Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలు, డిజైన్ లోపాలు, నిర్వహణ వైఫల్యాలపై విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అయితే, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఉత్కంఠరేపుతోంది. (Kaleshwaram)
జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సమ్మతించడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే, ఏదైనా ఒక రాష్ట్రంలోని కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, సీబీఐకి చెందిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లీష్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్-6 కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. అనంతరం, ఆ కేసును సీబీఐతో విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అందుకు అనుగుణంగా సెక్షన్-5 కింద సమ్మతి తెలపాలి.
ఈ క్రమంలో కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా, విచారణకు సమ్మతించాల్సిన రాజకీయ ఆవశక్యత బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఒక వేళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సాకుగా చూపి సీబీఐ విచారణకు కేంద్రం సమ్మతించకపోతే బీఆర్ఎస్-బీజేపీ బంధం మరోసారి బహిర్గతమైందనే సందేశం క్షేత్ర స్థాయిలో మరింత బలపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, విచారణకు అంగీకరించకపోతే పొత్తు ప్రచారం క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తుందని, రానున్న ఎన్నికల్లో అది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని బీజేపీ భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాళేశ్వరం నిర్మాణంలో ఏకపక్ష నిర్ణయాలు, ఇష్టారీతిన సవరించిన ప్రాజెక్టు అంచానలతో జరిగిన అవినీతి, నిర్వహణ వైఫల్యాలపై జస్టిస్ ఘోస్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా ఇతర ఉన్నతాధికారులను బాధ్యులను చేసింది. అంతేకాకుండా వారిపై చర్యలు తీసుకొవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోం శాఖకు చేసిన సిఫారసులపై.. కేంద్రం స్పందిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒక వేళ బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించకపోతే బీఆర్ఎస్‌తో పొత్తు ప్రచారానికి బలం చేకూర్చినట్టు అవుతుందని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు కాళేశ్వరంపై మొదటి నుంచి విచారణకు ఆదేశించాల్సిన రాజకీయ ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి: Revanth on Kaleswaram : కాళేశ్వరంపై సీబీఐ విచారణ.. రేవంత్ సంచలన ప్రకటన
Kaleswaram : కాళేశ్వరం కాక.. కమిషన్ ఎదుట ఈటల హాజరు.. రాజకీయ వేడి
Telangana : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఫ్యామిలీకి రూ.18 వేలు!
Rajiv Yuva Vikasam : ఒక్క పథకంతో 5 లక్షల మంది యువ వ్యాపారవేత్తలు
