Antifa : అమెరికా రాజకీయ వాతావరణంలో మరో సంచలనం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వామపక్ష భావజాలమున్న Antifa గ్రూప్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ట్రంప్ తన సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలో, Antifaను ‘‘అత్యంత ప్రమాదకరమైన రాడికల్ లెఫ్ట్ ఉద్యమం’’గా అభివర్ణించారు. ఈ గ్రూప్‌కు నిధులు సమకూర్చే వారిపై కఠిన దర్యాప్తు జరపాలని అమెరికా దర్యాప్తు సంస్థలకు ఆదేశించారు.
Antifa అంటే ఏమిటి?
Antifa అనేది anti-fascist అనే పదానికి సంక్షిప్త రూపం. ఇది ఒక అధికారిక సంస్థ కాకుండా, వామపక్ష భావజాలాన్ని అనుసరించే కార్యకర్తల గుంపు. వీరు ఫాసిజం, రేసిజం, ముఖ్యంగా కన్జర్వేటివ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటారు.
తరచూ ఫార్-రైట్ ర్యాలీలకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తారు.
1917 రష్యా విప్లవ నినాదాలు, Bella Ciao వంటి పాటలను తమ నిరసనల్లో వినియోగిస్తారు.
సోషల్ మీడియా, సిగ్నల్, ఇతర ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా అనుసంధానం కొనసాగిస్తారు.
ట్రంప్ గత పాలనలోనే Antifaపై నిషేధం విధించాలని భావించారు. కానీ చట్టపరమైన అడ్డంకుల వల్ల అది అమలు కాలేదు. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయం ప్రకారం, Antifa ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం కష్టమని చెప్పారు.
చార్లీ కిర్క్ హత్య
సెప్టెంబర్ 10న ఉటా యూనివర్సిటీలో జరిగిన దాడిలో కన్జర్వేటివ్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ రైఫిల్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్‌కు ఆప్తుడిగా, ఎన్నికల సమయంలో బహిరంగ మద్దతు తెలిపిన కిర్క్ మరణంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దీనికి బాధ్యులెవరు అయినా కఠిన శిక్ష తప్పదు’’ అని ఆయన హెచ్చరించారు.
ఈ ఘటనలో 22 ఏళ్ల వామపక్ష భావజాలం కలిగిన టైలర్ రాబిన్సన్ను ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. సంఘటనా స్థలంలో “Hey fascist! Catch!” అని రాసిన బుల్లెట్ కేసింగ్‌లు దొరకడం అనుమానాలు రేకెత్తించింది. అయితే అతను నిజంగా Antifa సభ్యుడా అన్నది ఇంకా స్పష్టత చెందలేదు. అయినప్పటికీ, ‘‘ఆన్‌లైన్‌లో రాడికలైజ్ అయ్యాడు’’ అంటూ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు.
రాజకీయ దుమారం
ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో మళ్లీ లెఫ్ట్-రైట్ వాదనలకు దారితీస్తోంది. ఒకవైపు ట్రంప్ Antifaపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా, మరోవైపు ఈ గ్రూప్‌ను ఒక భావజాల ఉద్యమంగా మాత్రమే పరిగణిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయి. ఇది రానున్న అధ్యక్ష ఎన్నికల వాతావరణంలో మరింత వేడి పెంచే అవకాశముంది.
ఇవీ చదవండి: Trump Tariffs : భారత్‌పై 100% టారిఫ్ విధించండి.. యూరోపియన్ యూనియన్‌కు ట్రంప్ సలహా
Trump on India : ఇండియాపై మళ్లీ ట్రంప్ ఫైర్.. టారిఫ్‌లతో చంపేస్తోంది!
