Crime News : అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు చెన్నైలో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. భవనం పైనుంచి పడి మృతి చెందిన ఈ ఘటనపై కోయంబేడు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు ఇది ప్రమాదమో, ఆత్మహత్యో కాదని, పథకం ప్రకారమే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. (Crime News)
ఘటన వివరాలు
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి ప్రాంతానికి చెందిన నవీన్ (23) గత కొంతకాలంగా రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన ఓ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం చెన్నై కోయంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవనం పైనుంచి పడిపోయి నవీన్ మృతి చెందాడు. గురువారం ఉదయం అతని కుటుంబ సభ్యులకు పోలీసుల ద్వారా సమాచారం చేరింది.
కుటుంబ సభ్యుల అనుమానం
నవీన్‌ను హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు స్పష్టంగా చెబుతున్నారు. యువతి కుటుంబ సభ్యులే ఈ ఘటన వెనుక ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. నవీన్ 8న స్కూల్ ఫ్రెండ్స్‌తో టూర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ అతని రైల్వే టికెట్ వివరాల్లో యువతి, ఆమె తల్లి కూడా కలిసి ప్రయాణించినట్లు తెలిసింది. అనకాపల్లి నుంచి విజయవాడ, అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళారని సమాచారం. ఈ మొత్తం ప్రయాణం పథకం ప్రకారమే జరిగిందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల వేదన
నవీన్ పెదనాన్న వెంకట్రావు మాట్లాడుతూ –
“ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పి ఉంటే పరిష్కారం చూపించేవాళ్లం. కానీ ఇలా మోసపూరితంగా తీసుకెళ్లి హత్య చేశారు. ఈ పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదు. మాకు న్యాయం జరగాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
నవీన్ మేనమామ వాసు మాట్లాడుతూ –
“హత్య ఆనవాళ్లు ఉంటే ఆత్మహత్య అని ఎందుకు అంటున్నారు? ఆత్మహత్యే అయితే దానికి కారణం ఏంటో చెప్పాలి. హత్య అయితే నిందితులు తేలాలి. మా కుటుంబానికి న్యాయం జరగాలి” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది
ప్రస్తుతం చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కొన్ని అనుమానితులు ఇప్పటికే అదుపులో ఉన్నట్లు సమాచారం. నవీన్ మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు.
ఇవీ చదవండి: Crime News : చికెన్ వండలేదని భార్యను ఈ కిరాతకుడు ఏం చేశాడో తెలుసా?
Telangana Crime : ప్రియుడితో కలిసి నా భార్య నన్ను చంపాలని..!
