HomeAgricultureAndhra Pradesh: ధాన్యం సేకరణ ఆలస్యంతో రైతులకు తీవ్ర న‌ష్టం.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh: ధాన్యం సేకరణ ఆలస్యంతో రైతులకు తీవ్ర న‌ష్టం.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh: రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణలో జరుగుతున్న ఆలస్యం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నదని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి యం.వి.ఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి డెల్టా ప్రాంతంలో కోతలు వేగంగా జరుగుతున్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. రెండవ ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో రబీ పంట సాగు 7.33 లక్షల హెక్టార్లు, దిగుబడి 7078 కిలోలు ఉండగా, మొత్తం ఉత్పత్తి 54.3 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది. అయితే వాస్తవంగా సాగు 9.19 లక్షల హెక్టార్లకు పెరిగిందని, అదే దిగుబడిని లెక్కిస్తే మొత్తం ఉత్పత్తి 65 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లాల వారీగా చూస్తే కాకినాడలో 5.32 లక్షల టన్నులు, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమలో 5.1 లక్షల టన్నులు, తూర్పు గోదావరిలో 4.84 లక్షల టన్నులు, పశ్చిమ గోదావరిలో 6.66 లక్షల టన్నులు, ఏలూరులో 2.88 లక్షల టన్నులు, పల్నాడులో 3.17 లక్షల టన్నులు, నెల్లూరులో 11.13 లక్షల టన్నులు, తిరుపతిలో 8.15 లక్షల టన్నులు, నంద్యాలలో 5.32 లక్షల టన్నులు, కడపలో 1.65 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో దిగుబడి ఇంకా పెరిగే అవకాశమున్నందున, సేకరణ కూడా అదే మేర పెరగాలని సూచించారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో 50 శాతం పైగా కోతలు పూర్తయ్యాయని, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాసూలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా లేకపోతే రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2369–రూ.2389 ఎంఎస్పీ ప్రకటించినప్పటికీ, రైతులు మార్కెట్లో రూ.350–రూ.400 వరకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. కొన్నిచోట్ల మధ్యవర్తులు, మిల్లర్లు ఇంకా తక్కువ ధరలు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని, తేమ శాతం పేరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పలు గ్రామాల్లో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. దీనివల్ల అదనపు ఖర్చులు, శ్రమ పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రైతులు ఒక్క పుట్టికి రూ.2000 నుంచి రూ.2500 వరకు నష్టపోయినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తేమ పరిమితుల్లో సడలింపులు ఇవ్వాలని, ఎంఎస్పీ రైతులకు నేరుగా అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా అందకపోవడం అమానుషమని విమర్శించారు. కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం కొనసాగితే ప్రభుత్వం చెల్లించే ఎంఎస్పీ మధ్యవర్తులకే లాభంగా మారి, రైతులకు శాపంగా మారుతుందని హెచ్చరించారు.

ఇవీ చ‌ద‌వండి: Andhra Pradesh Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమవుతున్న ఎండలు.. రెండు రోజులు భ‌గ‌భ‌గ‌లే.. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు
Andhra Pradesh Drought: మార్కాపురం జిల్లాలో కరవు తీవ్రత: ఐదు మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం
Andhra Pradesh Farmers: ఏపీలో అన్నదాతకు అన్ని ర‌కాలుగా అన్యాయం: MVS Nagireddy

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు