America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలపై వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుంకాల నుంచి వీసాల వరకు ప్రతీ అంశంలోనూ కఠిన వైఖరినే అవలంబిస్తున్నారు. తాజాగా టూరిస్ట్ వీసాల విషయంలో కూడా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
అమెరికాకు వచ్చి అక్కడ పిల్లలను కనడం ద్వారా పుట్టబోయే శిశువుకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నారని అనుమానం వచ్చినట్లయితే, అటువంటి దరఖాస్తులను నేరుగా తిరస్కరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా ఎంబసీ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పర్యటన ఉద్దేశం కాకుండా, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ పొందడమే లక్ష్యంగా ఉందని భావిస్తే టూరిస్ట్ వీసా మంజూరు చేయబోమని అమెరికా స్పష్టంగా హెచ్చరించింది. ఈ తరహా అడ్డదారి ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని పేర్కొంది.
అమెరికాలో పుట్టిన పిల్లలకు స్వయంగా పౌరసత్వం లభించే విధానం శతాబ్దకాలంగా అమల్లో ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు విదేశీయులు అక్కడ ప్రసవం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో ట్రంప్ ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తిగా సమీక్షిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే, జన్మహక్కు పౌరసత్వానికి ముగింపు పలుకుతూ జనవరి 20న ట్రంప్ కీలక ఉత్తర్వుపై సంతకం చేశారు.
అయితే ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధతపై వివాదం నెలకొనడంతో, ఈ అంశం ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు పౌరులు కాదనే ట్రంప్ ఉత్తర్వును కోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలో దీనిపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
జన్మహక్కు పౌరసత్వం ద్వారా దేశంలోకి వచ్చే లక్షల మందికి ఆశ్రయం కల్పించే సామర్థ్యం అమెరికాకు లేదని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన వాదనకు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఇప్పటికే పొందిన పౌరసత్వాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, అమెరికాకు వచ్చే విదేశీ పర్యాటకులు తమ సోషల్ మీడియా హిస్టరీని తప్పనిసరిగా వెల్లడించాలనే నిబంధనపై కూడా ట్రంప్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తే, రానున్న రోజుల్లో అమెరికా వీసా ప్రక్రియ మరింత కఠినంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: Donald Trump on India-Pakistan War: “నేను లేకుంటే భారత్–పాక్ యుద్ధమే జరిగేది” : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump : భారత్ గొప్ప దేశం.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు
