Pawan at Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan at Vizianagaram) పరామర్శించారు.
అంతకు ముందు గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు
గుర్ల గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
మృతుల కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి విద్య బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏడుగురు మృతి చెందడం విచారకరమని, పలువురు ఆసుపత్రి పాలు కావడం ఆవేదన కలిగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.
బాధితులు చెప్పిన విషయాలను ఓపికగా విన్న పవన్ సమస్యలను తీర్చేలా పని చేస్తామని భరోసా ఇచ్చారు. శుద్ధి చేసిన తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా జల జీవన్ మిషన్ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం అవుతుందని తెలియజేశారు.
అనంతరం గుర్లలో గ్రామస్తులతో డిప్యూటీ సీఎం పవన్ ముఖాముఖి అయ్యారు. మూడు ప్రధాన సమస్యలను ఉప ముఖ్య మంత్రి దృష్టికి గ్రామస్తులు తీసుకు వెళ్లారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంటోందన్నారు. రక్షిత మంచినీటి ట్యాంకును ఎక్కువ రోజులు శుభ్రపరచడంలేదన్నారు. మండల కేంద్రంలో ఒకే ఒక్క రక్షిత ట్యాంకు వల్ల తాగునీటి సమస్య ఉందని పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
అతిసారం సోకి తొమ్మిది మంది చనిపోతే..అధికారులు ఒక్కరే చనిపోయారని తప్పుడు నివేదికలు ఇవ్వడాన్ని గ్రామస్తులు పవన్ ముందు ఆక్షేపించారు. చాలామంది బాధితులు తమ వారు వాంతులు, విరేచనాలతో చనిపోయారని డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు.
ఇవీ చదవండి: Vizianagaram Crime: గుర్లలో డయేరియా మృతులు ఎంతమంది? ప్రభుత్వం ఏమందంటే..
Diarrhea Vizianagaram: డయేరియా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి
Vizianagaram: ఆ మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారి చేత విచారణ
CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
