Raithu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం ఇంకా అందకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. పంటల సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సహాయం రాకపోవడంతో రైతులు అప్పులు చేసుకుని వ్యవసాయ పనులు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులపై తాజాగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
కౌంటింగ్ ముగియగానే రైతుల అకౌంట్లలోకి..
రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రచారం ముగియగా, ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ-వేలం ద్వారా రూ.9 వేల కోట్ల రుణం పొందేందుకు ఇండెంట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే ఈ-వేలం ద్వారా నిధులు సమీకరించిన తర్వాత రైతు భరోసా మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
నిధుల కొరతే ప్రధాన కారణం?
మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందే రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం భావించినా, నిధుల కొరత వల్ల అది సాధ్యపడలేదని సమాచారం.
మరోవైపు జనవరిలో సంక్రాంతికి ముందే రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా, శాటిలైట్ సర్వే కారణంగా ఆలస్యమైందని చెబుతున్నారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ సర్వే ద్వారా పంట సాగవుతున్న భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాదాపు 10 శాతం భూముల్లో పంట సాగు జరగడం లేదని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భూములకు రైతు భరోసా నిలిపివేసే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రైతుల ఆశలు, ఆందోళనలు
పెట్టుబడి సాయం ఆలస్యం వల్ల అప్పులు పెరుగుతున్నాయని రైతుల వాపు
వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్
భరోసా నిధులు వస్తే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఉపయోగపడుతాయని ఆశ
మొత్తంగా చూస్తే, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: Telangana : తెలంగాణ రైతులకు ఎదురుచూపులకు తెరపడేనా? ఫిబ్రవరి చివర్లో పీఎం కిసాన్‌తో పాటు రైతు భరోసా నిధులు?
Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయంటే.. క్లారిటీ ఇచ్చిన సర్కార్
