HomeAgricultureKWDT : కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

KWDT : కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

KWDT : కృష్ణా జలాల అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడుకు, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల 2వ ట్రైబ్యునల్‌ (కెడబ్ల్యూడీటీ–2) విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరారు.

శుభాభినందనలతో కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకు రావాలని భావిస్తున్నాను.

కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితో పని చేయకపోవడం చాలా బాధాకరం. కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలో జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ తాలపాత్ర సభ్యులుగా ఏర్పాటైన కృష్ణా జల వివాదాల 2వ ట్రైబ్యునల్‌ (కెడబ్ల్యూడీటీ–2) ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చాలా పేలవమైన వాదనలు వినిపిస్తోంది.

కెడబ్ల్యూడీటీ–2కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనిల్‌కుమార్‌ గోయల్‌ సమర్పించిన అఫిడవిట్‌ అందుకు ఒక ఉదాహరణ. ఇంకా కెడబ్ల్యూడీటీ–2 ఎదుట వాదనల సమయంలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన వాదించిన న్యాయవాది వైద్యనాథన్, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సందర్భంగా ఏకే గోయల్‌ ఇచ్చిన సమాధానాలు, స్పందించిన తీరు అతి దారుణం. ఇది కృష్ణా జలాలపై మనకున్న హక్కు, ఆ జలాలు వాడుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం లేని చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. అది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ఈ సందర్భంగా ఒక అంశాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావత్‌ ట్రైబ్యునల్‌ (కెడబ్ల్యూడీటీ–1) నాడు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అంతే కాకుండా ఆనాడు కెడబ్ల్యూడీటీ–1 ఇచ్చిన ఆదేశాన్ని తిరిగి సమీక్షించడం చట్ట విరుద్ధమని కెడబ్ల్యూడీటీ–2 కూడా అభిప్రాయపడింది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 6, 2023న జారీ చేసిన అదనపు ఉల్లేఖన నిబంధనల (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌–టీఓఆర్‌)కు అనుగుణంగా, కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి నాడు కెడబ్ల్యూడీటీ–1 ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు కెడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది.

కృష్ణా నదిలో లభ్యమయ్యే నికర జలాలు 811 టీఎంసీల (75 శాతం లభ్యత) కేటాయింపునకు సంబంధించి కెడబ్ల్యూడీటీ–2 విచారణ కొనసాగిస్తోంది. దీనిపై కెడబ్ల్యూడీటీ–2 ఎదుట గత సెప్టెంబరు 23, 24 తేదీల్లో వాదనలు కొనసాగాయి. కృష్ణా జల్లాలో కచ్చితంగా 763 టీఎంసీల నీరు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, అదే వాదన కెడబ్ల్యూడీటీ–2 ఎదుట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే, ఆం్ర«ధప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగినట్లే. కాగా, అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తుది వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి, కృష్ణా జలాలపై హక్కు కాపాడుకోవడానికి, ఆ నీటి వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇప్పుడు ట్రైబ్యునల్‌ ఎదుట వినిపిస్తున్న కొన్ని వాదనలు చట్టపరిమితిని మించడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్‌ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్‌ 6(2), ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌ మేరకు, నదీ జలాల వివాదాల విషయంలో ట్రైబ్యునల్‌దే తుది నిర్ణయం. అది సుప్రీంకోర్టు ఆదేశంతో సమానం. కాబట్టి ఆ నిర్ణయాన్ని సమీక్షించడానికి చట్టపరంగా అధికారం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ కెడబ్ల్యూడీటీ–2 తన తుది నివేదికను నవంబరు 29, 2013న కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ.. ‘కృష్ణా జలాల కేటాయింపులపై కెడబ్ల్యూడీటీ–1 నిర్ణయాలు ఎలాంటి ప్రభావానికి లోనై తీసుకున్నవి కావు. కాబట్టి వాటిని సమీక్షించడం అంటే, కొత్తగా గందరగోళానికి తెర లేపడమే’ అని స్పష్టం చేసింది.

ఇంకా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూల్, క్లాజ్‌–4 ప్రకారం, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు, నదీ జలాల ధర్మాసనాలు కేటాయించిన నీరు యథాతథంగా కొనసాగాల్సి ఉంది. ఆ మేరకు కృష్ణా జలాల్లో ఈ ప్రాంతానికి కెడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీలు యథావిథిగా కొనసాగాల్సి ఉంది. ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో మార్పు ఉండకూడదు.

అయినప్పటికీ అంతర్‌ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్‌ 6(2), ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూల్‌ను కాదని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్టోబరు 6, 2023న మరిన్ని ఉల్లేఖన నిబంధనలు (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌–టీఓఆర్‌) జారీ చేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అవిభాజిత వాటాగా ఉన్న నీటిని పరిగణలోకి తీసుకుంటూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును సమీక్షించాలని ట్రైబ్యునల్‌ను ఆదేశించింది. వెంటనే దాన్ని సవాల్‌ చేస్తూ, అప్పటి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం, అక్టోబరు 9, 2023న ౖసుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఆ తర్వాత జూన్‌ 12, 2024న ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం, సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైన బచావత్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు సమీక్షించడం సరికాదని, రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లోని అంశాలను సవరించకుండా, కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల కేటాయింపులో అదనపు ఉల్లేఖన నిబంధనలు (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌–టీఓఆర్‌) జారీ చేయడం చట్టవిరుద్ధమన్న వాదనలను సుప్రీంకోర్టులో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్ధంగా వినిపించడంలో విఫలమైంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి విచారణ చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, తమ తీర్పునకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 27, 2024న కెడబ్ల్యూడీటీ–2 విచారణ మొదలుపెట్టింది. కృష్ణా జలాల పున:పంపిణీకి సంబంధించి ముందుగా ఇరు రాష్ట్రాల వాదనలు వింటామని కెడబ్ల్యూడీటీ–2 వెల్లడించింది. ఈ విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లోని అంశాలతో ప్రమేయం లేకుండా, కేంద్ర జలశక్తి శాఖ అక్టోబరు 6, 2023న జారీ చేసిన అదనపు ఉల్లేఖన నిబంధనలకు అనుగుణంగా వాదనలు వింటామని ఆగస్టు 29, 2024న ప్రకటించింది. మొత్తం 36 అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సమ్మతికి అనుగుణంగా కృష్ణా జలాల నికర పున:పంపిణీపై విచారణ జరుపుతామని కెడబ్ల్యూడీటీ–2 వెల్లడించింది.

కేటాయింపునకు ఆధారం:
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తమ రాష్ట్రంలో 71 శాతం ఉన్నందువల్ల 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తమకు కచ్చితంగా 71 శాతం నీరు కేటాయించాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే నదీ పరీవాహక ప్రాంతం కాకుండా, నదిలో లభ్యమవుతున్న వాస్తవ నీటి గణాంకాల ఆధారంగా కేటాయింపు ఉంటుందన్న వాదనను బలంగా వినిపించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమవుతోంది. ఇది చాలా దురదృష్టకరం.

కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి, గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అంశాలు ఒక్కసారి చూస్తే..
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల కేటాయింపుపై నిర్ణయం కోసం ఏప్రిల్‌ 10, 1969న నాటి ప్రభుత్వం జస్టిస్‌ బచావత్‌ నేతృత్వంలో కెడబ్ల్యూడీటీ–1ని ఏర్పాటు చేయగా, ఆ ధర్మాసనం మే 27, 1976న తీర్పునివ్వగా, దాన్ని అమలు చేస్తూ నాలుగు రోజుల తర్వాత.. అంటే మే 31, 1976న ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. అప్పుడు కూడా కృష్ణా జలాల కేటాయింపులో నాటి కెడబ్ల్యూడీటీ–1 నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోలేదు.

కృష్ణా పరీవాహక ప్రాంతం 2,58,948 చదరపు కి.మీ కాగా, అందులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29.45 శాతం, అంటే 76,252 కి.మీ ఉంది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నదిలో 2,130 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని కెడబ్ల్యూడీటీ–1 నిర్ధారణకు వచ్చింది. ఒకవేళ నదీ పరీవాహక ప్రాంతాన్నే పరిగణలోకి తీసుకుని ఉంటే, నాడు ఆ ప్రాంతం ఉన్న మన ఆంధ్రప్రదేశ్‌కు 2,130 టీఎంసీల నీటిలో 627.29 టీఎంసీల నీరు మాత్రమే కేటాయించేవారు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.

అన్ని అంశాలు, అన్ని కోణాల్లో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత, అంతర్జాతీయస్థాయిలో అనుసరించే ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని, ‘ఫస్ట్‌ ఇన్‌టైమ్‌ ఫస్ట్‌ ఇన్‌ రైట్‌’ (ఎవరైతే ముందుగా ప్రాజెక్టు నిర్మించి, నీరు వినియోగిస్తారో వారికే తొలి హక్కు)ను అనుసరిస్తూ.. నీటి కేటాయింపులు జరిపింది.

నాడు మన రాష్ట్రంలో తొలుత 1885–1928 మధ్య కర్నూలు కడప కాలువ (కెసి కెనాల్‌)తో పాటు, కృష్ణా అయకట్టులో నీటి వినియోగం జరిగింది. ఆ ప్రాతిపదికన రాష్ట్రంలో కృష్ణా నీటి కేటాయింపుపై ప్రాజెక్టులను మూడు వర్గాలుగా విభజించి నిర్ణయం తీసుకున్నారు. 1951 నాటికి పూరై్తన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెప్టెంబరు వరకు పూరై్తన ప్రాజెక్టులు, 1960 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా కెడబ్ల్యూడీటీ–1 ఆ వర్గీకరణ జరిపింది. ఆ మేరకు పాత ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలు, అప్పటికే ప్రతిపాదనలో ఉన్న జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలతో పాటు, పునరుత్పత్తి (రీజనరేషన్‌) అవసరాల కోసం మరో 11 టీఎంసీలు.. అన్నీ కలిపి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలు కేటాయించడం జరిగింది.

కెడబ్ల్యూడీటీ–1 కేటాయింపు మేరకు రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తా ఆంధ్రాకు 387.24 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు లభిస్తాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలే 20 టీఎంసీలను తెలంగాణలోని భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించడం జరిగింది. దీంతో తుదిగా రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తా ఆంధ్రకు 20 టీఎంసీలు తగ్గి 367.24 టీఎంసీలు, తెలంగాణకు ఆ 20 టీఎంసీలు పెరిగి ఆ వాటా 298.96 టీఎంసీలకు పెరిగింది. అలా ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీరు కృష్ణా జలాల్లో దక్కింది. ఆ మేరకే 2015, జూలై 18, 19 తేదీల్లో కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.

ఆ తర్వాత కెడబ్ల్యూడీటీ–1 గడువు ముగియడంతో 2004 ఏప్రిల్‌ 2న కేంద్ర ప్రభుత్వం కెడబ్ల్యూడీటీ–2 ను ఏర్పాటు చేసింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు కూడా విన్న తర్వాత
కెడబ్ల్యూడీటీ–2 ప్రాథమిక నివేదిక డిసెంబర్‌ 31, 2010న, తుది నివేదికను నవంబరు 29, 2013న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికపై మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వేర్వేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నివేదికపైగెజిట్‌ ప్రచురించలేదు.

మరోవైపు 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌తో పాటు, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపును నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వం కెడబ్ల్యూడీటీ–2ను ఆదేశించింది. అప్పటి నుంచి పలుమార్లు.. 2014 నుంచి 2024 వరకు నివేదికపై గడువు పొడిగిస్తూనే వచ్చారు. కాగా, ఆగస్టు 29, 2024న కెడబ్ల్యూడీటీ–2 ఆదేశాలు జారీ చేస్తూ.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కెడబ్ల్యూడీటీ–1 ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నీటి పున:పంపిణీపై వాదనలు వింటామని వెల్లడించింది. అదే సమయంలో నదిలో సగటున అదనపు జలాల లభ్యత 65 శాతం నుంచి 75 శాతం వరకు పరిగణించి చూసి, ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 194 టీఎంసీల నీరు కేటాయించింది.

ఈ నేపథ్యంలో 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గతంలో కెడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నీటి పున:పంపిణీ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం. అలాగే ఆ తర్వాత కేటాయించిన 194 టీఎంసీల నీటి పంపిణీపై కెడబ్ల్యూడీటీ–2 ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. అందులో 2014 నాటి పునర్విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో ప్రస్తావించిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగతో పాటు, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.

వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి ఉదాసీనత ప్రదర్శిస్తోంది. గతంలో కేటాయించిన 811 టీఎంసీల పున:పంపిణీని సమీక్షిస్తామన్న కెడబ్ల్యూడీటీ–2 నిర్ణయంపై కనీసం అభ్యంతరం కూడా చెప్పడం లేదు. ఇంకా కృష్ణా డెల్టాలో వినియోగించిన నీటిలో 95 శాతం ఆ పరీవాహక ప్రాంతం వెలుపల వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం అంగీకరించడం వల్ల, కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కు, ఆ నీటి వినియోగంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంపై ఈ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్న విషయం స్పష్టమవుతోంది.

