Mana Shankaravaraprasad Garu : సంక్రాంతి బరిలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో చిరు మళ్లీ వింటేజ్ ఫామ్‌లోకి వచ్చారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విజయం, నటీనటులతో అనుభవాలు, ముఖ్యంగా వెంకటేశ్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రేక్షకుల స్పందన చూస్తే హృదయం నిండిపోయింది
సినిమా విడుదలైన తర్వాత థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులు తిరిగి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సుష్మిత తెలిపారు.
మెగా అభిమానులు “బాస్ ఈజ్ బ్యాక్” అంటూ జరుపుకుంటుండటం చూస్తే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. వింటేజ్ చిరంజీవిని చూడాలనే అభిమానుల కోరికను దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా నెరవేర్చారని ప్రశంసించారు.
చిరంజీవి అంకితభావం గురించి ప్రత్యేకంగా సెట్‌లో చిరంజీవి పూర్తిగా దర్శకుడి విజన్‌కే ప్రాధాన్యం ఇస్తారని సుష్మిత వెల్లడించారు. ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యం, పనిపై క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని తెలిపారు.
తనను నిర్మాతగా మాత్రమే చూస్తారని, కూతురిగా ప్రత్యేక ప్రాధాన్యం ఎప్పుడూ ఇవ్వలేదని చెప్పారు.
కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన ప్రయాణం
కొణిదెల ప్రొడక్షన్స్‌లో మొదట తాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశానని, ఆ సమయంలో కూడా పారితోషికం తీసుకునేదానినని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవి దుస్తుల ఎంపికలో తానూ ఎంతో శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు.
ఇటీవల వైరల్ అయిన “మీసాల పిల్ల” లుక్ కాస్ట్యూమ్‌ను తానే వ్యక్తిగతంగా కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చానని, అది సినిమాలో ఐకానిక్‌గా మారడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
వెంకటేశ్ పాత్రే సినిమాకు హైలైట్
ఈ సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, ఆయన పాత్ర ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అయిందని సుష్మిత చెప్పారు.
వెంకటేశ్ ఈ ప్రాజెక్టును ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించారని తెలిపారు.
“వెంకటేశ్ గారి రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిబేట్ జరగలేదు. ఆయన పాత్రకు ఎంత ఇవ్వాలన్నా మాకు ఆనందమే. ఆయన తీసుకున్న పారితోషికానికి పూర్తి న్యాయం చేశారు” అని సుష్మిత వ్యాఖ్యానించారు.
వ్యక్తిగతంగా కూడా వెంకటేశ్ ఎంతో పాజిటివ్ వ్యక్తి అని, చిరంజీవి–వెంకటేశ్ మధ్య ఉన్న అనుబంధం సెట్‌లో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. వీరిద్దరితో పూర్తి నిడివి సినిమా చేసే అవకాశం వస్తే అది జీవితంలో గొప్ప అదృష్టమని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా చూడలేదు
ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఇంకా చూడలేదని, ఆయనకు ప్రత్యేకంగా చూపించడానికి ఎదురుచూస్తున్నామని సుష్మిత ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా విజయం వెనుక కుటుంబ భావోద్వేగాలు, అనుభవం ఉన్న నటీనటులు, సరైన కమర్షియల్ బ్యాలెన్స్ ప్రధాన కారణాలని ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ఇవీ చదవండి: Mana Shankara Vara Prasad Garu : మన శంకరవరప్రసాద్ గారు తొలిరోజు కలెక్షన్స్
Peddi Movie : పెద్ది సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్: కీలక పాత్రలో కనిపించనున్న సీనియర్ నటి!
