HomeAndhra PradeshJagan longest press meet: ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌లా చంద్రబాబు వ్యవహారం.. రాష్ట్ర అప్పులు, బడ్జెట్‌పై జగన్...

Jagan longest press meet: ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌లా చంద్రబాబు వ్యవహారం.. రాష్ట్ర అప్పులు, బడ్జెట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Jagan longest press meet: వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రిమినల్ లా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినజగన్.. బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం ఎలా మోసం చేసిందన్న విషయాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వార్షిక బడ్జెట్‌పై సుదీర్ఘంగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఇవీ.. (Jagan longest press meet)

ఈ బడ్జెట్‌ మభ్య పెట్టే విధంగా ఉంది. ఎవరైనా సరే ప్రభుత్వం ఏర్పాటు కాగానే బడ్జెట్‌ ప్రవేశపెడతారు. పథకాలకు కేటాయింపులు చేసి, వాటిని అమలు చేయాలని చూస్తారు. కానీ, దురదృష్టవశాత్తూ 8 నెలలు అయిపోయాక, ఇంకో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లూ ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌తోనే కాలం వెళ్లదీస్తారు. (Jagan longest press meet)

ఇంత కాలం ఎందుకు సాగదీశారంటే, బడ్జెట్‌ ప్రవేశపెడితే, చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు బయటపడతాయి.
ప్రజలు తమ హామీలు అడుగుతారన్న భయం. అందుకే బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు.

పథకాలకు ఏవీ కేటాయింపులు?:
3 వేల రూపాయలు ఇస్తానన్నావ్‌. 20 లక్షల మందికి ఇస్తానన్నావ్‌. సూపర్‌ సిక్స్‌ అన్నావ్‌. రూ.7,200 కోట్లు ఎక్కడ కేటాయింపు చేశావని అడుగుతున్నాను. ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్ల కోసం సూపర్‌ సిక్స్‌ లో ఏమన్నాడు. చిన్న పిల్లలు కనపడితే చాలు.. నీకు 15 వేలు, నీకు 15 వేలు.. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు అన్నాడు.
గవర్నమెంట్‌ బడులు, ప్రయివేటు స్కూళ్లకు వెళ్లే వారు దాదాపు 84 లక్షల మంది పైచిలుకు. రూ.15 వేలు ఒక్కోరికి అంటే దాదాపు 13 వేల కోట్లు. ఎక్కడ కేటాయించారు? ఎప్పుడిస్తారు?

ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి ఇదిగో బడ్జెట్‌ లో కేటాయించాం గొప్పగా చెప్పుకుంటారు. వీళ్లు మామూలుగానే ఏమీ చేయకున్నా చెప్పుకుంటారు. బడ్జెట్‌ లో డాక్యుమెంట్లన్నీ వెతుక్కున్నా కనపడలేదు. చివరకు ఓ మూలన అక్కడ ఇంత, ఇక్కడ ఇంత కనిపిస్తోంది. అది కూడా 5 వేల కోట్ల చిల్లర.

సూపర్‌ సిక్స్‌ లో ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం అన్నాడు. జగన్‌ ఇచ్చేది రూ.13500, అందులోనూ కేంద్రం రూ.6 వేలు ఇస్తోంది, మేం వస్తే రూ.20 వేలు ఇస్తాం అని కేంద్రం ఇచ్చేది కాకుండా మేం రూ.20 వేలు ఇస్తాం అని బిల్డప్‌ ఇచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా, క్యాంపెయిన్‌ లోనూ మాట్లాడారు. నీ స్కీమ్‌ వేరే. వాళ్లది పీఎం కిసాన్‌. నీ స్కీమ్‌ పేరు పీఎం కిసాన్‌ అనిపెట్టలేదు. 53.52 లక్షల మంది రైతులకు రూ.20 వేలు అంటే దాదాపు 11 వేల కోట్లు. కేటాయింపు చేసింది ఎంత? వెయ్యి కోట్లు. ఎవర్ని మోసం చేయడం కోసం? ఇది మోసం కాదా? (Jagan longest press meet)

ప్రతి మహిళకూ నెలకు రూ.1500 అన్నాడు. 19–59 ఏళ్ల మధ్య  ప్రతి మహిళకూ సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తానని చెప్పాడు. ఓటరు లిస్టు ప్రకారం 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే ఎంత..? రూ.37,313 కోట్లకు గానూ చంద్రబాబు నాయుడు ఏం కేటాయించాడు? దమ్మిడీ కేటాయించకపోగా పైగా బడ్జెట్‌ లో ఒకచోట 3,341 కోట్లు అన్నారు. ఈనాడు క్లిప్పింగ్‌ చూడండి. ఆడబిడ్డ నిధి పథకానికి కేటాయింపు అన్నారు.

ఈ డబ్బును ఏప్రిల్, మేలోనే చంద్రబాబు రాకనే మా ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ ఉందని వాళ్లు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి ఇచ్చేశాం. ఆసరాకు, చేయూతకు. ఈ డబ్బే లేదు. అయిపోయింది. మరి ఈనాడులో మహిళ డబ్బులు చూపుతున్నట్లు వేశారు. ఈ మాదిరిగా రాయడం కరెక్టేనా? ఇదేం మోసం, ఇదేం దగా? ఇవేం అబద్ధాలు.

ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు. రాష్ట్రంలో యాక్టివ్‌ గ్యాస్‌ సిలిండర్లు 1.55 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ డేటా. అంటే 4,200 కోట్లు. నువ్వు కేటాయించింది ఎంత రూ.895 కోట్లు. ఇది మోసం కాదా? గ్యాస్, బస్సు అనేవి చిన్నవి.
ఉచిత బస్సు అన్నది దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది. ప్రతి పండగ అయిపోతే వచ్చే పండుగ అంటాడు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ చిన్నవే లాస్టుకు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చేస్తాడేమో. మిగతా పెద్దవన్నీ పంగనామాలే. చిన్నవి కూడా చేయడానికి ఈ మనిషికి మనసే రాదు. (Jagan longest press meet)

ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌లా చంద్రబాబు:
బడ్జెట్‌లో చెప్పిన అంశాలు, గణాంకాలు చూస్తే, చంద్రబాబుగారు ఎంత డ్రామా ఆర్టిస్ట్‌ అన్నది స్పష్టమైంది. ఆయన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎలా చేశాడనేది అందరికీ అర్ధమవుతుంది.ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎలా ఉంటుంది అంటే.. ముందుగా తన అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తాడు. ఆ తర్వాత ఆయన దాన్నే పదే పదే మాట్లాడతాడు. పనిలో పనిగా తన దత్తపుత్రుడితోనూ, తనకు సంబంధించి ఇతర పార్టీల ఉన్న వారితోనూ మాట్లాడిస్తారు. ట్వీట్స్‌ పెడతారు. చివరకు దాన్ని ఒక ఇంటర్నేషనల్‌ మ్యాటర్‌గా చేస్తారు. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను.

దురుద్దేశంతో తప్పుడు ప్రచారం:
ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయడం సహజం. అది బడ్జెట్‌లో భాగమే. ప్రతి ప్రభుత్వానికి ఎఫ్‌ఆర్‌బీఎం ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తారు. జీఎస్‌డీపీలో 3 శాతం లేదా 3.5 శాతం అప్పులు చేస్తారు. అంతకు మించి ఎవరికి సాధ్యం కాదు. కానీ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా ఇదే అప్పులపై ఏ స్థాయిలో ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు.
రాష్ట్ర అప్పుల విషయంలో వారు ఏ రకంగా అబద్ధాలు చెబుతూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎలా చేశారనేది ఇప్పుడు చెబుతాను. వారి ఉద్దేశమల్లా.. జగన్‌కు ఎవరూ సాయం చేయొద్దు. ఏ బ్యాంక్‌ కూడా రుణాలు ఇవ్వొద్దు. కేంద్రం కూడా సహకరించొద్దు. (Jagan longest press meet)

ఇదీ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ పరంపర:
– 05.04.2022. చంద్రబాబు ప్రకటన. రాష్ట్రం శ్రీలంక అవుతుంది.
– 13.04.2022. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో.. అనడం.. దాన్ని వెంటనే ఈనాడులో రాస్తారు.
– 19.04.2022. ఈనాడులో రాశారు.. మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాశారు.
– 17.05.2022. దత్తపుత్రుడు ట్వీట్‌..‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో’.. అని
– 21.07.2022. ఇప్పటి ఆర్థిక మంత్రి ఏమన్నారంటే.. ‘శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు నాలుగు రెట్లు’ అని.
– 07.02.2023. అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు.. జగన్‌కు ‘అప్పు రత్న’ అని పేరు పెట్టాలని దత్తపుత్రుడి ట్వీట్‌.
– 25.10.2023. చంద్రబాబుగారి వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు ప్రకటన. ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షలు అని’.
అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్‌ ప్రచారం. కొత్త పాత్రధారులు.
వారి ఎల్లో మీడియా. ఇతర పార్టీల్లో ఉన్న టీడీపీ నాయకులు. పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనపై వైయస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మరో రివర్స్‌ ప్రచారం. అవన్నీ ఎందుకు అంటే కేంద్రం సహకరించొద్దు. ఇక్కడ ఏమేమో జరుగుతోందన్న భయం క్రియేట్‌ చేయాలి.

ఎన్నికలు దగ్గర పడడంతో మరీ..:
ఎన్నికలు దగ్గర పడే సరికి.. ఆ ప్రచారం మరింత ముమ్మరం చేశారు.
– 07.04.2024. రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబుగారి వదినమ్మ ప్రకటన.
21.04.2024. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఈనాడు. ఒకాయనను పట్టుకొచ్చి, ఆయనకు ఎకనమిస్ట్‌ అనే బిళ్ల తగిలించి, ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు.
అలా ఒక పద్ధతి ప్రకారం అబద్దాల ప్రచారం. విష ప్రచారం చేశారు. ఈనాడులో రాయడం. దాన్ని అందరూ చెప్పడం అలా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌. (Jagan longest press meet)

అధికారంలోకి వచ్చిన తర్వాతా అదే..:
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన దుష్ప్రచారం మానలేదు. ఎందుకంటే హామీలు అమలు చేయడం ఆయనకు అలవాటు లేదు. అందుకే అదే విష ప్రచారం.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, జూలై 10, 2024న ఆర్థిక శాఖపై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్‌ చేశారు. దానిపై అదే పనిగా ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు.
ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 22, 2024న గవర్నర్‌గారి ప్రసంగం. అందులో కూడా అబద్ధాలు చెప్పించారు. రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పించారు.
అదే సెషన్‌లో జూలై 26, 2024న సభలో ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఏమన్నారో చూద్దామంటూ.. ఆ వీడియో ప్రదర్శించారు.
‘సూపర్‌సిక్స్‌ ప్రకటించాం. అమలు చేయాలంటే భయమేస్తోంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ నాయకుడైనా బాధ్యతగా ఉండాలి’ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు ఆవేదనగా ఉందంట. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటలు అమలు చేయలేకపోతున్నాడట. (Jagan longest press meet)

ఎన్టీఆర్‌ను మించి యాక్షన్‌:
అంటే ఒక పద్ధతి ప్రకారం సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ అమలు చేయకుండా ప్రజలను మోసం చేయాలి. పోనీ దాన్నైనా నిజాయితీగా చెబుతారా? అంటే అదీ లేదు. జగన్‌పై నింద వేయడం. అదే వారికి అలవాటు.
అందుకే బాధగా ఉందంటాడు. ఆవేదనగా ఉందంటాడు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు. భయం వేస్తుందంటాడు. అలా దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్‌ యాక్షన్‌ను మించి చంద్రబాబు నటన.

రాష్ట్ర అప్పులపై విష ప్రచారం:
రాష్ట్ర అప్పులపై ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తూ, ఏ స్థాయిలో విష ప్రచారం చేశారన్నది చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. వారు చేసిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఈ బడ్జెట్‌లోని గణాంకాలతో తేటతెల్లమైంది.
2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,57,509 కోట్లు. దానికి తోడు ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు చేసిన అప్పు మరో రూ.55,000 కోట్లు. ఆ రెండూ కలిపి మొత్తం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు.
అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పులు రూ.4,91,734 కోట్లు. ప్రభుత్వం పూచీ పడ్డ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు. రెండూ కలిపితే మొత్తం అప్పులు రూ.6,46,000 కోట్లు.
మరి వారు ప్రచారం చేసినట్లు ఎక్కడ రూ.14 లక్షల కోట్లు. ఎక్కడ వాస్తవ రూ.6.46 లక్షల కోట్లు.
ఇక ఎవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారు? వాటి గ్రోత్‌ ఎంత (సీఏజీఆర్‌) అని చూస్తే..
చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,32,079 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.3,13,018 కోట్లు. అంటే ఏటా సగటున 19.54 శాతం చొప్పున అప్పులు పెరిగాయి. (Jagan longest press meet)

అదే మా ప్రభుత్వ హయాంలో చూస్తే.. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,13,018 కోట్ల నుంచి రూ.6,46,531 కోట్లకు పెరిగాయి. అంటే ఏటా సగటున 15.61 శాతం చొప్పున అప్పులు పెరిగాయి. అంటే చంద్రబాబుగారి హయాంలో కన్నా, 4 శాతం తక్కువ అన్నమాట.
ఇక పబ్లిక్‌ సెక్టార్లకు సంబంధించి, నాన్‌ గ్యారెంటీడ్‌ అప్పులు చూస్తే.. చంద్రబాబుగారు సీఎం అయ్యే నాటికి నాన్‌ గ్యారెంటీ అప్పు రూ.8,638 కోట్లు కాగా, ఆయన హయాం ముగిసే నాటికి అవి 54.98 శాతం పెరిగి ఏకంగా రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్‌ సెక్టర్‌లో డిస్కమ్‌లకు అలా రుణాలు సేకరించారు.
అదే మా ప్రభుత్వం వచ్చాక, ప్రభుత్వ రంగ సంస్థల నాన్‌ గ్యారెంటీ రుణాలు తగ్గించే ప్రయత్నం చేశాం. మా హయాంలో ఆ రుణం పెరగకపోగా.. –0.48 శాతం, అంటే ఆ రుణాన్ని రూ.75,386 కోట్లకు తగ్గించాం.

మొత్తం అప్పులు. గణాంకాలు:
ఇక ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ అప్పు, నాన్‌ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి చూస్తే..
చంద్రబాబు హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి రూ.1.40 లక్షల కోట్లు, ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లు. అంటే సీఏజీఆర్‌ 23.6 శాతం అన్నమాట. అదే మా హయాంలో 2019లో ఉన్న అప్పు రూ.3.90 లక్షల కోట్లు కాస్తా, రూ.7.21 లక్షల కోట్లు అయింది. అంటే సీఏజీఆర్‌ 13.57 శాతం మాత్రమే. అంటే ఏదైనా అవార్డు ఇవ్వాలంటే, మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను అంత చక్కగా నడిపినందుకు. (Jagan longest press meet)

మరి వీరు ప్రచారం చేసినట్లుగా.. రూ.14 లక్షల కోట్లు, రూ.12.5 లక్షల కోట్లు ఏమయ్యాయి? మీరు మీ బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో మీరే చూపించారు ప్రభుత్వ అప్పు రూ.6.46 లక్షల కోట్లు మాత్రమే.
అలాంటప్పుడు అంత దారుణంగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? ఎవరు రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా చేసే ప్రయత్నం జరిగింది? అది ఎవరుంటే అయ్యే అవకాశాలు ఎక్కువ?
ఇంకా చెప్పుకోవాలంటే.. మా హయాంలో సీఏజీఆర్‌ 15.61 శాతం నమోదైంది.. అది కూడా రెండేళ్లు కోవిడ్‌ దుర్భర పరిస్థితులు. నిజానికి కోవిడ్‌ వల్ల దేశమే కాదు, ప్రపంచలోనే చాలా దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వ ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చు పెరిగింది. అయినా చంద్రబాబు కంటే మా పనితీరు చాలా బాగుంది.

చంద్రబాబు వదిలిపోయిన బకాయిలు:
చంద్రబాబు అబద్ధాలు మళ్లీ పెంచారు. మా ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టి పోయిందని నిందిస్తున్నారు. ఏ ప్రభుత్వ హయాంలో కూడా, ఏ ఏడాది కూడా బిల్స్‌ అప్‌లోడ్‌ అవుతాయి. రొటేషన్‌లో క్లియర్‌ అవుతాయి. ఇదే చంద్రబాబు తాను దిగిపోతూ.. వదిలిపెట్టి పోయిన మొత్తం బకాయిలు ఏకంగా రూ.42,183 కోట్లు. ఆ వివరాలు..
– డిస్కమ్‌ల బకాయిలు రూ.21,541 కోట్లు. అంటే కరెంటు సప్లై చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదు.
– ఉపాధి హామీ బకాయిలు రూ.2340 కోట్లు.
– ఉద్యోగుల రెండు డీఏలు బకాయి.
– ఆరోగ్యశ్రీలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బకాయిలు రూ.680 కోట్లు.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2800 కోట్లు. (Jagan longest press meet)
– రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు.
– పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిన ఆయాలకు గౌరవ వేతనాలు కూడా బకాయిలు.
– చివరకు పిల్లల కోడిగుడ్లకు కూడా డబ్బులు చెల్లించలేదు.
ఏ ప్రభుత్వమైనా కొంత బకాయిలు పెడుతుంది. కానీ, చంద్రబాబు మాదిరిగా ఈ స్థాయిలో బకాయిలు పెట్టిపోదు.
వాస్తవాలు ఇలా ఉన్నా, చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉండడం కోసం, అబద్ధాలకు రెక్కలు గట్టి, ఏ విధంగా చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నాడు? ఎవరు అందులో భాగస్వాములు? అనేది చెప్పాను.

