ఇస్తామని చెప్పారు. కంపెనీలు రూ.8, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 ఇస్తామని ప్రకటించింది. ఏ ఒక్క కంపెనీ కూడా రూ.8 ఇవ్వలేదు, రూ.4 తో సరిపెట్టారు. కానీ ఇప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు.

అదే పొరుగున కర్ణాటకలో కిలో మామిడి ధర రూ.17.50. అయినా ఇక్కడ చంద్రబాబు నిద్ర లేవలేదు. నిజానికి ఒక కిలో మామిడి పండించడానికి రైతుకు రూ.15 ఖర్చవుతోంది. కానీ ప్రస్తుతం తోతాపురి మామిడికి కిలో రూ.5 కూడా ధర రావడం లేదు. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో 1.30 లక్షల టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు కిలో రూ.17.50ల చొప్పున ధర నిర్ణయిస్తూ, ఎంఐఎస్‌ కింద, పీడీపీఎస్‌ కింద కొనుగోలుకు కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్‌ 24న లేఖరాస్తే, జూన్‌ 25న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చింది.

చంద్రబాబుకు మామిడి రైతులపై శ్రద్ధ లేదు:
మరి చంద్రబాబు ముందుగా ఆ పని ఎందుకు చేయలేదు?. మన రాష్ట్రంలో కూడా మామిడి రైతులకు ధర రావడం లేదని చంద్రబాబుకు తెలుసు. అయినా ఆయన నిద్ర లేవలేదు. కుమారస్వామి పార్టీలానే ఈయనా కేంద్రంలో భాగస్వామి. ఈయనకీ కేంద్రంలో మంత్రులున్నారు. అక్కడ కుమారస్వామి జూన్‌ 24 లేఖ రాసిన తర్వాత, కేంద్రం స్పందించడం, ఇది మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ కావడంతో చంద్రబాబు తీరిగ్గా జూన్‌ 28న లేఖ రాశారు. ఇది రాష్ట్రంలో రైతుల మీద చంద్రబాబుకు ఉన్న ధ్యాస.

చివరకు రాసిన ఆ లేఖలో కూడా రైతులకు మేలు చేసే దిశగా దృష్టి పెట్టలేదు. కర్ణాటకలో రైతుల నుంచి కొనుగోలు చేసే మామిడికి కేంద్ర ప్రభుత్వం కిలోకు రూ.17.50 నిర్ణయిస్తే, ఆ ధర ఇక్కడ కూడా ఇవ్వమని అడగకపోగా, కిలోకు రూ.4 ఇస్తామని, ఆ డబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు. చంద్రబాబు తన వారైన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌ వీరికే న్యాయం జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తాడు.

సబ్సిడీ విత్తనాలు లేవు. యూరియా కొరత:
ఒకవైపు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఖరీఫ్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీ జరగడం లేదు. దీంతో ప్రైవేట్‌ వ్యాపారులు లాభపడుతున్నారు. యూరియా కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. రెండేళ్లుగా రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎక్కడా యూరియా కొరత కనిపించలేదు. ప్రతి గ్రామ సచివాలయం, ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో పంటల అంచనాలు వేసి, అవసరమైన ఎరువులను రైతుల వద్దకే చేర్చే వాళ్లం. మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఎరువులు అందించాం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

యూరియా వాడకం రైతులకు తెలియదా!:
యూరియాను రైతులు అధికంగా వినియోగిస్తున్నారని, అందుకే కొరత వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు ఏ పంటకు ఎంత యూరియా వేయాలో తెలియదా? ఎక్కువ ధర పెట్టి అవసరం లేకుండా ఎరువులు ఎందుకు కొనుగోలు చేస్తారు? వరి పంటలో అధిక యూరియా వేస్తే పంట నష్టపోతుందని రైతులకు బాగా తెలుసు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యత తప్పించుకునేందుకు రైతులపైనే నిందలు వేస్తోంది.

సాయంలోనూ కోత. నష్ట పరిహారమూ లేదు:
ఈ ప్రభుత్వం ఈ–క్రాప్‌ వ్యవస్థను, రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌కు అదనంగా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పారు. కానీ మూడేళ్లలో కేవలం రూ.19 వేలే ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన రూ.3,500 కోట్ల పంటల బీమా బకాయిలు ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా నిలిపివేశారు.

గత ఏడాది మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అందలేదు. రెండేళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వారి కుటుంబాలకు ఎలాంటి సాయం చేయలేదు. కానీ నదీ ప్రవాహంలో కాడెద్దులు కొట్టుకుపోతే చంద్రబాబు వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించారట, దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 డప్పు కొట్టి ప్రచారం చేసింది. రైతుల కష్టాలపై స్పందించని ప్రభుత్వం ఇతర విషయాలపై మాత్రం వెంటనే స్పందిస్తోంది.

అంతా మాఫియా రాజ్యం:
రాష్ట్రంలో ఇసుక, మట్టి, సిలికా, క్వార్జ్‌›్ట, రేషన్‌ బియ్యం మాఫియాలు పెరిగిపోయాయి. అమరావతిలో విలువైన భూములను తక్కువ ధరలకు అప్పగిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. బెల్ట్‌ షాపులు పెరిగిపోయాయి. ఇప్పుడు బీచ్‌ షాక్స్‌ పేరుతో కొత్త విధానాలను తీసుకొస్తున్నారు. కుటుంబాలతో కలిసి బీచ్‌కు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు సృష్టిస్తున్నారు.

ఆర్టీసీ ఆస్తులు, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే రెడ్‌బుక్‌ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్‌ మరణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోంది. విదేశీ పెట్టుబడుల గురించి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి.

‘సర్‌’ కార్యక్రమంలోనూ అక్రమాలు:
తమ పతనం ఖాయం అని తెలిశాక, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌) అడ్డు పెట్టుకొని కుట్రలు చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా.. ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసుకోమని ఏకంగా చంద్రబాబునాయుడు ఆర్డీఓలతో వీడియో కాల్‌ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యుమరేషన్‌ ఫామ్స్‌ వారికి ఇవ్వకపోయినా, ఇచ్చినట్టుగా రాసుకోవాలంట!. అంటే ఫామ్స్‌ వాళ్లు ఇవ్వలేదని వైఎస్సార్‌ సీపీ సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తున్నారు. ఇన్ని దారుణాలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా చంద్రబాబును.. అయ్యా నీకు మానవత్వం ఏమైనా ఉందా?.

రేపు వాళ్ల బ్రతుకు ఎలా?
స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా పేదవాడి ఓటును తొలగించేస్తే రేపు పొద్దున వీళ్లకు స్కీమ్స్‌ ఎలా వస్తాయి? వీళ్లు ఏ రాష్ట్రం వారని. చివరకు వీళ్లకు సిటిజన్‌ షిప్‌ కూడా లేకుండా కార్యక్రమం. ఏ దేశం వాళ్లని.. ఇలా చేయడం ధర్మమేనా.. ఎవరైనా గానీ, ఓటర్‌ను ఓటర్‌గానే పరిగణించాలి. నీకు ఓటు వేస్తాడా, వేయడా అనేది నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేసి మనసు గెలుచుకొని ఓటు వేయించుకో.. నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్‌ లిస్ట్‌లో నుంచి పేరే తీసేస్తే.. రేపు వాళ్లకు స్కీమ్స్‌ ఎలా వస్తాయి..? ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్లు..? ఏ దేశానికి సంబంధించిన ప్రజలు అవుతారు..? ఇలా చేయడం ధర్మమేనా..?
(అంటూ మంత్రి నారాయణ ఒక అధికారితో మాట్లాడిన ఆడియో ప్రదర్శించారు)

నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌ ‘సర్‌’ కార్యక్రమంలో స్థానిక ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ)హోదాలో ఉన్నాడు. డైరెక్ట్‌గా మంత్రి నారాయణతో మాట్లాడుతూ.. ఓట్లను ఎలా తొలగించాలి?. టీడీపీ యాప్‌ను ఎలా వాడాలో చర్చించుకుంటున్నారు. అలా నేరుగా మంత్రులు అధికారులతో మాట్లాడి ఆదేశాలిస్తున్నారు. టీడీపీ యాప్‌ వాడకం, టీడీపీ ఓటర్లను నమోదు చేయించడం, వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనుకునే వాళ్ల ఓట్లను తీసేయించడం చేస్తున్నారు. ఈ మాదిరిగా అధికారులు దగ్గరుండి ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ వ్యవస్థలు ఎలా బాగు పడతాయి?

రాష్ట్రంలో అలజడికి కుట్ర:
ఇక్కడితో చంద్రబాబు ఆగిపోలేదు. కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, రాష్ట్రంలో అలజడి క్రియేట్‌ చేసే కార్యక్రమానికి ఈ రెండు సంవత్సరాల్లో శతకోటి ఉదాహరణలు కనిపిస్తాయి. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.. ప్రభుత్వం ఉన్నవారు, పదవుల్లో ఉన్నవాళ్లు. దళితులను, దళిత క్రై స్తవులతో సహా ఇతర కులాలను టార్గెట్‌ చేస్తూ అన్యాయంగా అవమానకరంగా మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేశాడు..? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్నాడు. అది మన కంటికి కనిపిస్తోంది.

ఈ విషయంలో మీ స్టాండ్‌ ఏమిటి?:
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మత విద్వేషాలను అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దళిత క్రై స్తవులకు రిజర్వేషన్‌ ఇవ్వాలా లేదా..? అని కేంద్రం నియమించిన సుప్రీం కోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌ విచారణ నేపథ్యంలో.. మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు మారవు.. మతానికి–రిజర్వేషన్‌ ముడిపెట్టడం ధర్మం కాదని మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్లకు, మతానికి సంబంధం లేదని తీర్మానం చేశాం. మతం మారడం వల్ల వాళ్ల ఆర్థిక హోదాలు, సామాజిక పరిస్థితులు మారవు. రిజర్వేషన్స్‌కు మతానికి ముడిపెట్టడం సరికాదని తీర్మానం చేశాం. ఆ తర్వాత బాలకృష్ణన్‌ కమిషన్‌ వద్దకు మా పార్టీ టీమ్‌ వెళ్లి ఆయనకు ప్రజెంటేషన్, రిప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఇదే వాదనను వినిపించింది. నేను చంద్రబాబును గట్టిగా అడుగుతున్నా.. దీనిపై నీ స్టాండ్‌ ఏంటని అడుగుతున్నా.. చేతనైతే మంచి చేయి.. మంచి చేయకపోతే ఈ మాదిరిగా విద్వేషాలు రెచ్చగొట్టకూడదు.

‘హే రామ్‌. సేవ్‌ ఆంధ్ర’
చంద్రబాబు, నీ పార్టీకి చెందిన వారు, పదవుల్లో ఉన్నవారు దళితులను కించపరుస్తూ, ఇష్టారీతిగా మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నువ్వు ఏం చేస్తున్నావ్‌. కట్టడి చేయాలనే కనీస ఇంగిత జా‘నం లేకపోతే పేదవాడికి ఏరకంగా న్యాయం జరుగుతుంది. నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే అంటున్నాం.. ‘హే రామ్‌. సేవ్‌ ఆంధ్ర’ అని.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..:

ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు:
ప్రతి అంశమై యుద్ధమే. ఆ యుద్ధంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా, అండగా నిలబడి వారి తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తాం. ఆ మాదిరిగా కచ్చితంగా ప్రతి జిల్లాలోనూ ఎక్కడెక్కడ సమస్యలున్నాయో అక్కడికి మా వాళ్లందరూ పోతున్నారు. సమయాన్నిబట్టి, అవసరాన్ని బట్టి నేను కూడా నిరసనల్లో పాల్గొంటున్నాం. ఇది రొటీన్‌ గా జరిగేదే. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అనేది జరుగుతోంది అని చెప్పేదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా, ఇన్‌ఫ్లూయెన్స్‌ ఎక్కడెక్కడైతే ప్రాపకం ఎక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికి పెంచి వాళ్లతో కూడా చేయిస్తున్నాడు దురదృష్టవశాత్తూ. అందుకనే చెప్పాం కదా..‘హే రామ్‌. సేవ్‌ ఆంధ్ర’ అని.

మా ఆరోపణ తప్పైతే ఆధారాలు చూపండి:
మెగా డీఎస్సీలో అక్రమాలకు సంబంధించి ఆధారాలతో సహా నేను చూపించాను. ఎవరూ సమాధానాలు ఇవ్వలేదు. పెద్ద పెద్ద పరుష పదజాలం అవసరం లేదు స్వామీ.. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించాను. ఆ జీవో ఇది. సో అండ్‌ సో నంబర్‌ అని చూపించా. నీకు చేతనైతే ఇదిగో ఇవి అవాస్తవాలు, ఇవీ వాస్తవాలు అని చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకుండా పబ్లిసిటీ కోసం మాట్లాడటం ఎందుకు? దాని వల్ల నువ్వు సాధించేదేమిటి? ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు. ఏమేం ఆధారాలు చూపిస్తున్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలేమిటి అని ప్రజలు గమనిస్తున్నారు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గుమెంట్‌ రిసీవ్‌ చేసుకుంటారు.

నా ప్రెస్‌ మీట్‌ ఇప్పుడు అయిపోయింది. ఒక్కటి కూడా అబద్ధం చెప్పలేదు. అన్నీ ఆధారాలతో సహా చూపించా. కానీ రేప్పొద్దున తెలుగుదేశం వాళ్లు ప్రెస్‌ మీట్‌ పెడితే ఏం చేస్తారు, ఇక ఇష్టమొచ్చినట్లు తిట్లు. జగన్‌ ఇట్టా, జగన్‌ అట్టా.. ఆటికి సంతోషం వాడు, వీడు అనకపోతే సంతోషపడాల. లేకపోతే అవికూడా కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు.

మావిగన్‌ రాజధానికే కట్టుబడి ఉన్నాం:
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ‘మావిగన్‌ వర్సెస్‌ అమరావతి’ గా జరుగుతాయి. మేము మావిగన్‌కే కట్టుబడి ఉన్నాం. ఎవరైతే మావిగన్‌ను సమర్థిస్తారో వారు వైయస్సార్‌సీపీకి ఓటేస్తారు. ఎవరు అమరావతిని కోరుతారో వారికి ఓటేస్తారు. మేము ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పదల్చాం. అంతేకాదు, ఈ అంశాన్ని మా మానిఫెస్టోలో కూడా చేరుస్తాం. ‘మావిగన్‌..వైయస్సార్‌సీపీ’ దానికే కట్టుబడి ఉన్నాం. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూద్దాం.

ఈ ప్రభుత్వంలో ఏదైనా జరగొచ్చు:
సాయికృష్ణ కేసు అంశంలో సీఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందని చెప్పారా. ఆయన్ను చంపినా చంపేస్తారు. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగొచ్చు. అందుకనే ‘హే రామ్‌. సేవ్‌ ఆంధ్ర’ అన్నాను.

అమరావతికి వ్యతిరేకం కాదు.
రైతు సమస్యలపై మేమెప్పుడూ సానుభూతిపరులమే:
ఉండవల్లిలో పర్యటించడం పెద్ద సమస్య కాదు. కానీ, దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఈసారి పర్యటనలో ముందుగా రిటైర్డ్‌ జడ్జిలను, లాయర్లను తీసుకెళ్లడంతో పాటు, ఎన్‌హెచ్‌ఆర్సీకి కూడా ఫిర్యాదు చేయడం వంటివి చేస్తాం. అలా కాకుండా నేరుగా నేను వెళ్తే, జగన్‌ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేస్తారు. నేను అమరావతికి వ్యతిరేకం కాదు. నేను రైతుల పట్ల చాలా సానుభూతి ఉన్నవాణ్ని. రైతులకు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను రైతులే చెబుతున్నారు. ఎందుకు అన్యాయం చేస్తున్నావని మనం రైతుల తరఫున అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం.

స్కామ్‌లకు అవకాశం లేని మావిగన్‌ రాజధాని:
అమరావతి నిర్మాణంలో నువ్వు (చంద్రబాబుగారు) చేస్తున్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తున్నాం. అవన్నీ స్కాములు కాకుండా ఎలా పోతాయి? అందుకే స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్‌ చేయగలిగే అవకాశం ఏమిటి? అదే మావిగన్‌. ఏ స్కాములూ లేకుండా మావిగన్‌లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకోవచ్చు. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు, గుంటూరులో ఇప్పటికే విభిన్న విద్యాసంస్థలు. ఇంకా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వేస్టేషన్లు. మూడింటికీ బ్రహ్మాండమైన కనెక్టింగ్‌ జాతీయ రహదారులు. అందుకే ఆ కట్టే బిల్డింగులు అమరావతిలో కాకుండా, ఇక్కడ కడితే చాలు. ఏ స్కాములూ లేకుండా బ్రహ్మాండమైన రాజధాని మావిగన్‌ వస్తుందని వైయస్‌ జగన్‌ వివరించారు.

ఇవీ చ‌దవండి: YS Jagan: ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారా? గూండాల రాజ్యం న‌డుపుతున్నారా?: వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం
YS Jagan Pressmeet on DSC: డీఎస్సీ–2025 అక్ర‌మాల‌పై వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సీబీఐ దర్యాప్తు జరపాల‌ని డిమాండ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు