Mohanlal: మలయాళీ సినీ దిగ్గజం Mohanlal కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా పక్షవాతం సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె, కొచ్చి ఎలమక్కరలోని మోహన్‌లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.
శాంతకుమారి భర్త దివంగత విశ్వనాథన్ నాయర్—రాష్ట్ర మాజీ లీగల్ సెక్రటరీ. సమాచారం ప్రకారం, ఆమె చివరి క్షణాల్లో సంరక్షకులు ఆమె వెంట ఉన్నారు. తల్లి మృతి వార్త అందగానే మోహన్‌లాల్ ఎర్నాకుళంలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ రాత్రికే శాంతకుమారి పార్థివదేహాన్ని తిరువనంతపురానికి తరలించనుండగా, అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు.
గతంలో తన తల్లి 89వ పుట్టినరోజు సందర్భంగా ఎలమక్కరలో మోహన్‌లాల్ ఓ సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శాంతకుమారి అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, నగరంలోని ముదవన్ముగల్ కేశవదేవ్ రోడ్డులో ఉన్న ‘హిల్‌వ్యూ’ నివాసంలో దీర్ఘకాలంగా ఉంటున్నారు.
ప్రస్తుతం మోహన్‌లాల్ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే సినీరంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. మలయాళంతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన, తల్లి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇవీ చదవండి: Kannappa Movie Review : కన్నప్ప మూవీ రివ్యూ, రేటింగ్.. భక్తి, యాక్షన్, ఎమోషన్స్!