చంద్రబాబు పరిపాలన అంతా తిరోగమనం:
2014–19 మధ్య దేశ జీడీపీలో రాష్ట్ర వాటా, మా హయాంలో అదెంత అన్నది చూద్దాం. ప్రభుత్వం సంపద లెక్కలు తేలాలంటే.. దేశ జీడీపీలో ప్రభుత్వ వాటా (జీఎస్‌డీపీ) ఎంత అని చూస్తే చాలు.. ఎవరు సంపద సృష్టించారనేది తెలుస్తుంది.
చంద్రబాబుగారి హయాంలో కోవిడ్‌ మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు కోవిడ్‌ ఉంది. చంద్రబాబుగారి హయాంలో 5 ఏళ్లలో దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ వాటా 4.47 శాతం. అదే మా హయాంలో అది 4.83 శాతం. అంటే కోవిడ్‌ ఉన్నా, చంద్రబాబుగారి కంటే బాగా పని చేశాం.
ఉత్పాదక రంగం చూస్తే.. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య దేశ వస్తు ఉత్పత్తి (ఉత్పాదక రంగం)లో రాష్ట్ర వాటా 2.86 శాతం. అదే మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా, 2019–24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 4.07 శాతం. ఇది చాలదా? మా హయాంలో ఉత్పాదక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందింది? (Jagan longest press meet)

వైయస్సార్‌సీపీ హయాంలోనే పెట్టుబడులకు బాటలు:
ఎవరెవరి హయాంలో ఎవరెవరు ఎప్పుడొచ్చారో.. చూద్దాం.
ఇప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు ఎక్కడెక్కడివో పెట్టుబడుల గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నారు.
కానీ, ఒకసారి చూడండి. ఆదిత్య మిట్టల్‌తో నా భేటీ. అంటూ దావోస్‌ సమావేశం ఫోటోలు చూపారు. అలాగే అదానీ, కుమార మంగళం బిర్లా, ముఖేష్‌ అంబానీతో వేర్వేరు సందర్భాల్లో ఫోటోలు చూపారు.
రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూడా మా ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ పెట్టుబడులు మొదలుపెట్టారు. ఆ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న, ఎనిమిది ఎథనాల్‌ ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టారు. ఆయన దాన్ని ముందుకు తీసుకుపోతూ.. ఇక్కడ రూ.65 వేల కోట్ల పెట్టుబడి అంటూ బిల్డప్‌ ఇచ్చారు. కానీ, నిజానికి దానికి పునాది పడింది మా హయాంలోనే. ఇది వాస్తవం.

ఈ ప్రభుత్వం బిల్డప్‌:
ఏ దానికైనా బిల్డప్‌. ఆదిత్య మిట్టల్‌ ఒడిషాలో రూ.1.04 లక్షల కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ కడుతున్నారు. అయితే అదే మిట్టల్‌ ఇక్కడ అనకాపల్లి వద్ద రూ.1.61 లక్షల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసున్నారని లోకేష ప్రకటించారు. దాన్ని ఒడిషా సీఎం తీవ్రంగా ఖండించారు.
పైగా, వస్తున్న కంపెనీలను పంపించేస్తున్నారు. సజ్జన్‌ జిందాల్‌ ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం మొదలుపెడుతుంటే.. ఎవరో హ్యాబిచ్యువల్‌ అఫెండర్‌ను తీసుకొచ్చి, ఆరోపణలు చేయించి, ఆయన వెళ్లిపోయేలా చేశారు. (Jagan longest press meet)

డిస్కమ్‌ల నష్టాలు. అప్పులు. వాస్తవ గణాంకాలు:
చంద్రబాబుగారి హయాంలో జరిగిన నష్టాలు చూస్తే.. 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పవర్‌ డిస్కమ్‌ల నష్టాలు రూ.6625 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల నష్టాలు ఏకంగా రూ.28,715 కోట్లకు పెరిగాయి. అంటే చంద్రబాబు హయాంలో ఏకంగా రూ.22 వేల కోట్ల నష్టాలు పెరిగాయి.
అదే మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల నష్టాలు కేవలం రూ.395 కోట్లు మాత్రమే అదనంగా పెరిగాయి.
చంద్రన్న వెలుగులు. జిలుగులు. మెరుగులు అంటారు కదా.. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి 2016లో డిస్కమ్‌ల అప్పులు రూ.29,552 కోట్లు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు ఏకంగా రూ.86,215 కోట్లకు పెరిగాయి. అంటే ఆయన హయాంలో డిస్కమ్‌ల అప్పులు ఏకంగా రూ.56,664 పెరిగాయి.
అంటే ఏటా సగటున పెరిగిన అప్పు 23.88 శాతం కాగా, మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల అప్పులు రూ.86 వేల కోట్ల నుంచి రూ.1.22 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే కేవలం రూ.36 వేల కోట్లు మాత్రమే పెరిగాయి. అంటే ఏటా పెరిగిన సగటు అప్పులు కేవలం 7.28 శాతం మాత్రమే. (Jagan longest press meet)

డిస్కమ్‌లకు బాబు అరకొర సాయమే:
మామూలుగా డిస్కమ్‌లకు ప్రభుత్వాలు సపోర్ట్‌ చేస్తాయి. అప్పుడే డిస్కమ్‌లు కొనసాగుతాయి. ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం తగ్గుతుంది. చంద్రబాబుగారి హయాంలో 2014–19 మధ్య డిస్కమ్‌లను సపోర్ట్‌ చేస్తూ ఇచ్చిన మొత్తం కేవలం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఏకంగా రూ.47,800 కోట్లు.
అలా ఇవ్వగలిగాం కాబట్టే.. డిస్కమ్‌లు నిలబడగలిగాయి. చంద్రబాబు మామీద వదిలిపెట్టిన ట్రూఅప్‌ ఛార్జీలు, ఫ్యుయల్‌ అడ్జస్ట్‌మెంట్‌ ఛార్జీలకు సంబంధించి, ప్రజలకు తక్కువ బదిలీ చేయగలిగాం. అంటే ఛార్జీలు పెద్దగా పెంచలేదు.

6 నెలలు కాక ముందే ఛార్జీల బాదుడు:
అదే చంద్రబాబు ఎన్నికల ముందు ఏమన్నాడు.. అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామని హామీ ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయాయి. ప్రజలతో పనైపోయింది. అందుకే ఆరు నెలలు కూడా రాకముందే ప్రజలపై ఏకంగా రూ.17,899 కోట్ల భారం మోపాడు.
ఇందులో రూ.6,072 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలు ఇప్పటికే నవంబరులో భారం మోపారు. మిగిలిన రూ.11 వేల కోట్లు డిసెంబరు నుంచి వేస్తాడు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, డిస్కమ్‌లకు సపోర్ట్‌ చేస్తే, ప్రజలపై ఈ భారం పడదు కదా? అంటే ఆయన అక్కడ వాటికి సపోర్టు చేయకుండా, ఇక్కడ ప్రజలపై భారం వేస్తున్నాడు. అదీ చంద్రబాబు వైఖరి.

ఎస్‌ఓఆర్‌ తగ్గింది. కారణం:
చంద్రబాబు మరో మాట. బాబు వస్తేనే సంపద సృష్టి అని. ఈ ఆరు నెలల్లో చంద్రబాబుగారి హయాంలో రాష్ట్ర సంపద (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూస్‌–ఎస్‌ఓఆర్‌)ను, మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలలతో పోల్చి చూస్తే, ఇప్పుడు అది –2 శాతం తగ్గింది.

అంటే మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలల్లో ఎస్‌ఓఆర్‌ రూ.42436 కోట్లు కాగా, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఈ తొలి ఆరు నెలల్లో అది రూ.41,570 కోట్లు. రాష్ట్ర ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గింది. ఎందుకంటే రావడం రావడం దోపిడినే. వచ్చీరాగానే యథేచ్ఛగా ఇసుక దోపిడి చేశారు. ఎక్కడా వదిలిపెట్టలేదు.

ఇంకా పేకాట క్లబ్‌లు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు. మద్యం షాప్‌లు. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ఇప్పుడు సిండికేట్ల చేతిలో. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అది ప్రభుత్వానికి రాదు. అందరికీ వాటా. ప్రైవేటు జేబుల్లోకి.
ఇసుక అమ్మకాల ద్వారా మా హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల రాయల్టీ వచ్చేది. టన్నుకు రూ.370 చొప్పున. ఇప్పుడు గతంలో కంటే ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరగలేదు. చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియాకు పోతోంది. అలా రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ దోచేస్తున్నారు.

క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌:
ఇంకా మూలధన వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌) మీద కూడా చంద్రబాబు అదేపనిగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ కింద ఏటా చేసిన సగటు వ్యయం రూ.13,860 కోట్లు కాగా, అదే మా హయాంలో చేసిన సగటు వ్యయం రూ.15,632 కోట్లు. అందుకే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. ప్రతి గ్రామంలో సచివాలయాలు వచ్చాయి.
ప్రణాళిక ప్రకారం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాం. అవి నీళ్లతో నిండాయి. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటి. వెలిగొండ ప్రాజెక్టు పూరై్తనా నీళ్లు నింపని పరిస్థితి.

ఈరోజు జగనే ఉండి ఉంటే..:
ఎన్నికల ముందు ఇచ్చిన మాట తూచ తప్పకుండా అమలు చేశాం. రాష్ట్ర, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్‌ కూడా ప్రకటించాం. ఆ ఘనత మాదే.
ఇప్పుడు కూడా జగనే ఉండి ఉంటే, ఈ పాటికే ప్రజలకు ఇవన్నీ వచ్చి ఉండేవి.
– ఏప్రిల్‌లో వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు.
– మే లో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ.
– జూన్‌లో బడులు తెరవగానే జగనన్న అమ్మ ఒడి.
– జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపునేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపు.
– ఆగస్టులో విద్యాదీవెనలో మరో త్రైమాసిక చెల్లింపు. వాహనమిత్ర.
– సెప్టెంబరులో వైయస్సార్‌ చేయూత.
– అక్టోబరులో వైయస్సార్‌ రైతు భరోసా రెండో విడత.
– నవంబరులో జగనన్న విద్యాదీవెన. రైతులకు వైయస్సార్‌ సున్నా వడ్డీ రుణాలు.
చంద్రబాబుగారు సీఎం అయ్యారు. అన్ని పథకాలు క్లోజ్‌. ఇంకా..
– డిసెంబరులో చూస్తే.. ఈబీసీ నేస్తం. లా నేస్తం. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపులు.
– జనవరిలో వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ ఆసరా, జగనన్న తోడు, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక.
– ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు.
– మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు.
ఇలా పద్ధతి ప్రకారం క్యాలెండర్‌ ఇచ్చి, అన్నీ పక్కాగా అమలు చేశాం. నాలుగేళ్లు బడ్జెట్‌లో కూడా ప్రకటించాం. ప్రతి పథకానికి కేటాయింపులు చూపాం.

రూ.2.73 లక్షల కోట్ల డీబీటీ:
వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్ల నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇచ్చాం.. అంటూ ఏయే పథకాల కింద ఎంతెంత ఇచ్చారు. ఎంత మంది లబ్ధిదారులు అనేది వివరించారు.
– జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారులు 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము రూ.26,067 కోట్లు.
– జగనన్న వసతి దీవెన 25,17,245 మంది లబ్ధిదారులకు ఇచ్చిన సొమ్ము రూ.4,275.76 కోట్లు.
– జగనన్న విద్యాదీవెన 29,65,930 మంది లబ్ధిదారులు, ఇచ్చిన సొమ్ము రూ.12,609.68 కోట్లు.
– జగనన్న విదేశీ విద్యాదీవెన 408 మంది లబ్ధిదారులు, ఇచ్చినది రూ.107.07 కోట్లు.
– వైయస్సార్‌ రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతులకు ఇచ్చింది రూ.34,378 కోట్లు.
– వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు 84,66,217 మంది లబ్ధిదారులకు ఇచ్చింది రూ.2,050 కోట్లు.
– వైయస్సార్‌ ఉచిత పంటల బీమా 54,75,651 మంది రైతులకు ఇచ్చింది 7,802 కోట్లు.
– ఇన్‌ పుట్‌ సబ్సిడీ 34,41,500 మంది రైతులకు ఇచ్చింది రూ.3,261.61 కోట్లు.
– వైయస్సార్‌ మత్స్యకార భరోసా 2,43,443 మందికి రూ.538 కోట్లు. – వైయస్సార్‌ సున్నా వడ్డీ అక్కచెల్లెమ్మల కోసం 1,05,13,365 మందికి ఇచ్చింది రూ.4,969 కోట్లు.
– వైయస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 66,34,742 మందికి 92,547 కోట్లు.
– వైయస్సార్‌ చేయూత 26,98,931 మందికి రూ.19,189 కోట్లు.
– వైయస్సార్‌ ఆసరా 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.
– వైయస్సార్‌ బీమా 1,03,171 మందికి రూ.1,848.70 కోట్లు.
– వైయస్సార్‌ కాపు నేస్తం కింద 3,58,613 మందికి రూ.2,029.92 కోట్లు.
– వైయస్సార్‌ నేతన్న నేస్తం 82,130 మందికి రూ.982.98 కోట్లు.
– జగనన్న చేదోడు 3,37,802 మందికి 1,260.17 కోట్లు.
– వైయస్సార్‌ లా నేస్తం 5,781 మందికి రూ.41.52 కోట్లు.
– వైయస్సార్‌ వాహన మిత్ర 2,76,368మందికి రూ.1,390.85 కోట్లు.
– వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా 23,28,832 మందికి రూ.1,390.85 కోట్లు.
– ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ 23,28,832 మందికి రూ.2,086 కోట్లు.
– అగ్రిగోల్డ్‌ బాధితులకు 10,40,000 మందికి రూ.905.57 కోట్లు.
– అర్చకులకు, ఇమామ్‌ లకు, మౌజమ్‌ లకు, పాస్టర్లకు 77,290 మందికి రూ.37.71 కోట్లు.
– కోవిడ్‌ సాయం వైట్‌ కార్డ్‌ హోల్డర్లకు 1,35,05,339 మందికి రూ.1,350.54 కోట్లు.
– వైయస్సార్‌ ఈబీసీ నేస్తం 4,95,269 మందికి రూ.1,876.97 కోట్లు.

– వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ 39,38,985 మందికి రూ.12,463.62 కోట్లు. – వైయస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా 56,194 మందికి రూ.427.27 కోట్లు.
– హౌసింగ్‌ 21,31,564 మందికి 12,295 కోట్లు.
– జగనన్న తోడు 15,87,492 మందికి రూ.88 కోట్లు.
ఇలా అన్ని పథకాలు, కార్యక్రమాల ద్వారా మొత్తం 8,70,06,898 ప్రయోజనాలు కల్పిస్తూ, లబ్ధిదార్లకు అందించిన సాయం అక్షరాలా రూ.2,73,756 కోట్లు.

అవన్నీ ఏమయ్యాయి? నీవిస్తానన్నవీ ఏవి?:
చంద్రబాబునాయుడును గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒక్కటే. ఈ పథకాలు ఏమయ్యాయి? ఈ పథకాలూ లేవు. నువ్వు ఇస్తానన్న సూపర్‌ సిక్సులూ లేవు, సూపర్‌ సెవెన్లూ లేవు. ఇదీ నీ బడ్జెట్‌. ఏమన్నా బడ్జెట్టా చంద్రబాబూ? అని అడుగుతున్నా.
ఇదే చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ లో ఆయన ఏమన్నాడు? యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. అంటే రూ.7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్‌లో కనిపించిందా?

వైయస్సార్‌సీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు:
మేం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్‌ 2 గాంధీ జయంతికి ముందే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం. 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించి, ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ చేశాం.
అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేం ఇచ్చిన ఉద్యోగాలు అక్షరాలా 6.31 లక్షలు.
ఇంకా ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ.2,100 కోట్లు ఇన్సెంటివ్స్‌ ఇవ్వడం జరిగింది. 2019–24 మధ్య 3.94 లక్షల ఎంఎస్‌ఎంఈలు గ్రౌండ్‌ అయ్యాయి. వాటి ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. గవర్నమెంట్‌కు సంబంధించి లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌లో 1.02 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు రూ.80,400 కోట్ల పెట్టుబడులతో ఆ ఉద్యోగాలు ఇప్పించగలిగాం.
అలా ప్రభుత్వ రంగంలో ఇచ్చిన 6.31 లక్షల ఉద్యోగాలకు తోడు, లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌లో ఇచ్చిన 1.02 లక్షల ఉద్యోగాలకు తోడు ఎంఎస్‌ఎంఈలలో ఇచ్చి 23 లక్షల ఉద్యోగాలు.. ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వగలిగాం.

అదే చంద్రబాబు వచ్చాక..:
మేం అవన్నీ చేస్తే.. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుపై పడేశారు. ఆ ఉద్యోగాలు కట్‌. 15 వేల మంది ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. 104, 108 ఎంప్లాయీస్‌ కు 2 నెలల జీతం రాకపోతే గొడవ చేస్తే మొన్న ఇచ్చారు. ఆపరేటర్‌ కు అయితే అది కూడా ఇవ్వలేదు. ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్లు ఫిర్యాదులు. టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని కంప్లయింట్స్‌. ఇవన్నీ ఆరు నెలల చంద్రబాబు పాలనలో చూస్తున్న విచిత్రాలు.

సంపద సృష్టి అంటే అప్పులేనా?:
మరోవైపు సంపద సృష్టిస్తానంటాడు. ప్రతి మంగళవారం ఆర్బీఐ డోర్‌ దగ్గరకెళ్లి రుణాలు తీసుకునే దాని కోసం కాలింగ్‌ బెల్‌ నొక్కుతాడు. మా హయాంలో సగటున మేం ప్రతి ఏటా 47 వేల కోట్లు రుణాలు తీసుకుంటే.. చంద్రబాబుగారు వచ్చి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన దాంట్లో ఆయన రూ.68,742 కోట్లు తీసుకోబోతున్నానని బడ్జెట్‌ డాక్యుమెంట్లో ప్రజెంటేషన్‌ ఇచ్చాడు.
మరి 47 వేల కోట్లు తీసుకున్న మా హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందా? మరి ఆయన 68 వేల కోట్లు అప్పు తీసుకోబోతున్న ఆయన హయాంలో శ్రీలంక అయిపోతుందా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబునాయుడు హయాంలో నిజంగా అన్ని రకాలుగా రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకోలేకుండా ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి. ప్రతి సెక్షన్‌ నూ మోసం చేస్తున్న పరిస్థితి.

ఈ ప్రభుత్వం ఫెయిల్‌:
మహిళలు, చిన్నారుల పరిస్థితి చూస్తే ఎప్పుడూ చూడని విధంగా జరుగుతోంది. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ ఐదున్నర నెలల్లోనే జరిగాయి. ఇందులో 11 మంది చనిపోయారు. ఇంత మందిపై దాడులు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. బడ్జెట్‌ చూస్తే మోసం, అబద్ధం. అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్‌.
పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. వారు రోడ్డెక్కుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2300 కోట్లు దాటాయి. వారు రోడ్డెక్కుతున్నారు. 108, 104 సిబ్బంది ధర్నా చేస్తున్నారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌:
అతలాకుతలం అవుతున పరిస్థితుల్లో నీ సూపర్‌సిక్స్‌ ఒక మోసం. సూపర్‌ సెవెన్‌ ఒక మోసం. నీ బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ఒక మోసం. రోజూ డైవర్షన్‌ టాపిక్స్‌. వీటన్నింటినీ ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మంది సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులు. 147 మంది మీద కేసులు. 49 మందిని అరెస్టు చూపారు.

బాబూ ఇదిగో నీ మోసం:
అందరం ట్వీట్‌ చేస్తాం. అదీ చూస్తాం:
చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. ఇదిగో నీ మోసం. నీ సూపర్‌ సిక్స్‌. దీనికి కావాల్సిన బడ్జెట్‌ రూ.74 వేల కోట్లు. నీవు చేసింది మోసం కాదా? నువ్వు చెప్పేది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఇది ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ కాదా?.. అని నేను ట్వీట్‌ చేస్తున్నాను.
అదే నా ఎమ్మెల్యే అభ్యర్థులు, మా పార్టీ నాయకులంతా ట్వీట్‌ చేయబోతున్నారు. నీపై 420 కింద కేసు ఎందుకు పెట్టకూడదు?. నీవు చేసింది మోసం కాదా?.

ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా:
వైయస్సార్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నా. ఈ రెండూ పెడుతూ ట్వీట్‌ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్‌ చేయండి. ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌.. అన్నింట్లో పెట్టండి. ఎంత మందిని అరెస్టు చేస్తారో చూద్దాం. అరెస్టు చేయడం మొదలు పెడితే, నాతోనే స్టార్ట్‌ చేయమని చెబుతాను.
ఏమయ్యా నీవు ఇవన్నీ చెప్పలేదా? నీ మేనిఫెస్టో ఇది కాదా? మరి బడ్జెట్‌లో కేటాయింపులు ఎందుకు లేవు? అబద్ధాలు చెప్పినందుకు, మోసం చేసినందుకు నీ మీద కేసు ఎందుకు పెట్టొద్దు.. అని రాష్ట్ర వ్యాప్తంగా అందరం ట్వీట్‌ చేయబోతున్నాం.

అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాను:
ఇవన్నీ మాట్లాడడానికి గంటా 40 నిమిషాలు పట్టింది. అసెంబ్లీలో కూడా ఇవన్నీ చూపి మాట్లాడితే అంటే టైమ్‌ పడుతుంది. కానీ మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మాకు 40 శాతం ఓట్లు వచ్చాయి. సభలో మేం తప్ప వేరే పక్షం లేదు. అలాంటప్పుడు మా పార్టీని ప్రతిపక్షంగా, అలాగే నన్ను విపక్షనేతగా గుర్తిస్తే, సభలో మాట్లాడేందుకు అంత సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు.
అందుకే, మా ఎమ్మెల్యేలు ప్రతిరోజూ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. మూడు రోజులకు ఒకసారి నేను స్వయంగా మాట్లాడి, ప్రభుత్వాన్ని నిలదీస్తాను.. అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..

ప్రశ్నిస్తే కేసులా?:
ప్రతి పార్టీకీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు ఉన్నారు. మిలియన్ల వాయిస్‌లు సోషల్‌ మీడియా యాక్టివిస్టులే. మోదీకి ఎందుకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రతి పార్టీకీ సోషల్‌ మీడియా అకౌంట్లు నిర్వహిస్తుంటారు. మిలియన్ల ఫాలోవర్లు ఉంటారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా సోషల్‌ మీడియా ఖాతాలు ఉంటాయి. మీ వాయిస్‌ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీపై కేసులు పెడుతున్నారు. ఇలా అయితే డెమోక్రసీ బతుకుతుందా?

ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా ఇలాంటి పద్ధతులు అనుసరిస్తే ఏమైపోతుంది. మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చాలా చూశాం. ఐటీడీపీ ద్వారా మాపై దుష్ప్రచారం చేశారు. ప్రజలు ఎలాంటి మెసేజ్‌ లు పెడుతున్నారో చూడండి. నాన్నకు ఫుల్లు, అమ్మకు నిల్లు అని పోస్టు పెడితే అరెస్టు చేస్తున్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెడచెవిన పెడుతున్నారు. 41–ఎ నోటీసు ఇచ్చి వదిలేయాలన్న నిబంధన పాటించడం లేదు. ఆర్గనైజ్డ్‌ క్రై మ్‌కు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌ రెగ్యులర్‌ గా మోదీని విమర్శిస్తుంది. ఇలా అన్ని పార్టీలూ విమర్శలు చేసుకుంటాయి. అందరూ యువత. 25–40 ఏళ్ల వయసు వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.

అందుకే హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో సవాల్‌ చేస్తున్నాం. కోర్టులు నిర్ణయం తీసుకోవాలి. ఇలా చేసుకుంటూ పోతే మీడియా వాళ్లు కూడా వాయిస్‌ వినిపించే పరిస్థితి ఉండదు. 41ఎ నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేసి పంపకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని అరెస్టులు చేస్తున్నారు. ఐదారు పోలీస్‌ స్టేషన్లకు తిప్పుతూ పలు రకాల కేసులు పెడుతున్నారు. ఇది అక్రమం. చట్టం ప్రకారం నడుచుకోవాలి.

ఆత్మస్తుతి. పరనింద:
తప్పు ఎక్కడ జరుగుతోంది? నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినిపించకుండా నీ గొంతు మాత్రమే వినిపిస్తే అసెంబ్లీ సమావేశాల్లో ఆత్మస్తుతి, పరనింద అన్నట్టు సాగుతాయి. నీ అబద్ధాలు, నీ మోసాలు వీటి ప్రాపగేషన్‌ ఉంటుంది. ఎవరూ మాట్లాడేది ఉండదు, నువ్వే బౌలర్, బ్యాట్స్‌ మెన్, నువ్వే వికెట్‌ కీపర్, నువ్వే ప్లేయర్, నువ్వే ఫీల్డర్‌.. అన్నీ నువ్వే.

ప్రతి పక్షం ఉండి అసెంబ్లీ జరుపుకోవాలని ప్రభుత్వానికి ఉండాలి. ప్రజల వాయిస్‌ వినపడితేనే నేను కరెక్షన్‌ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్లకు ఉండాలి. వారు కరెక్షన్‌ చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే నువ్వు తప్పులు చేసుకుంటూనే పోతావు. అదే జరుగుతోంది.

స్పీకర్‌ కు కోర్టు ఇప్పటికే సమన్లు ఇచ్చింది. రిప్లయ్‌ ఇవ్వలేదు. మళ్లీ నిన్న కోర్టు సమన్లు ఇచ్చింది. రిప్లయ్‌ ఇవ్వక తప్పదు. ప్రతిపక్షంగా వేరే ఇంకే ఏ పార్టీ ఉన్నా ఈయనకు బదులు ఆయనకు ఇస్తున్నా అని చెప్పడానికి ఎవరూ లేరు. ఆటోమేటిగ్గా ప్రతిపక్షంగా గుర్తించాల్సిందే. అది తప్పదు. గుర్తించిన తర్వాత నేచురల్లీ ఎంత మంది ఎమ్మెల్యేలు అయినా ఉండనీ, వారి నాయకుడికి ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిందే. అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిగ్గా మైకు ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రికి ఏరకంగా మైకు ఇస్తారో, తర్వాత సమయం ఇవ్వాల్సింది ప్రతిపక్ష నాయకుడికే. అప్పుడే ఇవన్నీ వినిపించగలుగుతాం.
అసెంబ్లీకి పోయి లాభం ఏముంది? ప్రజల తరఫున మనం మాట్లాడటానికి పోతున్నామన్న ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి వస్తాయి, అప్పుడే కరెక్షన్‌ చేసుకోగలుగుతామనే ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. 40 శాతం ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని అనడమే ఆశ్చర్యం.
ఆత్మస్తుతి, పరనింద తప్ప అసెంబ్లీలో ఇంకేం ఉండవు. ఇంకో వాయిస్‌ వినపడకూడదన్నట్టుగానే జరుగుతోంది. డిస్‌ క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ల చేతుల్లో లేదు. నన్ను చేయగలుగుతారేమో చేయమను. రమ్మను. రెడీ.

ఇవీ చదవండి: Jagan press meet: జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. పవన్, చంద్రబాబు, లోకేష్‌పై కీలక వ్యాఖ్యలు
Dwaraka Tirumala: వాళ్లకంటే బాగా చేసి చూపిస్తున్నాం.. జగన్నాథపురంలో పవన్
Perni Venkataramaiah: జగన్‌ సంపద సృష్టిస్తే.. కూటమి నేతలు ఏం చేస్తున్నారో తెలుసా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు