HomeAndhra PradeshKadapa Crime: ప్రేమోన్మాది కత్తికి బలైన అమాయక జీవితం.. హృద‌యాల్ని క‌ల‌చివేస్తున్న రామ‌కీర్త‌న హ‌త్య

Kadapa Crime: ప్రేమోన్మాది కత్తికి బలైన అమాయక జీవితం.. హృద‌యాల్ని క‌ల‌చివేస్తున్న రామ‌కీర్త‌న హ‌త్య

Kadapa Crime: ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు. ఇంటర్‌ చదివి పెద్ద కలలతో జీవితాన్ని చూసే వయసు. తల్లిదండ్రులకు ఆనందం, తమ్ముడికి అండ, కుటుంబానికి ఆశగా ఉన్న చిన్నారి రామకీర్తన ఇప్పుడు ఒక క్రూరమైన ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే విషాదంగా మారింది.

ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన దుండగుడు
ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతుల కుటుంబంలో ఇద్దరు కుమారులతో పాటు రామకీర్తన ఒకే ఒక్క కుమార్తె. ఆమె ఖాజీపేటలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు పూర్తి చేసింది. భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు, కలలు ఉన్న వయసులోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు తమ తమ పనుల కోసం బయటకు వెళ్లారు. తండ్రి శ్రీనివాసులు పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాలు కొనడానికి వెళ్లగా, తల్లి నాగమణి కూలి పనికి వెళ్లింది. తమ్ముడు పాఠశాలకు వెళ్లడంతో ఇంట్లో రామకీర్తన ఒంటరిగా ఉంది. అదే సమయాన్ని గమనించిన ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ అనే యువకుడు ఇంటికి చేరుకున్నాడు.

ఫోన్ ఎత్తలేదని కోపం… క్రూరమైన దాడి
వెంకటేష్ గత రెండు సంవత్సరాలుగా రామకీర్తనను ప్రేమించాలని వేధిస్తున్నట్టు సమాచారం. ఆమె మాత్రం అతని ప్రవర్తనను తిరస్కరించేది. శుక్రవారం ఉదయం కూడా అతను ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ రామకీర్తన స్పందించలేదు. దాంతో ఆవేశంతో ఇంటికే వెళ్లిన వెంకటేష్ కొడవలితో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
అమాయక బాలిక తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడిపోయింది.

తండ్రి చేతుల్లోనే చివరి ప్రయాణం
కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన తండ్రి శ్రీనివాసులు, పెద్ద కుమారుడు ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. అప్పటికీ రామకీర్తన ప్రాణాలతో ఉండటంతో వెంటనే ఆమె గొంతు వద్ద రక్తస్రావం ఆపేందుకు టవల్ చుట్టి చేతుల్లో ఎత్తుకుని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. హైవేపైకి రాగానే 108 అంబులెన్స్ ఎదురవడంతో అందులో కడప రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే బాలిక పరిస్థితి విషమించి ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ క్షణంలో తండ్రి చేతుల్లోనే తన కూతురు ప్రాణాలు విడిచిందన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

గ్రామంలో ఉద్రిక్తత
ఈ ఘటనతో అగ్రహారం గ్రామం ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది. బాలిక హత్యపై ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు ఖాజీపేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత ఖాజీపేట బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

“మా కూతురికి న్యాయం కావాలి”
ఈ ఘటనపై రామకీర్తన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. “మా ఇంటికే వచ్చి మా కూతురి గొంతుకోసి వెళ్లడం దారుణం. ఇలాంటి పని చేసిన వాడిని వదిలేది లేదు. మాకు జరిగిన అన్యాయం ఇంకో ఆడపిల్లకు జరగకూడదు.
నిందితుడికి ఉరిశిక్ష పడే వరకు పోరాడుతాం” అంటూ తల్లిదండ్రులు న్యాయం కోరుతున్నారు.

మరోసారి ప్రశ్నల ముందుకు వచ్చిన మహిళల భద్రత
ఈ దారుణ ఘటన మరోసారి మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ప్రేమ పేరుతో వేధింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో అలాంటి వేధింపులను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అంటున్నాయి.

ఒక చిన్నారి జీవితం ఇలా క్రూరంగా ముగిసిపోవడం కేవలం ఒక కుటుంబానికే కాదు… మొత్తం సమాజానికే బాధాకరమైన విషయం. రామకీర్తన కలలు ఆవిర‌య్యాయి. కానీ ఆమె కథ మాత్రం ప్రేమ పేరుతో జరుగుతున్న క్రూరత్వంపై సమాజం ఆలోచించేలా చేస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: Telangana Crime: అమానుషం.. ఆటవిక సమాజం! అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన ఘటన.. డబ్బు కోసం మానవత్వం మరిచిపోయామా?
Hyderabad Crime: ప్రేమ పెళ్లి అడ్డుకున్న కుటుంబం.. మ‌ధ్య‌లో ఓయో రూమ్.. పెళ్లి బట్టలతోనే యువకుడు దారుణం
Vizag Crime: విశాఖలో దారుణం.. యువతిని ముక్కలుగా నరికి హత్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు