YS Jagan tweet : రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధించి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన తాజా నివేదికపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్సందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ట్వీట్ సారాంశం ఇదీ..
‘2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ఆరు నెలలకు గానూ, కాగ్ విడుదల చేసిన నివేదిక చూస్తే.. రాష్ట్ర ఆదాయ పరిస్థితి అత్యంత నిరుత్సాహకరంగా ఉంది. తమకు సంపద సృష్టించడం తెలుసని, అందుకే రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుతామని టీడీపీ, జనసేన ఏదైతే ఎన్నికల ముందు అదే పనిగా ప్రచారం చేశాయో.. దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు పరిస్థితి ఉంది’
‘రాష్ట్ర ఆర్థిక రంగంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే.. వారి వైఫల్యాలు స్పష్టంగా బయట పడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వృద్థి కేవలం 7.03% మాత్రమే. నిజానికి ఈ ఏడాది రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు. కానీ, కాగ్ విడుదల చేసిన గణాంకాలు చూస్తే, పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), అమ్మకం పన్నుల ఆదాయం ప్రభుత్వ వాస్తవ ఆదాయాన్ని స్పష్టంగా చూపుతాయి. దీనికి సంబంధించి, గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో జీఎస్టీ, అమ్మకం పన్నుల ఆదాయంలో నామమాత్రంగా కేవలం 2.85 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది’.
‘ఇంకా అదే సమయంలో 2023–24 నుంచి ఈ 2025–26 వరకు రెండేళ్లలో, వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను, అదే తొలి ఆరు నెలలకు సంబంధించి రాష్ట్ర ఆదాయ పెరుగుదలను పోల్చి చూస్తే, రాష్ట్ర సొంత ఆదాయంలో కేవలం 2.75 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.
అయినప్పటికీ రాష్ట్రం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక, 2024–25లో రాష్ట్ర జీడీపీ (జీఎస్‌డీపీ)లో 12.02 శాతం వృద్ధి సాధించామని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో జీఎస్‌డీపీలో 17.1 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ స్థాయి ఆర్థిక వృద్థి అంటే.. గత రెండేళ్లతో పోల్చి చూస్తే.. జీఎస్‌డీపీలో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ఏకంగా 14.53 శాతం. అది సాధ్యం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో గత రెండేళ్లతో పోల్చి చూస్తే 12 శాతం నుంచి 15 శాతం సీఏజీఆర్ నమోదు కావాలి. అయితే అంచనాలు ఆ స్థాయిలో ఉంటే.. వాస్తవ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర పన్నుల ఆదాయంలో గత రెండేళ్లతో పోల్చి చూస్తే కేవలం 2.75 శాతం సీఏజీఆర్ మాత్రమే నమోదైంది. అంటే అంచనాలు, లెక్కలు.. వాస్తవాల మధ్య చాలా తేడా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఏమిటంటే.. మూలధన వ్యయం దారుణంగా తగ్గుతోంది. రెండేళ్లతో పోల్చి చూస్తే.. మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు మైనస్‌లో ఉంది. అది –16 శాతం (మైనస్)గా ఉంది’.
‘ఈ ఆర్థిక సంత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర సొంత ఆదాయాన్ని గత ఏడాదితో పోల్చి చూస్తే, కేవలం 3.47 శాతం వృద్ధి మాత్రమే నమోదు కాగా.. జీఎస్టీ, పన్నుల ఆదాయం, అంతకు ముందు ఏడాదిలో, అదే సమయంతో పోల్చి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. వాస్తవాలు ఇంత నిక్కచ్చిగా ఉంటే, చంద్రబాబు మాత్రం, గత ఏడాదితో పోల్చి చూస్తే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్‌డీపీలో 10.50 శాతం వృద్ధి నమోదైందని చెబుతున్నారు. ఇది ఏ విధంగా చూసినా సాధ్యం కాని విషయం’.
‘అదే 2019–24 మధ్య ఆ 5 ఏళ్లలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.58,031 కోట్ల నుంచి రూ.92,922 కోట్లకు పెరిగి, వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 9.87 శాతంగా నమోదైంది. అదే సమయంలో రాష్ట్ర జీడీపీలో కూడా 10.23 శాతం సీఏజీఆర్ నమోదైంది. వాటితో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కానీ, రాష్ట్ర జీడీపీని కానీ పోల్చి చూస్తే.. అతి తక్కువ పెరుగుదల మాత్రమే కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు తన పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ఎలా చెబుతారు?’.
‘ఒకే ఒక్క విషయంలో మాత్రం రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది అంటే.. అది కేవలం అప్పుల్లో మాత్రమే. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు చేసిన మొత్తం అప్పు అక్షరాలా రూ.2,06,959 కోట్లు. అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పుల్లో ఏకంగా 62 శాతం కేవలం ఈ 17 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసింది’. అని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: YS Jagan on Medical Colleges : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం : జగన్
YSRCP Meeting : విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్నింటా రాష్ట్రం తిరోగమనం: జగన్
