ABN RK : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా కూటమి ప్రభుత్వంలో మీడియా సంస్థ అధినేత బొల్లినేని రాజగోపాల్ నాయుడు (BR Naidu)ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఆ పదవి ఆశించిన మరో మీడియా సంస్థ అధినేత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ABN RK) అలకబూని, అప్పుడప్పుడూ చంద్రబాబు సర్కారుపై రుసరుసలు పడుతుంటారు. అయితే, తొలుత బీఆర్ నాయుడుకు ఇచ్చినా, వచ్చే టర్మ్ లో ఆర్కేకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ లభించినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ముగియనున్న బీఆర్ నాయుడు పదవీకాలం
టీటీడీ చైర్మన్ పదవి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. అయితే, దీన్ని అవసరమైతే పొడిగించుకోవచ్చు. ఆ మేరకు ప్రభుత్వాలు తమ అనుకూలతలను బట్టి పోతుంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే టీటీడీ బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడుకు అవకాశం దక్కింది. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 2024 నవంబర్ 6న ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు. 2025 నవంబర్ కు ఏడాది పూర్తి అయ్యింది. ఇక 2026 ఈ ఏడాది అక్టోబర్ ఆఖరుకల్లా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి కానుంది.
నాటి నుంచి ఆర్కే అలక
టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడుకు పదవి దక్కినప్పటి నుంచి ఆర్కే మధనపడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. తనకు దక్కాల్సిన పదవిని ఆయన ఎగరేసుకుపోయారన్న ఆవేదన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నాటినుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకునే నిర్ణయాలు, భక్తుల ఇక్కట్లు, అపచారాలు, లోటుపాట్లను ఇతర మీడియాల కంటే ఎక్కువగా ఆర్కేనే ఫోకస్ గా చూపిస్తున్నారు. దేవదేవుడి సన్నిధిలో ఏమిటీ దారుణాలు అన్నట్లుగా పత్రిక, టీవీల్లో పుంఖానుపుంఖాలు కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, స్కాములను తన పత్రికలు, టీవీ ఛానల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
ప్రతిపక్షం సెటైర్లు
సాక్షి మీడియా కంటే ఎక్కువగా రాధాకృష్ణ పత్రికలోనే టీటీడీ తప్పిదాలు ప్రముఖంగా వస్తున్నాయి. అంతేకాదు.. కూటమి ప్రభుత్వ లోటుపాట్లపైనా ఆర్కే అప్పుడప్పుడూ బాంబు పేల్చినట్లుగా కథనాలు వండివారుస్తుంటారన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల దందాలను జిల్లా ఎడిషన్లలో బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ దీనిపై సెటైర్లు కూడా వేస్తుంటుంది. ప్యాకేజీ డబ్బులు ఆలస్యం అయ్యాయేమో, అందాల్సినవి ఇంకా అందలేదేమో.. అందుకే ఇలా సర్కారుపై బాణాలు వేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ అటు సోషల్ మీడియాలో, ఇటు పొలిటికల్ గానూ కామెంట్లు వినిపిస్తుంటాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై ఒక్కోసారి ఒక్కోలా కథనాలు వేస్తుంటారు. ఒకసారి పొగుడుతూ, ఒకసారి తిడుతూ, మరోసారి తిట్టాడా, పొగిడాడా అన్న అనుమానం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏబీఎన్ టీవీ ఛానల్లో కథనాలు వస్తుంటాయి. దీంతో ఆర్కే అలక తెలియాలన్న సంకేతాలు పంపుతున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.
హామీ లభించిందా?
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ నుంచి ఏబీఎన్ ఆర్కేకి హామీ లభించినట్లు తెలుస్తోంది. వచ్చే టర్మ్ టీటీడీ చైర్మన్ గా రాధాకృష్ణకే అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు భోగట్టా. అయినప్పటికీ తనదైన శైలిలో ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల కథనాలు సదరు మీడియా సంస్థలో వస్తుంటాయి. తన నిరసనను ఆర్కే ఇలా చూపిస్తున్నారంటూ టీడీపీలో కొందరు చెబుతున్నారు. 2026 నవంబర్ 5కల్లా బీఆర్ నాయుడు చైర్మన్ గా పదవీకాలం ముగియగానే కొత్త పాలక మండలి చైర్మన్ గా ఆర్కేను నియమిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో అప్పటి వరకు కూడా ఆర్కే వేసే పూల బాణాలు, మధ్య మధ్యలో ముళ్ల బాణాలు చంద్రబాబు సర్కారు ఎదుర్కోవాల్సిందేనన్న చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: TTD: బీఆర్ నాయుడు చైర్మన్‌గా తొలి భేటీ.. టీటీడీ కీలక నిర్ణయాలు!
TTD Chairman: లోకేష్ మార్క్.. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. ఆర్కే పరిస్థితి?
