Chandrababu Naidu: పోలవరం జిల్లా రంపచోడవరం పరిధిలోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై N. Chandrababu Naidu తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సీఎంఓ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం, దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌లో మొత్తం 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా వంటి లక్షణాలు కనిపించాయి. నిన్న ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే హాస్టల్‌ను తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్టు అధికారులు తెలిపారు. అలాగే మిగిలిన విద్యార్థులకు కూడా ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించినట్టు వివరించారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్థాలు, తాగునీటి నమూనాలు సేకరించినట్టు వెల్లడించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందజేయాలన్నారు.
అలాగే ఈ ఘటనపై రేపటిలోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Chandrababu Naidu : భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ లక్ష్యం: 2027 డిసెంబరు నాటికి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు – సీఎం చంద్రబాబు
Chandrababu : టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్: వైసీపీ ట్రాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి
