Dwcra women : డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ అనే బ్రాండ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలో బుధవారం సెర్ప్, మెప్మాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు సూచించిన రెండు లోగో డిజైన్లను పరిశీలించిన సీఎం, లోగో ఖరారు విషయంలో డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. మెజారిటీ అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
“డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వారికి సరైన మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. స్థానిక మార్కెట్లకే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించే స్థాయిలో బ్రాండ్ రూపకల్పన ఉండాలి. బ్రాండ్ పేరు, లోగో చూస్తేనే ఉత్పత్తుల వెనుక ఉన్న కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఉండాలి. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు కాబట్టి ‘స్వయం’ అనే పేరు చాలా అనుకూలంగా ఉంటుంది” అని తెలిపారు.
ఈ సమీక్షలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘స్వయం’ బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ఒక సమగ్ర గుర్తింపు లభించనుండగా, మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు రాష్ట్ర ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌లో స్థానం దక్కే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: Collectors Conference : బ్యాంకుల్లో డ్వాక్రా సంఘాల పొదుపు రూ.20,739 కోట్లు
YS Jagan fire on Babu: డ్వాక్రా సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర
