Chittoor Police Helmet Campaign: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు సరికొత్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు “హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియమాలను పాటించే వారికి బహుమతులు అందజేస్తూ ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ SP తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందని అధికారులు గుర్తించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. కారు డ్రైవ్ చేసే వారు సీట్ బెల్ట్ వేసుకోవాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు. ట్రాఫిక్ నియమాలను పాటించాలి.. అనే అంశాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు.
హెల్మెట్ ధరించిన వారికి లక్కీ డ్రా
“హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు” కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపే వారికి ప్రత్యేకంగా లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో వారాంత లక్కీ డ్రాలు, నెలవారీ లక్కీ డ్రాలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. మొత్తంగా రూ.1,67,000 విలువైన బహుమతులు ఈ కార్యక్రమంలో భాగంగా ఇవ్వనున్నారు. నగదు బహుమతులతో పాటు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు కూడా అందజేయనున్నారు.
నమోదు ఎలా చేసుకోవాలి?
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వాహనదారులు చిత్తూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు. అదే విధంగా ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సోషల్ మీడియా ద్వారా నమోదు Instagram: spchittoor, Facebook: Chittoordistrictpolice, WhatsApp: 9154881257. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా వివరాలు పంపి నమోదు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్‌ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. సంప్రదించవలసిన వ్యక్తి Traffic Inspector నిత్యబాబు. ఫోన్: 9491074515.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించడంతో పాటు బహుమతులు కూడా గెలుచుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: AP Police : ఇష్టానుసారం అరెస్టులు చేస్తే కోర్టులో మాకు చీవాట్లు.. జనసైనికుడికి ఏపీ పోలీసుల హితబోధ
Police Station : మోసగాళ్లకు మోసగాడు.. పోలీస్ స్టేషన్‌కే ఎసరు పెట్టాడు!
Police Commemoration Day: నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం.. అణచివేసిన చరిత్ర
