Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. 2027 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి రైతులు, భూ యజమానులందరికీ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగట్ల గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, 14 విశిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. భవిష్యత్తులో ఎవరూ రికార్డులు ట్యాంపర్ చేయకుండా, ఒక్క పైసా అవినీతి లేకుండా ఈ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. ఎవరైనా ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని, అవసరమైతే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భూమికి భద్రతే ప్రభుత్వ బాధ్యత
భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకమని సీఎం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం భూమి–నీరు–సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వివాదాలు లేని భూములు, ప్రతి ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు విధానమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడమే తన జీవితాశయమని చెప్పారు.
గత ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు
లోపభూయిష్టమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని, పట్టాదారు పాస్ పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై తమ ఫొటోలు ముద్రించుకోవడం శాడిజం కాదా? అని సీఎం ప్రశ్నించారు. లక్షల ఎకరాల ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా మార్చారని, రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. తాడేపల్లి వద్ద హెలిపాడ్ కోసం ప్రైవేటు భూమిని బలవంతంగా ప్రభుత్వ భూమిగా మార్చిన ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.
కొత్త పాస్ పుస్తకాల ప్రత్యేకత
ప్రతి పాస్ పుస్తకానికి యూనిక్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఉంటుందని, మొబైల్‌తో స్కాన్ చేస్తే భూమి వివరాలు, మ్యాప్ నేరుగా కనిపిస్తాయని సీఎం వివరించారు. డ్రాఫ్ట్ పాస్ పుస్తకాలను ముందుగా ఇచ్చి, భూ యజమానులు తమ వివరాలు సరిచూసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. eKYC ధృవీకరణ తప్పనిసరి చేయడం వల్ల తప్పిదాలకు ఆస్కారం ఉండదన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 37.40 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయని, అందులో 19 లక్షలు ఇప్పటికే పంపిణీ చేశామని చెప్పారు. మిగిలిన 18.40 లక్షలను ఏప్రిల్‌లోగా అందిస్తామని, సర్వే పూర్తయితే మరో 60 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వగలమని వెల్లడించారు.
సీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల ఘనత టీడీపీదే
రాయలసీమలో హంద్రినీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు రావడానికి Telugu Desam Party చొరవే కారణమని సీఎం తెలిపారు. అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణ చర్యలను Narendra Modi మన్ కీ బాత్‌లో ప్రస్తావించారని గుర్తు చేశారు. సీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చి, పండ్ల ఉత్పత్తిని మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.
పోలవరం 2027లో పూర్తి
పోలవరం ప్రాజెక్టును 2027లో పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరు అందించి, శ్రీశైలం నీటిని సీమకు మళ్లించామని వివరించారు.
లడ్డూ తయారీలో కల్తీపై సంచలన వ్యాఖ్యలు
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలతో చేసిన నెయ్యి వాడినట్టు National Dairy Development Board నివేదిక స్పష్టం చేసిందని సీఎం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీలో ప్రక్షాళన మొదలుపెట్టామని తెలిపారు. మొత్తంగా, భూ భద్రత, సాగునీటి విస్తరణ, సీమ అభివృద్ధి, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
