Good News GST : సాధారణ మరియు మధ్యతరగతి ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు జీఎస్‌టీ మండలి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రకటించిన “దీపావళి కానుక” దసరాకు ముందే చేరింది. చపాతీ, పరోటా, బ్రెడ్, బన్నులపై జీఎస్‌టీని పూర్తిగా ఎత్తివేయాలని మండలి నిర్ణయించింది. (Good News GST)
ఆరోగ్య & బీమాపై కూడా ఉపశమనం
జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ప్రస్తుత 18% జీఎస్‌టీ తొలగించనుంది. దీంతో ప్రీమియంలు తగ్గి కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించనుంది. ఇకపై జీఎస్‌టీలో 5% మరియు 18% శ్లాబులు మాత్రమే అమలులో ఉండగా, 12% మరియు 28% పన్ను శ్లాబులు రద్దు అవుతున్నాయి. బంగారం, వెండి, వజ్రాలపై 3% ప్రత్యేక రేటు కొనసాగనుంది.
కొత్త రేట్లు ఎప్పటి నుంచి?
సెప్టెంబర్ 22 నుంచి (దేవీ నవరాత్రి ప్రారంభం) ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. అన్ని రాష్ట్రాలు కేంద్రం ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘సామాన్యుడు దృష్టిలో పెట్టుకుని తీసుకున్న సంస్కరణలతో రైతులు, కార్మికులు, ఆరోగ్య రంగం, మధ్యతరగతి ప్రజలు లాభపడతారు’’ అని ఆమె వెల్లడించారు.
ధరలు తగ్గనున్న ఉత్పత్తులు
ఆహార పదార్థాలు: బ్రెడ్, పరాటా, చపాతీ, పాల ఉత్పత్తులు, బిస్కెట్లు, చాక్లెట్లు, జామ్, ఐస్‌క్రీమ్, డ్రై నట్స్, కార్న్‌ఫ్లెక్స్.
గృహావసరాలు: టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, సబ్బులు, షాంపూలు, నెయ్యి, బటర్, టాల్కమ్ పౌడర్, గొడుగులు, సైకిళ్లు, ఫర్నీచర్.
కట్టడం సామగ్రి: సిమెంట్ (28% నుంచి 18%కి).
ఎలక్ట్రానిక్స్: 350cc లోపు బైకులు, ఏసీలు, డిష్‌వాషర్లు, 32 అంగుళాలకు పైగా టీవీలు.
వాహనాలు: చిన్న, మధ్య తరహా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, సిఎన్‌జీ కార్లపై పన్ను 18%కి తగ్గింపు.
అధిక పన్ను రేటు కొనసాగుతున్నవి
లగ్జరీ కార్లు, పెద్ద వాహనాలు, వ్యక్తిగత విమానాలు, రేసింగ్ కార్లు, క్యాసినోలు, లాటరీలు – 40% పన్ను.
పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా) – ప్రస్తుత 28% + సెస్సు కొనసాగుతుంది. భవిష్యత్తులో 40% రేటు అమలు చేయనున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై ఎప్పటిలాగే 5% జీఎస్‌టీ.
ప్రభుత్వ అంచనాలు
జీఎస్‌టీ సంస్కరణలతో రూ.48,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని కేంద్రం అంచనా.
వినియోగం పెరిగి జీడీపీ వృద్ధి 0.5% అదనంగా నమోదు అవుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా టారిఫ్‌ల వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రభావాన్ని ఈ సంస్కరణలు సమతుల్యం చేస్తాయని భావిస్తున్నారు.
ప్రధాని మోదీ స్పందన
‘‘సామాన్యులు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు లాభపడేలా జీఎస్‌టీ సంస్కరణలు తీర్చిదిద్దాం. వీటితో పౌరుల జీవన ప్రమాణం మెరుగుపడుతుంది’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
👉 ఈ నిర్ణయాలతో సాధారణ వినియోగదారులు గణనీయంగా లాభపడనున్నారు.
ఇవీ చదవండి: Bharat: జీఎస్టీపై సర్‌ఛార్జ్‌కు ప్రతిపాదన అత్యంత దారుణం
GST council: ఎట్టకేలకు ఓ మీటింగ్‌కు హాజరైన తెలంగాణ ప్రభుత్వం.. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రి హరీష్‌రావు