రాయలసీమ ప్రాంతానికి అన్యాయం:
రెండు రాష్ట్రాల సంయుక్త ఆజమాయిషీలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగ్‌ ప్రాజెక్టుల నిర్వహణ, వాటి నుంచి నీటి లభ్యత వంటి అంశాలకు సంబంధించి, ప్రభుత్వ పక్షాన కెడబ్ల్యూడీటీ–2 వద్ద ఎకె గోయల్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ చూస్తే.. దేశంలోనే కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కరవు ప్రాంతాలైన రాయలసీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరందించేలా ప్రభుత్వం పలు ప్రాజెక్టులు.. తెలుగుగంగ (కృష్ణా 29 టీఎంసీలు. పెన్నా 30 టీఎంసీలు), గాలేరు–నగరి (38 టీఎంసీలు), హంద్రీ–నీవా (40 టీఎంసీలు), వెలిగొండ (43.5 టీఎంసీలు) చేపట్టింది. మిగులు జలాలపై ఆధారపడి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు దశాబ్ధాలుగా తెలుగుగంగకు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు 12 ఏళ్లుగా నీటి విడదుల జరుగుతోంది. వెలిగొండ ప్రాజెక్టులో మొదటిదశ దాదాపు పూరై్తంది. ప్రాజెక్టు రెండోదశలో శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని నల్లమలసాగర్‌కు తరలించాల్సి ఉంది.

ఇక కెడబ్ల్యూడీటీ–2 ముందు ఎకె గోయల్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రశ్నార్థకమే. అంతే కాకుండా, కెడబ్ల్యూడీటీ–1 ఆదేశాలు అమలులో ఉన్నంత కాలం, రెండు రాష్ట్రాల సంయుక్త అజమాయిషీలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో లభ్యమయ్యే నీటిలో తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకు ఇస్తారు. ఒకవేళ సాగునీటి అవసరాలకు నీటి లభ్యత తక్కువగా ఉంటే, కెడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటిలో ఆయా ప్రాజెక్టులకు ప్రపన అనుపాతం (ప్రపోషనల్‌గా)లో నీరు ఇస్తారు. ఒకవేళ తాగునీరు, సాగునీరు అవసరాలకు మించి నీరు అందుబాటులో ఉంటే, శ్రీశైలంలో 60 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 90 టీఎంసీల నీటిని భవిష్యత్‌ అవసరాల కోసం నిల్వ చేస్తారు. అలా ఉన్న నీటినే తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు విడుదల చేస్తారు. ఇదంతా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుంది.

అయితే గత ఆరేళ్లలో కృష్ణానదిలో కొనసాగుతున్న వరద పరిస్థితి చూస్తే.. జూలై, ఆగస్టులో మొదలయ్యే వరద శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండడంతో పాటు, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కొంత నిల్వకే సరిపోతుంది. ఏ ఏడాది కూడా అవసరాలకు మించి వరద రాలేదు. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలో మిగులు జలాలు తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేసే అవకాశం ఏ మాత్రం ఉండని పరిస్థితి కనిపిస్తోంది. కెడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీరు నిల్వ చేసిన తర్వాత, మిగిలిన ప్రాజెక్టులకు నీటి విడుదల దాదాపు అసాధ్యమని స్పష్టమవుతోంది.

మరోవైపు పోలవరం కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం వల్ల, ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 45 టీఎంసీల కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తాయి. కాగా, అన్ని రాష్ట్రాలకు 2,130 టీఎంసీల నీటి కేటాయింపు తర్వాతే, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీరు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం చేయడమే. నిజానికి రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తొలి నుంచి టీడీపీ వైఖరి దారుణం. ఏనాడూ ఆ ప్రభుత్వం అక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదు.

1995లో మీరు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1996లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు జాతీయస్థాయిలో కూటమి అయిన యునైటెడ్‌ ఫ్రంట్‌కు మీరు కన్వీనర్‌గా ఉన్నారు. ఆ ఎన్నికల తర్వాత శ్రీ హెచ్‌డీ దేవెగౌడ ప్ర«ధానమంత్రి అయ్యారు. అప్పుడు ఆయన తన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్తి డ్యామ్‌ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పని మొదలుపెట్టారు. దీనివల్ల డ్యామ్‌లో 100 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పడుతుంది. అది మన రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందంటూ, ఇక్కడి రైతులతో పాటు, విపక్షాలు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా, మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు.

ఆ తర్వాత 2000వ సంవత్సరంలో బచావత్‌ ట్రైబ్యునల్‌ గడువు ముగుస్తుండడంతో, కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది. ఆ నేపథ్యంలో వెంటనే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలన్న డిమాండ్‌ అన్ని వర్గాల నుంచి వచ్చింది. రాయలసీమతో పాటు, ప్రకాశం జిల్లాకు మేలు చేసేలా హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెకుకు.. తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్స్‌ వచ్చాయి. కానీ, మీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో, అవన్నీ పునాదిరాళ్లకే పరిమితం అయ్యాయి. అప్పుడు కేవలం మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కూడా ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆ ఆదేశాన్ని సవాల్‌ చేస్తూ, నాడు ఉమ్మడి రాష్ట్రంలో, 2010లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

అనంతరం 2014లో రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం, హైదరాబాద్‌లో ఓటుకు నోట్‌ కేసులో అడ్డంగా దొరికిపోయి, రాత్రికి రాత్రి అక్కణ్నుంచి పారిపోయి వచ్చింది. అంతే కాకుండా ఆ కేసు నుంచి బయటపడేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కును కూడా తాకట్టు పెట్టింది. ఆ తర్వాత కృష్ణా బోర్డు పరిధులు నిర్ధారించే వరకు రెండు రాష్ట్రాలకు చెందిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంతో పాటు, పులిచింతల పవర్‌ ప్రాజెక్టును కూడా 2014లో తెలంగాణ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. అందుకు ఆ రెండూ తమ భూభాగంలో ఉన్నాయన్న కారణం చెప్పింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, నాగార్జునసాగర్‌ కుడి కాలువ రెగ్యులేటర్‌ ఆం«ధ్ర భూభాగంలో ఉన్నా, దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. ఇంత జరిగినా దేన్నీ మీ ప్రభుత్వం అడ్డుకోలేక పోయింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు చాలా అన్యాయం జరుగుతున్నా, అప్పటి మీ ప్రభుత్వం మౌనంగా ఉండి పోయింది.

ఆ తర్వాత 2019లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడడంతో, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు, వాటాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో కృష్ణా జలాల కేటాయింపు, వినియోగంలో తమకు చాలా అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ నేపథ్యంలోనే కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి, కృష్ణా బోర్డు, దాని పరిధి, విధి విధానాలు ఖరారు చేస్తూ.. జూలై 15, 2021న కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరోవైపు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో అనుమతిస్తున్నట్టు (గుర్తిస్తున్నట్టు) ప్రకటించింది.

వీటన్నింటి సాధన కోసం నాటి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. కృష్ణా నది జలాలపై హక్కు, వాటి వినియోగంలో ఎక్కడా రాజీ పడకుండా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పని చేసింది. ఇప్పుడు టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అదే చిత్తశుద్ధితో పని చేయాలని కోరుతున్నాం. బచావత్‌ ట్రైబ్యునల్‌ నాడు కృష్ణా నికర జలాల్లో కేటాయించిన 512 టీఎంసీల నీటిలో, ఒక్క టీఎంసీ నీరు మనం కోల్పోయినా, అందుకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇలా ఉండగా, కెడబ్ల్యూడీటీ–2 ఎదుట రాష్ట్రాల వాదనలు కొనసాగుతుండగానే కృష్ణా జలాలు అత్యధికంగా వినియోగించుకునేలా, ఇప్పుడున్నవే కాకుండా, అదనంగా కూడా నీరు నిల్వ చేసుకునే విధంగా రిజర్వాయర్లు (క్రియేటింగ్‌ అడిషనల్‌ ఆఫ్‌లైన్‌ అండ్‌ ఆన్‌లైన్‌ రిజర్వాయర్స్‌) నిర్మించాలన్న స్పష్టమైన ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ, సెప్టెంబరు 16, 2025న జీఓ ఎంఎస్‌ నెం:34 విడుదల చేసింది. అంతే కాకుండా కృష్ణా నదిపై ఇప్పటికే ఉన్న పథకాలు, పురోగతిలో ఉన్న పథకాల అనుసంధానానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించింది. మరోవైపు అదే రోజు (సెప్టెంబరు 16, 2025) అటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు 519.16 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి, అందుకు అవసరమైన 1,33,867 ఎకరాల భూసేకరణకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు, ఆ నీటి వినియోగంలో మన ప్రయోజనాలు కాపాడడంలో, మీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, అలక్ష్య ధోరణి వల్లే పొరుగు రాష్ట్రాలు ఆ విధంగా చురుకుగా వ్యవహరిస్తున్నాయి. ఇది మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేయనుంది.

ఈ పరిస్థితుల మధ్య రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని మళ్లీ ఒకసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. గతంలో మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. తిరిగి ఈరోజు అదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అదే çసమస్య ఎదురవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రాజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది.
వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరేలా నీటిలో మన హక్కు అయిన వాటా కోసం మీరు చిత్తశుద్ధితో పని చేయాలని, ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాను. అని జగన్ లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: YS Jagan at Hyd : ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకు జగన్.. బిగ్ ట్విస్ట్?
YS Jagan tweet : ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత.. ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి : జగన్
YS Jagan on Medical Colleges : మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం : జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు