YS Jagan Pressmeet on DSC: తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025లో గతంలో ఎన్నడూ లేని, వినని విధంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. లక్షలాది అభ్యర్థులు, నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసి, ఇష్టారాజ్యంగా నిర్వహించిన పరీక్ష, అభ్యర్థుల ఎంపికపై సీబీఐతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు ఇంకా అనేక విషయాలు బయటకొస్తాయని ఆయన చెప్పారు.
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అందుకోసం కొత్తగా జీఓలు తెచ్చారని జగన్ తెలిపారు. తమ పని పూర్తి చేసుకోగానే, మరో మూడు జీఓలు జారీ చేసి, ఆ రెండు కొత్త జీఓలు రద్దు చేశారని వెల్లడించారు. పరీక్ష లేకుండానే, పతకాలు సాధించకున్నా.. కేవలం క్రీడా పోటీలో పాల్గొంటే చాలు అంటూ కొత్త నియమావళిలో ఉద్యోగాలు భర్తీ చేశారన్న ఆయన, సర్టిఫికెట్స్ ఇచ్చిందీ వారే, ధృవీకరించింది వారే అని గుర్తు చేశారు. ఒక్కో టీచర్ పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారన్న ఆయన, దానికి సంబం«ధించి.. ఒక ఆడియో, వీడియో క్లిప్ ప్రదర్శించారు. అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్ వెల్లడించారు.
ప్రెస్‌మీట్‌లో జగన్ ఇంకా ఏమేం మాట్లాడారంటే..:
డీఎస్సీ పరీక్ష నిర్వహణ విధానం షాకింగ్:
చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుని నిర్వహించిన డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) పరీక్ష విధానం చూస్తే నిజంగా షాకింగ్. అంత అలార్మింగ్ లెవల్స్‌లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబుగారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్‌మెంట్ జరగడం అనేది బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. చంద్రబాబు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి చాలా దారుణంగా వ్యవహరించిన పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి.
దగా. మోసం. అబద్ధాలు. స్కామ్. ఇవే కనిపిస్తాయి:
నిజంగా చంద్రబాబునాయుడుగారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, మోసానికి, ఓ వెన్నుపోటుకు, ఓ దగాకు, ఓస్కాముకు.. వీటికి చొక్కా, ప్యాంటు తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబునాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ రెండేళ్లలో ఆయన సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్‌మెంట్ చూసినా మనకు కనిపించేవి ఇవే. దగా, మోసం, అబద్ధాలు, స్కామ్.
‘మెగా’ డీఎస్సీ. పేరులోనే మోసం:
చంద్రబాబునాయుడుగారు రాగానే తొలి సంతకాలు అంటూ 5 సంతకాలు చేశారు. వాటికి నానా హంగామా, ఆర్భాటం కూడా చేశారు. అందులో మెగా డీఎస్సీ కూడా ఒకటి. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే అందులో 6,100 ఉద్యోగాలకు మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చాం. ఆ నోటిఫికేషన్‌ను చంద్రబాబుగారు రద్దు చేసి, ఆ తర్వాత ఆలస్యం కూడా చేసి, అంతకు ముందు మేం ఇచ్చిన ఆ 6,100 పోస్టులు కూడా కలిపి మొత్తంగా ఒక 16 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్‌లో చివరకు లీకులు చూస్తున్నాం. అక్రమాలు చూస్తున్నాం. స్కాములు చూస్తున్నాం. అవకతవకలు చూస్తున్నాం. మరోవైపు తనంతట తానే సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డు అంటాడు. మెగా అంటాడు. రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు.
రికార్డు అంటే ఏమిటో నేను చెబుతా:
అయ్యా చంద్రబాబుగారూ రికార్డు అంటే ఏమిటో నేను ఒకసారి చెబుతా తెలుసుకొండి. వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్‌తో ఒకే టైమ్‌లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర. అలా ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా జరిగిందా? ఒక్క వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డు అంటే ఇదీ అని కూడా చెప్పగలుగుతాను.
గ్రామ స్వరాజ్య సాధన. సుపరిపాలన. ఈ రెండూ లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం మేం. ఎవరూ బద్ధలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. 2019, మే 30న నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాలను పొందుతూ ఏకంగా 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది.
అప్పుడు ఉద్యోగం పొందిన వారంతా ఇప్పుడు మనకళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. మన గ్రామాల్లోనే మన ఇళ్లకు సేవలందిస్తూ సచివాలయాల్లో కనిపిస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేశాం. అంటే మే 30 నుంచి అక్టోబర్ 2 దాకా మొత్తం ప్రక్రియనే పూర్తి చేయగలిగాం అంటే కేవలం నాలుగు నెలలు. నాలుగు నెలల్లోనే అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు కూడా జరగకుండా ఎలాంటి లోపాలూ లేకుండా ఓ చరిత్ర సృష్టించాం.
మెగా డీఎస్సీ స్కామ్. ఎందరికో రోదన
మెగా డీఎస్సీ పేరుతో ఈయన (చంద్రబాబు) నిర్వహించిన ఈ 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఎంతో మంది ఆవేదనతో ఉన్నారు. వీళ్లు చేసిన గోల్ మాల్ వ్యవహారాలతో, వీళ్లు చేసిన స్కాముల నిర్వాకం వల్ల ఎంత మంది కన్నీళ్లు పెడుతున్నారో ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. నిజంగా ఎంత మంది రోదిస్తున్నారనేది కూడా కనిపిస్తోంది. ప్రభుత్వం అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మన పిల్లలు, జెన్ జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు.
6 పర్వాలుగా డీఎస్సీ స్కామ్:
మెగా డీఎస్సీ స్కామ్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకలను నేను 6 పాయింట్లుగా విభజించి చెబుతాను. ప్రతి పాయింట్ లోనూ స్కాము ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది వివరిస్తాను.
తొలి పర్వం:
ఒక్క డీఎస్సీ మాత్రమే కాదు. ఏ పరీక్ష, ఏ పేపర్ తయారీలో అయినా, ప్రశ్నలు అప్‌లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ అన్నీ కూడా చాలా గోప్యంగా జరగాలి. అలాగే జరుగుతాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్తా ఏమైందనేది ఒకసారి గమనించండి.
డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను ఎస్‌సీఈఆర్‌టీ అంటే ‘స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్’ వాళ్లు తయారు చేస్తారు. పరీక్ష నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. ఒకటి ప్రిపరేషన్, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబుగారి ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టేశారు. క్వశ్చన్ పేపర్ తయారీ, ప్లస్ పరీక్షల నిర్వహణ.. ఈ రెండు బాధ్యతలను కూడా ఒకరికే ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే అప్పగించారు. అప్పుడే స్కామ్‌కు బీజం పడింది.
అలా డీఎస్సీ పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బ తీశారు. అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి ఆజ్యం పోశారు. చాలా గోప్యంగా జరగాల్సిన ప్రశ్నపత్రం తయారీని, దాన్ని అప్‌లోడ్ చేసే పనిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి కూడా, అవసరం అయితే నేరం ఈజీగా వారిపై వేయొచ్చు అనే దుర్భుద్ధితో అని కూడా అనుకోవచ్చు. ఏకంగా ఈ ప్రక్రియను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా?.
అతి పెద్ద స్కామ్‌కు సాక్ష్యం కాదా?:
అలా పని చేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి డీఎస్సీ పరీక్షల్లో సోషల్ స్టడీస్ విభాగంలో కృష్ణా జిల్లా టాపర్. ఫస్ట్ ర్యాంకర్. అంతటితో ఆగిపోలేదు. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్–2 లో ఆరో ర్యాంక్ సాధించాడు. అతడి పేరు పురమ నవీన్. తండ్రి రాధాకృష్ణ. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండటం. అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం.. నిజంగా ఇది అతిపెద్ద స్కాముకు సాక్ష్యం కాదా? అని అడుగుతున్నా. అక్కడి నుంచి ఇంకెంత మందికి పేపర్ లీకైందో? అది లోతుగా పోతే తెలుస్తుంది. అందుకే దీన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, మరోవైపు సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం.
అతడికి ఉద్యోగం ఎందుకివ్వలేదు?
ఇంకా ఇవన్నీ ఎందుకు చేశారు?:
ఒకవేళ ఈ అభ్యర్థి (పి.నవీన్) మెరిట్‌లో ర్యాంకు సాధించాడని మీరు భావించి ఉంటే అతనికి మీరు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇదొక మిస్టరీ.. అంటే తప్పు జరిగిందని అనిపిస్తోంది కదా? అతడి ఐడీ కనిపించకుండా చేశారు. అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్టును కూడా ఒక సారి పరిశీలిస్తే.. మెరిట్ లిస్టులో ఇష్టానుసారంగా మార్పులు చేశారు. ఆయన పేరు లేదు. అంటే తప్పు జరిగిందనే కదా? అతని డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి అతని పేరును ఎందుకు తొలగించారు? అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? మరి చివరికి ఏం జరిగింది అంటే.. ఆ నవీన్ తనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు.
తప్పుల మీద తప్పులు:
ఒకటి. కీలక బాధ్యతలను ఔట్ సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం, రెండు. అతనికి టాప్ ర్యాంకు వచ్చినా కూడా పోస్టు ఇవ్వకపోవడం, మూడు.. అతని వివరాలు మాయం చేయడం. అసలు ఏ తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి? అంటే దీని అర్థం పేపర్ లీక్ అయినట్టేగా? మీరు కూడా ఒప్పుకున్నట్టేగా? ఈ లీక్ ఇంతటితో ఆగిపోయిందా? ఇంకా ఎంత లోతులోకి పోయింది. ఎంతమందికి ఈ లీక్డ్ పేపర్ చేరింది?. వారిలో ఎంత మంది పరీక్షలు రాశారు? ఇవన్నీ కూడా రావాల్సిన సమాధానాలు. వీటన్నింటినీ నవీన్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు.
మరి ప్రభుత్వం ఏం చెబుతోంది?
వింటే అశ్చర్యం కలుగుతుంది
ఈ ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలేమిటో తెలుసా?. వింటే అవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదంట!. అందుకే అతనికి ఉద్యోగం ఇవ్వలేదంట!. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అతను రాకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు రాలేదు కాబట్టి పోస్టు ఇవ్వలేదంటారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి.. అతని డేటాను మాయం చేసి.. కాల్ లెటర్ ఇవ్వకుండా చేస్తే.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అతను ఎలా వస్తాడు? మీరు కాల్ లెటర్ పంపిస్తేనే కదా.. అతను వెరిఫికేషన్‌కు రాగలిగేది. మీరు చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లని అతడు కోర్టుకు వెళ్లిన అఫిడవిట్ ను చూస్తే ఇట్టే అర్థమవుతాయి. ఇలా చెవుల్లో పువ్వులు పెడుతూ.. పేపర్ లీకును దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు.
సీబీఐ దర్యాప్తు మాత్రమే కావాలి. ఎందుకంటే..?:
డీఎస్సీ పరీక్షల పేపర్ తయారీలో ఎవరెవరున్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది. ఎంతమందికి లీక్ వెళ్లింది. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కారణమేమంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు.. చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతో ఆయనే వ్యవహారాలను పర్యవేక్షిస్తాడు. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే.. అధికారులు రిపోర్టు చేసేది ఆయనకే. ఆయన కొడుకే విద్యా శాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలంటే, విచారణ నిజాయితీగా జరగాలంటే సీబీఐ లాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా సాధ్యమవుతుంది. అప్పుడే కదా రాష్ట్రంలో ఎవరికైనా వ్యవస్థలపై నమ్మకం కలిగేది.
పర్వం–2
నిబంధనలకు పాతర వేశారు:
ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి పోటీ పరీక్ష ఫలితం అయినా, పబ్లిక్ ఎగ్జామ్స్ అయినా కూడా ఆ పరీక్షలకు సంబంధించి పారదర్శకంగా మెరిట్ లిస్టులు ప్రదర్శిస్తారు. యూపీఎస్సీ నుంచి ఏది తీసుకున్నా కూడా అదే విధానం. కానీ, చంద్రబాబుగారి డీఎస్సీ దానికి పూర్తిగా విరుద్ధం. డీఎస్సీ అంటే జిల్లా కలెక్టర్ పరిధి. పబ్లిక్ డొమెయిన్‌లో డిస్ ప్లేలో పెడతారు. కానీ ఈసారి మెరిట్ లిస్టులు లేవు. కలెక్టర్ల కార్యాలయాల్లో ఎక్కడా డిస్ ప్లేలు లేవు. మార్కులు లేవు. ర్యాంకులు లేవు. కటాఫ్‌లు తెలియవు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్లు పంపించారు. నిజానికి డీఎస్సీ.. డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేస్తుంది. అన్నీ కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కానీ కలెక్టర్ల కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు పెట్టలేదు. డిస్ ప్లేలు లేవు. మొత్తం వ్యవస్థను కేంద్రీకృతం చేశారు. దానికి ఆన్‌లైన్ అని పేరు పెట్టారు.
నిజంగా ఈ మాదిరిగా ఆన్‌లైన్ అని పేరు పెట్టి గందరగోళం సృష్టించారు. ఈ మాదిరిగా మెరిట్ లిస్టులు లేవు. మార్కులు లేవు. ర్యాంకులు లేవు. కటాఫ్‌లు, డిస్ ప్లేలు లేవు. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలొచ్చి కలెక్టర్ల కార్యాలయాలకు వస్తే.. పైకి (కమిషనర్ ఆఫీస్) పోండి అంటారు. వారు అన్ని ఖర్చులు పెట్టుకుని కిందా మీదా పడి ఇక్కడికి వస్తే వీళ్లే మంటారు. మాకు సంబంధం లేదు. కలెక్టర్ ఆఫీస్‌కే పొమ్మని చెబుతారు. అలా ఎందరో తిరిగారు.
సాధారణంగా కటాఫ్ మార్కులు రోస్టర్ ఆధారంగా డిస్‌ప్లేలో పెడతారు. ఎవరికైనా సందేహం కలిగితే కలెక్టర్ల కార్యాలయాలకు వెళితే అక్కడ క్లియర్ చేస్తారు. కానీ, ఈ డీఎస్సీలో అందుకు అవకాశం లేకుండా పోయింది.
సెలక్షన్ రూల్స్‌లో స్పష్టంగా ఉన్నా..:
కానీ, ఇక్కడ ఆ ప్రక్రియ మొత్తం సున్నా. కేవలం ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు వెళ్లాయి. వాళ్లకు మాత్రమే కాల్ లెటర్స్ వచ్చాయి. అది కూడా 1:1 పద్ధతిలో. ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచారు. అంటే నువ్వు సెలెక్టు అయ్యావు అనేగా అర్థం. సెలక్షన్ రూల్స్‌లో రూల్ నెం:20 క్లియర్ కట్‌గా అదే చెబుతుంది. ఆ సెలక్షన్ రూల్స్ ఒకసారి గమనిస్తే, అన్నీ క్లియర్‌గా ఉన్నాయి.
అన్ని జీవోలు పరిగణలోకి తీసుకుని మెరిట్ కం రోస్టర్ లిస్ట్ ప్రిపేర్ చేసినట్టు చెబుతున్నారు. అయితే జీఓ నెం:4 ప్రకారం, ఆ రూల్స్ కూడా పరిగణలోకి తీసుకుని 1:1 పద్ధతిలో కాల్ లెటర్ పంపించిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి జెన్యూన్‌గా ఉంటే ఉద్యోగం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపించి అభ్యర్థులను పిల్చారంటే ఒక పోస్టుకు ఒక అభ్యర్థి అనే కదా అర్థం?.
ప్రభుత్వానికి అన్నీ తెలుసు
ముందుగానే గవర్నమెంట్ మెరిట్, రోస్టర్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఇవన్నీ చూశాకనే కాల్ లెటర్లు జారీ చేసినట్టు రూల్ నెం:20 ప్రొసీజర్‌లో కూడా క్లియర్‌గా రాశారు. ఎందుకంటే అభ్యర్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో వారికి తెలుసు కాబట్టి. అలాగే వారు ఓపెన్‌లోకి వస్తారా? రిజర్వేషన్‌లోకి వస్తారా? లేదా? అన్నది వారికి తెలుసు కాబట్టి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు వారికి తెలుసు కాబట్టి. వాటిలో ఎన్ని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయో కూడా వారికి తెలుసు కాబట్టి ఉమెన్స్ కేటగిరీ కింద కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వారికి తెలుసు కాబట్టి. స్పోర్ట్స్ కేటగిరి, దివ్వాంగుల కేటగిరీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ కోటా కింద ఎన్ని పోస్టులున్నాయో కూడా వారికి తెలుసు కాబట్టి.. అంటే ఎలా చూసినా, ప్రభుత్వానికి అన్నీ ముందే తెలుసు.
ఉద్యోగం ఇవ్వలేదు. రిజెక్ట్ లిస్టులోనూ పేరు లేదు:
ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి అన్న విషయాలన్నీ ముందుగానే తెలుసు కాబట్టి 1:1 పద్ధతిలో పిలిచారు. పిలిచిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఆశ్చర్యమేమిటంటే వెరిఫికేషన్‌లో సర్టిఫికెట్లు అన్ని సరైనవేనని నిర్ధారించిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదన్న ప్రశ్న ఒకటైతే, రిజెక్టు లిస్టులో కూడా వీరి పేరు లేదనేది మరో ప్రశ్న. ఇది దగా కాదా? మోసం కాదా? ఇది స్కాం కాదా? అని అడుగుతున్నా.
ఇది దగా చేయడం కాదా?:
కాల్ లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని ఇప్పుడు అంటున్నారు. మరి 1:1 పద్ధతి ఉద్దేశం ఏమిటి? 1:5 లేక 1:10 పిలిచి ఉంటే వారు చెప్పేది నిజమే అనుకునే వాళ్లం. కానీ 1:1 పద్థతిలో పిలిచి సర్టిఫికెట్లు అన్నీ జెన్యూన్ అని తేలిన తర్వాత ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు? రిజెక్టు లిస్టులో ఎందుకు పెట్టడం లేదు? 1:1 పద్ధతిలో పిల్చి, అన్నీ సరిగ్గా ఉన్నా కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా? అన్ని సర్దుబాట్లు అన్ని జీవోలు చూసిన తర్వాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్లు అన్ని చూసిన తర్వాతే 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి బాగున్నా కూడా ఉద్యోగం రాలేదు. మరి సర్దుబాటు జరిగింది అంటే ఎవరి కోసం జరిగింది? మళ్లీ సర్దుబాటు అంశం ఎందుకొచ్చింది? రూల్ నెం:20 ప్రకారం మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్‌ను కన్సిడర్ చేశారు. మళ్లీ సర్దుబాటు ఎవరి కోసం చేశారు?.
పర్వం–3
ఒళ్లు గగ్గుర్పొడిచేలా స్పోర్ట్స్ కోటా భర్తీ:
ఇక్కడ ఉన్న (ప్రెస్‌మీట్‌లో జగన్‌గారి పక్కనే కూర్చున్న) దుర్గయ్య ఆర్చరీలో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. అయినా ఉద్యోగం లేదు. ఈ డీఎస్సీలో భర్తీ చేసిన అసలు స్పోర్ట్స్ కోటా అనేది మామూలు స్కామ్ కాదు. దీనిగురించి వింటే వెంట్రుకలు లేచి నిలబడతాయి. నా పక్కనే ఉన్న దుర్గయ్య ఆర్చరీలో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన్ను 1:1 లో కాల్ లెటర్ ఇచ్చి పిలిచారు. సర్టిఫికెట్లు వెరిఫై చేశారు. కానీ ఉద్యోగం రాలేదు. ఆయనకు నేషనల్ గేమ్స్ విశాఖ, హైదరాబాద్, 2002లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్ జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తా మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.
స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద స్కామ్. ప్రతిభ ఉన్న వారికి కాల్ లెటర్లు ఇచ్చి ఎలా పక్కన పెట్టారో చూశాం. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్‌మెన్ కి ఎలా అన్యాయం చేశారో చూద్దాం. జీవో నెం:4, జీవో నెం:47 ఇచ్చారు. చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి స్కీమ్‌లో స్కామ్ చేశారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అసవరమే లేదంట!. ఇంతకు ముందు చరిత్రలో ఎక్కడా జరగలేదు. గతంలో జీవో నెం:74 ఉండేది. దాని ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డీఎస్సీ పరీక్ష రాసి క్వాలిఫై కావాలి. అప్పుడే వారు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వారు పిల్లలకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులు విద్యార్థులకు చెప్పగలరు.
పరీక్ష వద్దట. డిగ్రీ అవసరమూ లేదట!:
చంద్రబాబునాయుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అసవరమే లేదని ఏకంగా జీవో నెం:4, జీవో నెం:47 ఇచ్చాడు. ఒక బ్యాక్ డోర్ పెట్టి ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేశాడు. గతంలో రూల్ పొజిషన్ ఎలా ఉందని జీవో నెం:74 గమనిస్తే డీఎస్సీ పరీక్షలు(ఎలిజిబులిటీ) ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్‌గా రాశారు. ఆ జీఓను రద్దు చేసి జీవో నెం:4, జీవో నెం:47 తీసుకొచ్చాడు. ఇంకా స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచాడు. అస్సలు డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని జీవోలు తెచ్చాడు.
రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఆధారంగా హిందీ, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ ఇలా సబ్జెక్టులు బోధించడానికి డీఎస్సీ పరీక్ష రాయకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశాడు. ఈ జీవోలు ఇవ్వడానికి ముందుగానే వారి వద్ద నుంచి వసూళ్ల కార్యక్రమం జరిగిపోయాయి. ఆ తర్వాతే జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత నింపాదిగా డిగ్రీ కూడా సాధించుకోవడానికి మరో ఐదేళ్లు టైం ఇచ్చారు. డీఎస్సీ క్వాలిఫై కావాల్సిన పనిలేదు. చివరికి డిగ్రీ కూడా ఉండాల్సిన పని లేదట!. ఇవన్నీ డీఎస్సీలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలకు నిదర్శనం.
ప్రతిభావంతుడికి ఉద్యోగం రాలేదు
స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం ఇవ్వాలి. నా పక్కనే ఉన్న దుర్గయ్య గారు పోలవరం ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ ట్రైబ్ క్రీడాకారుడు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. కానీ ఇలాంటి ప్రతిభావంతుడికి ఉద్యోగం రాలేదు.
పర్వం–4:
ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను క్రీడాకారుల ప్రోత్సాహానికి కాకుండా ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చేసింది. క్రీడా ప్రతిభను పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితాలను చూడలేదు. కేవలం పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో పాల్గొన్నట్లు ఉన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు కట్టబెట్టారు.
సర్టిఫికెట్లు కూడా వీళ్లే ఇచ్చారు:
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీళ్లే ఇచ్చారు. బాల్ బ్యాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి కేవలం పాల్గొన్నారనే కారణంతో ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే వాటిని ధ్రువీకరిస్తారు.
దుర్గయ్య విషయంలో ఏమన్నారు?:
అన్ని అర్హతలున్నా నా పక్కనే కూర్చున్న దుర్గయ్య గారికి మాత్రం ఉద్యోగం రాలేదు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. 1:1 పద్ధతిలో కాల్ లెటర్ కూడా పొందారు. అప్‌లోడింగ్ సరిగా చేసినా ఉద్యోగం ఇవ్వలేదు. కారణం అడిగితే సిల్వర్ మెడల్ వివరాలు అప్‌లోడ్ చేశారట. గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి సిల్వర్ మెడల్ ఎందుకు అప్‌లోడ్ చేస్తాడు? కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చి, గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తిని పక్కన పెట్టడం ఎంతటి అన్యాయం? ఇది నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా?
ఇది స్కామ్ కాకపోతే మరేమిటి?
క్రీడాకారుల పేరుతో జరుగుతున్నది ఒక పెద్ద స్కామ్. ముందు తమ వారికి ఉద్యోగాలు వచ్చేలా జీవో నెం:4, జీవో నెం:47 తీసుకొచ్చారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే అవకాశాలు కల్పించారు. ‘సర్టిఫికెట్లు మేమే ఇస్తాం‘ అంటూ తమ అనుచరులను లోపలికి పంపించారు. పని పూర్తయిన తర్వాత జీవో నెం:23, 25, 56 ఇచ్చారు. వాటి ద్వారా అంతకు ముందు జారీ చేసిన జీఓ నెం:4, 47 రద్దు చేశారు.
అయ్యా చంద్రబాబు గారూ, మీరు తీసుకొచ్చిన జీవో నెం:4, 47 ఎందుకు రద్దు చేశారు? మీరు అనుకున్నట్లు వాటి ద్వారా పని చేశారు కాబట్టే కదా? వాటి అవసరం తీరిపోయింది కాబట్టే కదా? సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తే, ఇంటర్ కాలేజీలు, ఇంటర్ యూనివర్సిటీలు, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్థాయిలో పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. వీరిలో చాలా మందికి పతకాలు కూడా లేవు.
యూనివర్సిటీలు–సర్టిఫికెట్లు:
పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆంధ్ర వర్సిటీ నుంచి 37, ఎస్వీ వర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య వర్సిటీ నుంచి 19, రాయలసీమ వర్సిటీ నుంచి 15, ఎస్‌కేయూ నుంచి 14, మోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ నుంచి 4, సంస్కృత వర్సిటీ నుంచి 2, మిగతా వర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే వీసీలు కూడా వీరి మనుషులే.
ఏయే కేటగిరీల్లో ఎందరికి ఉద్యోగాలు:
ఇంకా ఇంటర్ కాలేజీల పొటీలో పాల్గొన్నట్లు చూపి 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేషన్ చేసినందుకు 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరోవైపు ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఇచ్చారు. జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు ఉద్యోగాలు ఇచ్చారు.
ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు:
ఇంతటితో ఆగలేదు. స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
(అంటూ ప్రెస్‌మీట్‌లో ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్‌ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయటపడింది.
నామమాత్రంగా కేసు:
విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌తో వదిలేశారు. ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగినది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నెంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్‌ఐఆర్ కాపీలో ఆ నెంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు.
ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి:
ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు. అలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది కదా?. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు డీల్ చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా.. బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం, ఆశ్చర్యం.
చంద్రబాబు పాలనంతా లీక్‌ల మయం:
అసలు చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే.. చిన్న ఉదాహరణ చెబుతా..
– 1995లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్
– 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్ లీక్
– 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్
– 2017లో టెన్త్ సైన్స్ పేపర్ లీక్
– 2019లో టెన్త్ పేపర్ లీక్
– 2025లో బీఈడీ పేపర్ లీక్
– 2025లో టెన్త్ మ్యాథ్స్ పేపర్ లీక్
ఇప్పుడు డీఎస్సీ. టీచర్ల రిక్రూట్‌మెంట్ పేపర్ల లీక్
ఇదీ చంద్రబాబు హిస్టరీ. ఏదైనా డబ్బులు సంపాదించడం ఎలా? అందుకోసం పేపర్లు ఎలా లీక్ చేయాలి?. ఎలా సొమ్ము చేసుకోవాలి? అనేదే చంద్రబాబు విధానం. అదే ఆయన చరిత్ర.
ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు
ఇలాంటివన్నీ ఎత్తి చూపితే చంద్రబాబుకు మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ. ఒక్కోసారి నాకే భయమేస్తుంది.. ఏమైనా పోతాడేమోనని.. ఎప్పుడైనా పొరపాటున చంద్రబాబు నిద్రపోయేటప్పుడు ఎవరైనా తలుపుకొట్టి మావిగన్ అంటే మనిషి ఏమైపోతాడోనని ఒక్కోసారి నాకే భయమేస్తది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన వారిపై కేసులు, అరెస్టులు, భయపెట్టడం. చంద్రబాబు పాలనలో ఇది రొటీన్.
కాక్రోచ్‌లు లేస్తాయి
అయ్యా చంద్రబాబు గారూ. ఇప్పుడు జెన్ జీలో ఉన్నాం. జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నవ్వు ఈ మాదిరిగా తప్పు చేసినాక ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచ్‌లు లేస్తాయి. గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో.
మళ్లీ చెబుతున్నాం. సీబీఐ దర్యాప్తు జరగాలి:
ఇన్ని పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీబీఐ దర్యాప్తును అడుగుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యా శాఖ మంత్రి సాక్ష్యాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరి కదా.. ఈ తప్పులపై ఎదురు దాడి చేస్తూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి, కచ్చితంగా సీబీఐ ఎంక్వైరీ కావాలి.
అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం:
వారం క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారి తరఫున న్యాయ పోరాటంలో కచ్చితంగా వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ వారికి న్యాయం జరగకపోతే.. మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాం. రీ వెరిఫై చేస్తాం.. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని ఇంతకు ముందే చెప్పాను.
శుక్రవారం (12వ తేదీ) నియోజకవర్గాల్లో నిరసనలు:
రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగా పడిన మహిళలు, దగా పడిన రైతులు, దగా పడిన పిల్లలు ఇలా.. దగా పడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ రేపు (12వ తేదీ) ప్రతి నియోజకవర్గం స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం.
డీఎస్సీపైనా ప్రస్తావన:
అందులోనే డీఎస్సీ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నాం. పరీక్ష నిర్వహణలో అక్రమాల వల్ల జరిగిన నష్టాన్ని ఎత్తిచూపుతూ డీఎస్సీ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శిస్తాం. చంద్రబాబు మేనిఫెస్టోలో చేసిన సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్ మోసాలే కాకుండా, చంద్రబాబు–పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఇచ్చిన బాండ్లతో పాటు డీఎస్సీలో జరిగిన మోసాలు, అన్యాయాలు, దగా, స్కామ్‌ను చూపిస్తూ, ప్రజలకు సంఘీభావంగా దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులు అందరూ పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం.
మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..:
తప్పు ఒప్పుకోకపోతే.. ఫలితం తప్పదు:
నేను చెప్పినవన్నీ ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో, లేకపోతే ఎవరినో ఎత్తి చూపించాలనో కాదు. ప్రతి విషయంలోనూ ఆధారాలతో సహా, వాస్తవాలు, గణాంకాలతో సహా వివరించడం జరుగుతోంది. వాస్తవాలు అంత క్లియర్‌గా ఉన్నప్పుడు సమాధానాలు చెప్పాల్సిన చోట సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తూ తప్పు జరగనట్టుగా, అబద్ధాన్ని కప్పి పుచ్చుకునే కార్యక్రమం చేస్తే.. అది ఏరోజుకైనా దేవుడు కూడా హర్షించడు, ప్రజలూ హర్షించరు. కచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. చంద్రబాబుకు అదే జరుగుతుంది.
కోట్లాది కాక్రోచ్‌ల్లో జగన్‌కూడా ఒకరవుతారు:
కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా, కోట్ల మంది కాక్రోచ్‌లు వస్తారు. అందులో తానూ ఒకడినవుతానని వైయస్ జగన్ వివరించారు.
ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ చూపిన డాక్యుమెంట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 11-06-2026_JAGAN SIR PC FINAL
ఇవీ చదవండి: YS Jagan in Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి: వైఎస్ జగన్
YS Jagan Pressmeet: ఎవరివి హత్యా రాజకీయాలు? ఎవరివి శవ రాజకీయాలు? మావిగన్ అంటే చంద్రబాబుకు బీపీ: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan: హలో ఇండియా.. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది: జగన్ ట్వీట్
