HomeAgricultureAndhra Pradesh : శనగ రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఇదే.. దిగుమతి సుంకాల పెంపు...

Andhra Pradesh : శనగ రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఇదే.. దిగుమతి సుంకాల పెంపు – MSP బోనస్ అవసరం

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో రబీ సీజన్‌లో వరి తర్వాత అత్యధికంగా సాగు అయ్యే పంట శనగ. ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, కడప, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల మెట్ట ప్రాంతాల్లో ఈ పంట విస్తృతంగా సాగవుతోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.7 లక్షల హెక్టార్లలో శనగ సాగు జరిగినట్లు అంచనా.

దేశవ్యాప్తంగా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది శనగ సాగు విస్తీర్ణం 4.66 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. అంటే ఉత్పత్తి పెరగడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి తక్కువ సుంకంతో శనగలు దిగుమతి కావడం దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

డ్యూటీ ఫ్రీ దిగుమతుల దుష్ప్రభావం
2024 మే నుంచి 2025 మార్చి వరకు శనగలపై పూర్తిస్థాయి డ్యూటీ ఫ్రీ దిగుమతులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీని కారణంగా భారీగా విదేశీ శనగలు దేశంలోకి వచ్చాయి. ఫలితంగా:

దేశీయ మార్కెట్ ధరలు పడిపోయాయి
రైతులకు MSP కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది
రైతులు నష్టంతో, distress sale కు దిగజారాల్సి వచ్చింది
కోల్డ్ స్టోరేజీల్లో గత ఏడాది నిల్వలు ఇంకా ఉండిపోయాయి
2025 ఏప్రిల్ 1 నుంచి కేవలం 10% సుంకం మాత్రమే విధించడం కూడా రైతులకు సరిపడ రక్షణ ఇవ్వడం లేదు.

గతంలో ఉన్న రక్షణాత్మక విధానం
2020 నుంచి 2024 ఏప్రిల్ వరకు శనగలపై మొత్తం సుంకం (BCD + AIDC) కలిపి 60% ఉండేది. ఈ విధానం దేశీయ రైతులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే స్థాయి సుంకాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

రైతుల ప్రధాన డిమాండ్లు
శనగల దిగుమతులపై మళ్లీ మొత్తం 60% సుంకం విధించాలి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన MSP వాస్తవ ఖర్చులు (A2) కూడా కవర్ చేయడం లేదు కాబట్టి క్వింటాలుకు కనీసం రూ.1000 బోనస్ ప్రకటించాలి.
ఈ అంశాలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి Piyush Goyal గారికి, కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రి Shivraj Singh Chouhan గారికి శనగ రైతుల తరపున విజ్ఞప్తి పంపించారు.

విధానపరమైన సూచన
ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా విదేశాల నుంచి దిగుమతి అయ్యేటప్పుడు, అది దేశంలోకి చేరేసరికి మన MSP కంటే కనీసం 10% ఎక్కువ ధర ఉండేలా సుంకాలు విధించాలి. అలా లేకపోతే దేశీయ రైతుల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

శనగ రైతులు కేవలం మద్దతు కోరడం కాదు, తమకు న్యాయం కావాలని కోరుతున్నారు. దిగుమతి విధానాల్లో మార్పులు చేసి, MSPకి అదనపు బోనస్ ప్రకటిస్తేనే రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది రైతుల పక్షాన నిలబడే కీలక నిర్ణయంగా నిలుస్తుంది.

  • MVS NagiReddy

ఇవీ చ‌ద‌వండి: Andhra Pradesh : కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యల ఘోష.. వాస్తవాలకు పాతరేశారా?
Kandi crop : కంది పంటకూ తంటా.. గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు