Ganga River: పూర్వ కాలంలో భగీరథుడు అనే గొప్ప వ్యక్తి ఉండేవారు. తమ పూర్వీకులు పాతాళ లోకంలో సగర కుమారులు ఓ మహర్షి శాపం వల్ల బూడిద కుప్పలుగా మారిపోయారు. ఆ బూడిద కుప్పల మీద గంగా నది ప్రవహిస్తే శాప విముక్తి కలుగుతుంది. స్వర్గంలో ప్రవహించే గంగా నది (Ganga River) భూలోకంలోకి వచ్చి, అక్కడి నుంచి పాతాళానికి వెళ్లి, తమ పూర్వీకుల, తాతముత్తాతల బూడిద కుప్పల మీద నుంచి ప్రవహిస్తే వారికి ముక్తి లభించి మోక్షం కలుగుతుందని భగీరథుడు ఎంతో కష్టపడ్డాడు.
పరమేశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. శివానుగ్రహంతో స్వర్గంలో ఉన్న గంగా నదిని భూలోకానికి తీసుకొచ్చాడు. పాతాళానికి తీసుకువెళ్తుండగా ఆయన వెనుక గంగా నది భారీ ప్రవాహంతో తరలి వస్తుంటుంది. ఉత్తుంగతరంగ.. అన్నట్లుగా వేగంగా వచ్చేస్తుంటుంది. ఆయన ముందు నడుస్తుంటే గంగా నది వెనుక వస్తుంటుంది. అలా వెళ్తున్న క్రమంలో గంగా నది పాయలు పాయలుగా విడిపోయి కొన్ని పాయలు తూర్పు, కొన్ని పాయలు ఉత్తరం, కొన్ని పాయలు దక్షిణానికి వెళ్లిపోయాయి. ఒక పాయ భగీరథుడి వెనకాల వచ్చేస్తోంది. ఆయన ఆ గంగను తీసుకుని పాతాళానికి వెళ్లాల్సి ఉంది.
అలా వెళ్తుండగా మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది. ఆ మహర్షి మహాశక్తిమంతుడు. అయితే, గంగా నది వేగానికి మహర్షి ఆశ్రమం మునిగిపోయింది. దీంతో ఆయనకు కోపం వచ్చింది. నా ఆశ్రమాన్ని ఈ నది ముంచేస్తుందా.. అంటూ ఉద్ధరిణితో స్వాహా అంటూ ఆ గంగను తాగేశాడట. భగీరథుడి వెనకాల వచ్చే నది పాయ మొత్తాన్నీ తాగేశాడట. కొంత దూరం వెళ్లిన తర్వాత నది శబ్దం వినకపడకపోయే సరికి భగీరథుడికి అనుమానం వచ్చి చూశాడు. ఏమైపోయిందని చూస్తే జహ్ను మహర్షి పొట్టలో ఉందట. ఆయన తాగేశాడని గుర్తించాడు.
వెంటనే మహర్షి దగ్గరకు భగీరథుడు వెళ్లి అయ్యా తప్పు అయిపోయింది, ఆ ఉత్తుంగతరంగం, వేగం వల్ల నది మీ ఆశ్రమాన్ని ముంచెత్తింది, లేకపోతే మీ జోలికి వచ్చేది కాదంటూ బతిమలాడుకున్నాడు. దయచేసి ఆ నదిని మళ్లీ నాకు ప్రసాదించండి. ఆ నదిని నేను పాతాళానికి తీసుకెళ్లి మా పూర్వీకులకు విముక్తి కలిగించాలని వేడుకున్నాడు. మా పూర్వీకులు శాపం వల్ల బూడిద కుప్పలుగా మిగిలిపోయారని, ఆ బూడిద కుప్పల మీదుగా నది ప్రవహిస్తేనే వారికి మోక్షం కలుగుతుందని, స్వర్గానికి వెళ్తారన్నాడు. లేకపోతే అక్కడే త్రిశంకుస్వర్గంలో ఆగిపోయారని విన్నవించుకున్నాడు. దయచేసి గంగా నదిని విడిచిపెట్టాలన్నాడు.
నేను గంగా నదిని తాగేశాను కాబట్టి వదిలి పెడితే మూత్ర విసర్జన రూపంలో వదిలిపెట్టాలని, అలా చేస్తే నువ్వు అడిగినట్లుగా గంగ పవిత్రత మొత్తం పోతుందని, పనికి రాదని చెప్పాడు. కాబట్టి ఓ పని చేస్తాను, నా కుడి చెవిలోంచి వదిలి పెడతాను అన్నాడు. కుడిచెవిలోంచి బయటకొచ్చిన గంగను విడిచిపెట్టాడు. అప్పటి నుంచి గంగా నదికి జాహ్నవి పేరు వచ్చింది.
కుడి చెవిలోంచి వచ్చిన నదిని తీసుకుని పాతాళానికి వెళ్లిన భగీరథుడు తన పూర్వీకుల బూడిద కుప్పల మీదుగా వెళ్లేట్టు చేస్తాడు. అప్పుడు వారికి ముక్తి, మోక్షం కలిగాయి. జహ్ను మహర్షి కుడిచెవిలోంచి గంగా నదిని వదిలిపెట్టాడు కాబట్టి మనం ఏదైనా పూజలో ఆవలింత, తుమ్ము, కడుపులో గ్యాస్ బయటకొచ్చినా, ఎవరైనా అశుభం మాటలు మాట్లాడినా.. కుడి చేతి కింద ఎడమ చేయి పెట్టి కుడిచేతిని చెవికి తాకించి గంగ.. గంగ.. గంగ.. గంగ.. గంగ.. గంగ.. అంటూ గుక్క తిరిగినంత సేపు గంగాదేవిని తలచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాపం తొలగిపోయి పూజా ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Lord Shiva: మహాశివుడి 19 అవతారాలు తెలుసా? వాటి ప్రాముఖ్యం తప్పక తెలుసుకోండి!
Gokarna temple: గోకర్ణ క్షేత్రం గొప్పతనం ఇదీ.. మోక్షాన్ని పొందడానికి మార్గం.. తప్పక తెలుసుకోండి
Mattelu: కాలి మట్టెలు, తాళిబొట్టు ఎందుకు ధరిస్తారు? హిందూ ధర్మం ప్రకారం వీటి విశిష్టత ఏంటంటే..
Panchamukhi Rudraksha: పంచ ముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి? ధరిస్తే కలిగే ప్రయోజనాలేంటి?
Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!

[…] […]