Mumbai Airport : ముంబైలోని Chhatrapati Shivaji Maharaj International Airport వద్ద తీవ్ర ప్రమాదం తృటిలో తప్పింది. ల్యాండింగ్ అనంతరం టాక్సింగ్ సమయంలో రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనలో IndiGo మరియు Air India విమానాలు భాగస్వామ్యమయ్యాయి.
హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన ఒక విమానం, ముంబై నుంచి కోయంబత్తూర్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని రెక్క చివర భాగంతో స్వల్పంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అయితే, రెక్కలు స్వల్పంగా తాకడం వల్ల పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై Directorate General of Civil Aviation (DGCA) సీరియస్‌గా స్పందించింది. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన డీజీసీఏ, రెండు విమానయాన సంస్థలను పూర్తి నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పష్టీకరణ
ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారికంగా స్పందించింది. ఫిబ్రవరి 3, 2026న హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన తమ విమానం 6E 791 ల్యాండింగ్ అనంతరం టాక్సీలో వెళ్తున్న సమయంలో, మరో విమానయాన సంస్థకు చెందిన విమానాన్ని రెక్క చివర భాగంతో తాకినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి గాయాలు జరగలేదని ఇండిగో స్పష్టం చేసింది.
సంఘటన జరిగిన వెంటనే సంబంధిత ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించామని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ప్రయాణికుల భద్రత, సిబ్బంది రక్షణ, విమానాల సేఫ్టీ తమకు అత్యంత ప్రాధాన్యత అని ఇండిగో పేర్కొంది.
ప్రయాణికుల్లో ఆందోళన
ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాల వార్తలు వెలుగులోకి వస్తుండటంతో ప్రయాణికుల్లో భయాందోళన పెరుగుతోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ సంఘటన కూడా విమాన భద్రతపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. డీజీసీఏ దర్యాప్తు తర్వాత ఈ ఘటనకు గల పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్ట్ సర్వం సిద్ధం.. రేపే తొలి విమానం టెస్టింగ్.. క్రెడిట్ ఎవరిది?
Air India Pilot Incident: పెగ్గేసి డ్యూటీ ఎక్కిన పైలట్.. వాంకోవర్ విమానాశ్రయంలో కెనడా పోలీసులు అదుపులోకి!
