Nagabandham Movie: టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ ఒకటి. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన నభా నటేష్ తన పాత్ర, సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది.
‘పార్వతి’ పాత్ర నా కెరీర్‌లో ప్రత్యేకం
ఈ చిత్రంలో తాను ‘పార్వతి’ అనే పాత్రలో కనిపించనున్నట్లు నభా తెలిపింది. వేదాలు అభ్యసించే విద్యార్థినిగా నటిస్తున్నానని, ఈ పాత్ర భావోద్వేగాలతో పాటు కథకు కీలక మలుపులు తీసుకొచ్చే విధంగా ఉంటుందని చెప్పింది.
“ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నం. కుటుంబం, ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే బలమైన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా కనిపిస్తాను. కథలో పార్వతి తీసుకునే నిర్ణయాలే ప్రధాన మలుపులకు కారణమవుతాయి. ప్రేక్షకులు నా పాత్రను చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు” అని నభా తెలిపింది.
5,000 మంది డ్యాన్సర్లతో గ్రాండ్ సాంగ్
సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ భారీ పాట గురించి కూడా నభా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాటలో దాదాపు 5,000 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారని తెలిపింది. క్లాసికల్ డాన్స్‌తో పాటు భక్తి భావనను ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారని చెప్పింది.
“అంత పెద్ద స్థాయిలో చిత్రీకరించిన పాటలో నటించడం నాకు కొత్త అనుభవం. బిగ్ స్క్రీన్‌పై ఆ విజువల్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి” అని పేర్కొంది.
అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ ప్రత్యేక ఆకర్షణ
ఈ సినిమా కోసం రూపొందించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ గురించి నభా ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఆ సెట్‌లో అడుగుపెట్టినప్పుడు నిజంగానే ఆలయంలోకి వెళ్లిన అనుభూతి కలిగిందని తెలిపింది. చిత్రీకరణ సమయంలో యూనిట్ సభ్యులంతా క్రమశిక్షణ పాటిస్తూ పూర్తిగా శాకాహార ఆహారమే తీసుకున్నామని, ప్రతి రోజు పూజలు నిర్వహించిన తర్వాతే షూటింగ్ ప్రారంభించేవాళ్లమని వెల్లడించింది.
పాత్ర కోసం రెండు గంటల మేకప్
పార్వతి పాత్ర కోసం ప్రతిరోజూ దాదాపు రెండు గంటల పాటు మేకప్ చేసేవారని నభా తెలిపింది. ప్రతి కాస్ట్యూమ్, ప్రతి లుక్‌పై దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైన్ టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, ఈ సినిమాలో దాదాపు పది భారీ సెట్లు నిర్మించారని చెప్పింది. ఒక్కో సెట్ ఒక్కో ప్రపంచాన్ని గుర్తు చేసేలా రూపొందించారని వివరించింది.
యాక్సిడెంట్ తర్వాత మళ్లీ రీఎంట్రీ
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని కూడా నభా వెల్లడించింది. తనకు జరిగిన చిన్న ప్రమాదంలో భుజానికి గాయమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టిందని చెప్పింది.
“ఒక నటిగా తెరపై ఎనర్జీతో కనిపించడం చాలా ముఖ్యం. ఫిజికల్‌గా, మెంటల్‌గా పూర్తిగా సిద్ధమైన తర్వాతే మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపింది.
భారీ అంచనాల మధ్య ‘నాగబంధం’
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. అడ్వెంచర్, మిస్టరీ, పురాణ నేపథ్యం, విజువల్ గ్రాండియర్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది.
నభా నటేష్ వ్యాఖ్యలు కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా ఆమె పోషించిన పార్వతి పాత్ర కథలో ఎంత కీలకంగా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఇవీ చదవండి: Nabha Natesh: బాక్సర్ లా మారిపోయిన నభా నటేష్.. ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్
Andhadhun: రూ.32 కోట్ల బడ్జెట్.. రూ.456 కోట్లకు పైగా కలెక్షన్లు.. 7 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎందుకు అంత స్పెషల్?
