HomeAndhra PradeshBhumana: సుప్రీంకోర్టును సైతం హెచ్చరించేలా పనవ్ విమర్శలు: భూమన

Bhumana: సుప్రీంకోర్టును సైతం హెచ్చరించేలా పనవ్ విమర్శలు: భూమన

Bhumana: తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సుదీర్ఘ ప్రసంగం, దారుణ అనైతిక విమర్శలపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన (Bhumana) కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవన్‌ విమర్శలు, ఆరోపణలకు దీటుగా బదులిచ్చిన భూమన, డిప్యూటీ సీఎం గతి తప్పి మాట్లాడారని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌కళ్యాణ్‌కు చురకలంటించారు.

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి  తిరుపతి వచ్చారన్న భూమన కరుణాకర్‌రెడ్డి, 14 ఏళ్లుగా తన కుమార్తెలను ఒక్కసారి కూడా దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్‌ అని గుర్తు చేశారు. హిందూ సనాతన ధర్మ ఆచారకులు పిల్లలకు 9 నెలలకే తల నీలాలు తీయిస్తారన్న ఆయన, అలా చేయని పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడయ్యాడని, డిక్లరేషన్‌పై సంతకం చేస్తూ తిరుమలలో కనిపించారని వ్యాఖ్యానించారు.

పవన్‌కళ్యాణ్‌ తీరు ఎలా ఉందంటే.. కెవ్వుకేక అనే పాట గుర్తొస్తుందన్న భూమన.. సరిగ్గా ఆ కెవ్వు కేక బాబాజీలా పవనస్వామి వ్యవహరించారని చెప్పారు. తాను ఈ సభలో రాజకీయాలను మాట్లాడను అని ప్రసంగం ప్రారంభించిన పవనస్వామి, తమ పార్టీపైనా, తమ నాయకుడు వైయస్‌ జగన్‌పైనా పిచ్చిగా రాజకీయ ప్రేలాపనలు చేశారని.. అంత కంటే ఇంకా దిగజారి ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా హెచ్చరికలు జారీ చేశాడని టీటీడీ మాజీ ఛైర్మన్‌ తెలిపారు.

‘కల్లు తాగిన కోతి ఏరకంగా ఎగురుతుందో సనాతన ధర్మం కోసం పవనస్వామి మాటలు అలానే ఉన్నాయి’.. అని ఆయన వ్యాఖ్యానించారు. జీవితంలో ఏనాడూ ధర్మం, హైందవం కోసం మాట్లాడని పవన్‌కళ్యాణ్, తిరుపతి సభలో అవే మాట్లాడడం వెనక ఎజెండా ఉందని అర్థమవుతోందని భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.

‘పవన్‌ సనాతన ధర్మం ప్రకారం బాప్టిజం తీసుకున్నా పర్వాలేదు. గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు, తను స్వీకరించి ముందుకే వెళతా అన్నారు. అంటే పవన్‌ పీఠంలో గొడ్డు మాంసం తీసుకోవచ్చు. ఈరోజు పవన్‌ భాషణ మతి చలింప చేసేలా ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించలేదని కూడా ఆయన మాట్లాడారు. కోర్టుల మీద కూడా పవనస్వామి చురకలు వేశాడు. సనాతన ధర్మం కోసం ఓనమాలు తెలియని వ్యక్తి.. పవన స్వాములు అల్వార్‌లా అవతరించినట్టు మాట్లాడుతున్నారు’.. అని భూమన కరుణాకర్‌రెడ్డి వివరించారు.

ఇంకా తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు వాడారని పవన్‌ మరోసారి దారుణ ఆరోపణలు చేశారని, నిజానికి ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ పరిధిలో ఉన్నా, ఆయన గతి తప్పి మాట్లాడారని దుయ్యబట్టారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యి వాడారనడి అత్యంత హేయమని స్పష్టం చేశారు. హైందవం పేరుతో పవన్‌కళ్యాణ్‌ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని, మతం ముసుగులో నాటకం ఆడాలనుకుంటున్నాడని, ఇలా హైందవ సంçస్కృతికి ఆయన చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదని భూమన తేల్చి చెప్పారు.

‘నేను మళ్లీ పవన్‌ కి ఛాలెంజ్‌ చేస్తున్నా. నెయ్యిలో మేము కల్తీ చేసి ఉంటే మేం దేనికైనా సిద్ధం. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడి ఉంటే మేము ఏ శిక్షకైనా సిద్ధం. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో పశువుల కొవ్వు వాడామని అన్నావు. దాన్ని నిరూపించు. పవనానంద స్వామి నీ ఆరోపణలు నిజమైతే శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల దగ్గర ప్రమాణం చెయ్యు’.. అని టీటీడీ మాజీ ఛైర్మన్‌ సవాల్‌ చేశారు.

అలాగే శ్రీవాణి ట్రస్టు పై చేసిన ఆరోపణలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని, ఆ ట్రస్టులో ఒక్క రూపాయి దుర్వినియోగం చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఊరకే ప్రసంగం చేసి వెళ్లిపోవడం కాదని స్పష్టం చేసిన భూమన, పవన్‌కు ధైర్యం ఉంటే దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని స్పష్టం చేశారు.

దేశంలో కొన్ని వందల పీఠాలు ఉన్నాయన్న టీటీడీ మాజీ ఛైర్మన్, వాళ్లంతా పవన్‌ మాటలు విని భయకంపితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఠాలకు ఏ విలువ లేదన్నట్టుగా పవన్‌ మాట్లాడారని, అధికారం కోసం సనాతన ముసుగు వేసుకుని, ఆ ముసుగులో మతాల మీద దాడి చేసే పవన్‌ నైజం తేటతెల్లమైందని వెల్లడించారు.

హారతి కర్పూరంలో సిగరెట్లు వెలిగించుకోవడమేనా పవన్‌ సనాతన పరిరక్షణ అన్న భూమన, శ్రీరాముడుని ఏ విషయంలో వపన్‌ ఆదర్శంగా తీసుకున్నాడని ప్రశ్నించారు. పవన్‌ ప్రవచనాలు చూసి యువత అంతా సనాతన ధర్మం అంటే ఇదేనేమో అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

గొడ్డు మాంసం తినడం, బాప్టిజం తీసుకోవడం, దీపంలో సిగరెట్‌ వెలిగించడమే పవన్‌ సనాతన ధర్మమా? అని సూటిగా ప్రశ్నించిన టీటీడీ మాజీ ఛైర్మన్‌.. తమ నరనరాన సనాతన ధర్మం ఇమిడి ఉందని స్పష్టం చేశారు. జగన్‌ హయాంలోనే అలిపిరిలో నిత్యహోమం ఏర్పాటు చేశామని, విద్యార్థులందరికీ భగవద్గీతను అందించడమే కాకుండా, గోవింద కోటి రాసిన వారికి ఉచిత బ్రేక్‌ దర్శనం కల్పించింది కూడా వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఇంకా దేశంలో 3500 గుడులు కట్టించింది జగన్‌గారి హయాంలోనే గుర్తు చేసిన ఆయన, చంద్రబాబు హయాంలో వందల గుళ్లు కూల్చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

నిజం చెప్పాలంటే చంద్రబాబు హయాంలోనే హైందవ సంస్కృతిపై దాడి జరిగిందని భూమన కరుణాకర్‌రెడ్డి, అది నిజం కాదనుకుంటే, ధైర్యం ఉంటే పవన్‌ సమాధానం చెప్పాలని అన్నారు. కశ్మీర్‌ నుంచి  కన్యాకుమారి వరకు సనాతన పరిరక్షణ బోర్డుపై తమకెలాంటి అభ్యంతరం లేదన్న టీటీడీ మాజీ ఛైర్మన్, కానీ ఆ పని పవన్‌ చేయడం ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు.

‘ఒక్క నిజం కూడా చెప్పని పవన్‌కు ఛాలెంజ్‌ చేస్తున్నాను. నువ్వు చేసిన ఏ ఆరోపణ అయినా నిరూపించు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. హిందువులను మోసం చేయడానికి పవన్‌ కొత్త రూపం దాల్చాడు. నీలాంటి వాళ్లను.. నాలాంటి వాళ్లందరం ఎదురిస్తునే ఉంటాం. అలజడి మా జీవితం.. ఆందోళన మా ఊపిరి.. మేం ఎదిరిస్తాం.. నిలువరిస్తాం’.. అని భూమన కరుణాకర్‌రెడ్డి వివరించారు.

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు