Vishnu Vinod : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ బ్యాటర్ Vishnu Vinod ఊహించని విధ్వంసం సృష్టించాడు. పుదుచ్చేరి బౌలర్లపై ఒంటిచేత్తో మ్యాచ్‌ను తేల్చేసిన అతడు, కేవలం 84 బంతుల్లోనే 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో కేరళకు సంచలన విజయం అందించడంతో పాటు దేశీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.
248 లక్ష్యాన్ని 29 ఓవర్లలోనే ఛేదించిన కేరళ
పుదుచ్చేరి నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని కేరళ జట్టు కేవలం 29 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్ (8), స్టార్ ప్లేయర్ Sanju Samson (11) త్వరగానే పెవిలియన్ చేరినా, విష్ణు వినోద్ మాత్రం ఏమాత్రం తడబడలేదు. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు.
బౌండరీల వరద.. స్ట్రైక్ రేట్ 192+
విష్ణు వినోద్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 14 భారీ సిక్సులు, 13 ఫోర్లు బాదాడు. అంటే అతను చేసిన 162 పరుగుల్లో 136 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం విశేషం. 29 డాట్ బాల్స్ ఆడినా, మిగిలిన బంతుల్లో బౌలర్లపై విరుచుకుపడి 192కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు.
63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన విష్ణుకు ఇది లిస్ట్-ఏ కెరీర్‌లో అత్యధిక స్కోరుగా నిలిచింది.
విజయ్ హజారేలో ‘సిక్సర్ల వీరుడు’
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విష్ణు వినోద్ ఇప్పుడు నిజమైన ‘సిక్సర్ల వీరుడు’గా మారుతున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో అతను మొత్తం 106 సిక్సులు బాదాడు. అత్యధికంగా 109 సిక్సర్లు కొట్టిన మనీష్ పాండే రికార్డును అధిగమించేందుకు అతడు కేవలం 4 సిక్సర్ల దూరంలోనే ఉన్నాడు.
ప్రతి 19.9 బంతులకు ఒక సిక్సర్ బాదుతూ, ఈ టోర్నీలోనే అత్యుత్తమ బాల్/సిక్సర్ నిష్పత్తి కలిగిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ గణాంకాలే అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యానికి నిదర్శనం.
ఐపీఎల్‌లో అవకాశాల కోసం ఎదురుచూపు
విష్ణు వినోద్ టాలెంట్ కొత్తది కాదు. అయితే ఐపీఎల్‌లో అతనికి ఇప్పటివరకు సరైన అవకాశాలు రాలేదు. 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అరంగేట్రం చేసినా కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత 2023లో ముంబై ఇండియన్స్ తరపున కూడా కొన్ని మ్యాచ్‌లే ఆడాడు.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్న విష్ణు వినోద్, విజయ్ హజారే ట్రోఫీలో చూపిస్తున్న ఈ అద్భుత ఫామ్ చూస్తుంటే… ఐపీఎల్ 2026లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయమనే అంచనాలు బలపడుతున్నాయి. ఈ ఇన్నింగ్స్‌ను చూసిన పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా ఫిదా అవుతుందనడంలో సందేహమే లేదు.
ఇవీ చదవండి: Rinku Singh: 5 సిక్సర్లతో మారిపోయిన జీవితం.. కాబోయే భార్య ఎమోషనల్
ODI Records: వారెవ్వా.. ఏమిటీ రికార్డులు.. బౌండరీలు, సిక్సర్లు లేకుండా భారీ ఇన్నింగ్స్!
