Revanth Reddy: కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, అలాగే సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై A. Revanth Reddy స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు. ఏ జిల్లాను తొలగించే ఆలోచన గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు.
‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
“4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాను. ఏ జిల్లాను రద్దు చేయడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం గానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆలోచనలో లేదు. భవిష్యత్తులో ఎక్కడైనా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరం వచ్చినా, ప్రజలకు ముందుగా చెప్పి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని సీఎం వెల్లడించారు.
భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతమని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించే శక్తి అక్కడి ప్రజలకు ఉందని పేర్కొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
సింగరేణి మెడికల్ బోర్డు విషయంలో కూడా జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది కార్మిక కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తారని, వారసత్వ ఉద్యోగాలు పోతాయని జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
“సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయాలన్న ఆలోచననే ప్రభుత్వం చేయడం లేదు. కార్మికుల ప్రయోజనాలకే ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. కార్మికులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
2027లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాలపై కూడా ముఖ్యమంత్రి వివరించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులు నిర్మించి పర్యాటకాన్ని మరింత ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
గతంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని, అలాగే మేడారంను దక్షిణ కుంభమేళాగా తీర్చిదిద్దుతూ సమ్మక్క–సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.6,116 కోట్లను కేటాయించినట్టు సీఎం వెల్లడించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ గారి సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ‘సమ్మక్క–సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.
ఇవీ చదవండి: Kishan Reddy vs Revanth Reddy : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలి: కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
KCR vs Revanth : తెలంగాణలో ‘జాతిపిత’ వ్యాఖ్యలు: రాజకీయ వేడి పెంచుతున్న బీఆర్ఎస్–కాంగ్రెస్ మాటల యుద్ధం
