JD Vance : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కుటుంబంలో త్వరలో మరో ఆనందం చేరనుంది. ఆయన సతీమణి ఉషా వాన్స్ 2026 జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, మిలటరీ వైద్యుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జేడీ వాన్స్ తెలిపారు.
అమెరికా చరిత్రలో వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండగానే ‘సెకండ్ లేడీ’ ప్రసవం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది. ఈ వార్త దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, భారతీయ వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.
ఇప్పటికే ముగ్గురు పిల్లలు
జేడీ వాన్స్ – ఉషా వాన్స్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉంది. వారి పెద్ద కుమారుడు ఇవాన్ 2017లో జన్మించాడు. ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయసులో ఉన్న ఇవాన్ మీడియా హడావిడికి దూరంగా సాధారణ బాలుడిగా పెరుగుతున్నాడు.
రెండో కుమారుడు వివేక్ 2020 ఫిబ్రవరిలో జన్మించాడు. అమెరికా రాజకీయ నాయకుడి కుమారుడికి తెలుగు పేరు పెట్టడం అప్పట్లో విశేషంగా చర్చకు దారి తీసింది. వివేక్ పుట్టినరోజు సందర్భంగా జేడీ వాన్స్ సెనేట్‌లో పిల్లల పుస్తకం ‘డాక్టర్ సీస్’ చదివి వినిపించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మూడో సంతానంగా 2021 డిసెంబర్‌లో వాన్స్ దంపతులకు కూతురు పుట్టింది. ఆమెకు మిరాబెల్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం మిరాబెల్ వయసు సుమారు నాలుగేళ్లు.
తెలుగు మూలాలు.. కుటుంబ విలువలకు ప్రాధాన్యం
వివేక్ అనే తెలుగు పేరు పెట్టడమే కాకుండా, పిల్లల పెంపకంలో భారతీయ – ముఖ్యంగా తెలుగు సంప్రదాయాలకు ఉషా వాన్స్ పెద్దపీట వేస్తున్నారట. ఉషా వాన్స్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడంతో, ఇంట్లో మన విలువలు, సంస్కృతి ప్రతిఫలిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఎన్ని అధికార బాధ్యతలున్నా, పిల్లలతో గడిపే సమయానికే తాము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని జేడీ వాన్స్ పలుమార్లు వెల్లడించారు. “పిల్లలు నాకు భారం కాదు.. అది జీవితంలో దక్కిన గొప్ప బాధ్యత” అని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికే పలువురిని ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు నాలుగో చిన్నారి రాకతో వాన్స్ కుటుంబం మరింత ఆనందం, సందడితో నిండనుంది.
ఇవీ చదవండి: Most prestigious universities in the world : 2025లో ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు.. అమెరికా ఆధిపత్యం… ఆసియా, యూరప్ నుంచి గట్టి పోటీ
America : 21 దేశాలకు ప్రయాణాలు వద్దన్న ట్రంప్.. అమెరికా పౌరులకు ఆ దేశ సర్కార్ కీలక హెచ్చరిక
