Star Rating : కొత్త ఏడాది ప్రారంభంతో పాటు గది ఎయిర్ కండిషనర్ల (RAC) ధరలపై కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. Bureau of Energy Efficiency (BEE) తాజాగా సవరించిన స్టార్ రేటింగ్ నిబంధనలను అమల్లోకి తీసుకురావడంతో, ఏసీలు మరియు ఇతర కూలింగ్ ఉపకరణాల ధరలపై ప్రభావం పడనుంది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి.
సవరించిన BEE ప్రమాణాల ప్రకారం ప్రస్తుతం ఉన్న స్టార్ రేటింగ్‌లను తిరిగి నిర్వచించారు. ఇప్పటి వరకు 5-స్టార్‌గా ఉన్న ఏసీలు ఇకపై 4-స్టార్‌గా పరిగణించబడతాయి. అలాగే ప్రస్తుత 4-స్టార్ 3-స్టార్‌గా, 3-స్టార్ 2-స్టార్‌గా మారనుంది. దీంతో వినియోగదారులకు కనిపించే స్టార్ లేబుల్ మారినా, శక్తి సామర్థ్యం పరంగా ప్రమాణాలు మరింత కఠినంగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం రూపొందించిన కొత్త 5-స్టార్ ఏసీలు పాత మోడళ్లతో పోలిస్తే దాదాపు 10 శాతం అధిక శక్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే ఈ అధిక సామర్థ్యానికి అనుగుణంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సగటున కొత్త స్టార్ రేటింగ్ మోడళ్ల మధ్య సుమారు 5 శాతం ధర వ్యత్యాసం ఉండేలా రూపొందించారు.
ఈ అంశంపై Blue Star మేనేజింగ్ డైరెక్టర్ B. Thiagarajan స్పందిస్తూ, సవరించిన నిబంధనలు ధరలను దాదాపు 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని తెలిపారు. “కొత్త 5-స్టార్ అనేది పూర్తిగా కొత్త ఉత్పత్తి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇది 6 లేదా 7-స్టార్ స్థాయికి సమానం. అందుకే ఈ మోడళ్లకు ఎక్కువ ధర ఉండటం సహజం” అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల GST సంస్కరణల కారణంగా ఏసీ పరిశ్రమకు కొంత ప్రయోజనం లభించినప్పటికీ, దీర్ఘకాలంలో శక్తి సామర్థ్య ప్రమాణాలు పెరగడం పరిశ్రమ స్థిరత్వానికి అవసరమని తయారీదారులు భావిస్తున్నారు. డిమాండ్ పెరుగుతున్న వేళ, విద్యుత్ వినియోగాన్ని సమతుల్యం చేయడం కూడా కీలకమని వారు చెబుతున్నారు.
మరోవైపు, ప్రపంచ మార్కెట్లలో రాగి ధరల పెరుగుదల, ముడి పదార్థాల ఖర్చు అధికమవడం, అలాగే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు తయారీదారులపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరలు తగ్గే అవకాశం తక్కువేనని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ విషయంపై Daikin Air Conditioning India చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ Kanwaljeet Jawa మాట్లాడుతూ, “BEE లేబులింగ్ ప్రమాణాలు కఠినంగా మారుతున్నాయి. అదే సమయంలో రాగి వంటి ముడి పదార్థాల ధరలు పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. అందువల్ల ఏసీల ధరలు పెరగడం తప్పదని” స్పష్టం చేశారు.
మొత్తానికి, కొత్త స్టార్ రేటింగ్ విధానం వల్ల వినియోగదారులకు దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులపై లాభం ఉన్నప్పటికీ, తక్షణంగా ఏసీల కొనుగోలుపై కొంత అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: New Year : కొత్త ఏడాది వేళ ప్రజలకు మరో షాక్.. జనవరి నుంచే పెరగనున్న ఏసీ ధరలు!
AP Assembly : తొలిరోజు అసెంబ్లీ.. జీఎస్టీ సంస్కరణలు స్వాగతిస్తూ తీర్మానం
