HomeNationalChief Ministers: ముఖ్యమంత్రులంటే ఇంద్రభవనాల్లోనే ఉండాలా? సాధారణ జీవితం గడపలేరా?

Chief Ministers: ముఖ్యమంత్రులంటే ఇంద్రభవనాల్లోనే ఉండాలా? సాధారణ జీవితం గడపలేరా?

Chief Ministers: ముఖ్యమంత్రి అంటే విలాసవంతమైన భవనాల్లోనే జీవించాలా? సాధారణ జీవితం గడపలేరా? దేశంలో ఎందరో ముఖ్యమంత్రులుగా చేసినా విలాసాలకు దూరంగా, ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకులు ఎవరు? అత్యంత సింపుల్ గా జీవించిన, జీవిస్తున్న మాజీ ముఖ్యమంత్రులు ఎవరెవరు? ఆడంబరాలకు పోయి వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి ఆస్తులు పోగేసుకున్న నేతలు వారి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

సింపుల్ గా జీవించిన ముఖ్యమంత్రులు వీరే..

1. టంగుటూరి ప్రకాశం పంతులు
ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు సాధారణ జీవితం గడిపారు. 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15 దాకా ఆయన పాలన చేశారు. సీఎంగా దిగిపోయిన తర్వాత ఆయన కనీసం రైలు టికెట్ కొనుక్కోవడానికీ డబ్బులు లేవని అప్పట్లో చెప్పేవారు.

2. దామోదరం సంజీవయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పని చేశారు. 1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 12 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన నివాసం చాలా సాధారణంగా ఉండేదట. కట్టెలపొయ్యి మీదే వంట చేస్తూ ఆయన తల్లిని కూడా అత్యంత సాధారణ జీవితం గడిపిందని అప్పట్లో ఆయన ఇంటికి వెళ్లిన ఓ ఐఏఎస్ అధికారి చెప్పారు.

3. మాణిక్ సర్కార్
1998 నుంచి 2018 దాకా త్రిపుర సీఎంగా పని చేసిన మాణిక్ సర్కార్ కూడా అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన చేసిన మంచి పనులు చరిత్రలో నిలిచిపోయాయి. కానీ ఆయనకు సొంత ఇల్లు లేదు, కారు లేదు. మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సతీమణి ఆటోలో మాత్రమే ప్రయాణించేవారని చెబుతారు.

4. జననాయక్ కర్పూరీ ఠాకూర్
బిహార్ మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన జననాయక్ కర్పూరీ ఠాకూర్ సైతం అత్యంత సాధారణ జీవితం గడిపారు. ధరించడానికి సరైన బట్టలు కూడా లేని పరిస్థితి ఆయనదని చెబుతారు. ఆయన చనిపోయే నాటికి ఆయన ఉన్న ఇల్లు దాదాపు పాడుపడిపోయిన స్థితికి చేరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును సైతం ఆయనకు ఇచ్చింది.

ఇలా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్లు మాత్రమే కాదు.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి అసలైన నాయకులు కూడా అత్యంత సాధారణ జీవితాలను గడిపి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.

నవీన్ పట్నాయక్.. ద లెజెండ్
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. 24 ఏళ్ల, 99 రోజులు ఈయన సీఎంగా పని చేశారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ ఛమ్లింగ్ ఉన్నారు. ఆయన 24 ఏళ్ల, 165 రోజులు సీఎంగా పని చేశారు. మూడో స్థానంలో వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు ఉన్నారు. ఈయన 23 ఏళ్ల, 137 రోజులు ముఖ్యమంత్రిగా చేశారు.

2024 ఎన్నికల్లో ఒడిశా ఎన్నికల్లో బిజూ జనతాదళ్ (బీజేడీ)ని ఓడించి బీజేపీ అక్కడ జెండా పాతేసింది. గిరిజన నాయకుడు మోహన్ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికా రావాల్సిందిగా ఆయన స్వయంగా నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఈ సమయంలో మన తెలుగు రాష్ట్రాలు లేదా దేశంలోని ఏ ఇతర రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకుల మధ్య లేని సఖ్యత అక్కడ కనిపించింది. మాంఝీని ఎంతో ఆప్యాయంగా నవీన్ పట్నాయక్ పలకరించారు. ఈ సందర్భంగానే నవీన్ పట్నాయక్ ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు అత్యాధునిక భవనాలు, భారీ భవంతులు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖరీదైన భవనాల్లో వందిమాగదులతో అట్టహాసంగా బతుకుతున్నారు. కానీ నవీన్ పట్నాయక్ చాలా సాధారణమైన తన ఇంట్లోనే ఉంటున్నారు. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అధునాతన భవనాలు కట్టుకోవడం, ఆస్తులు పోగేసుకోవడం లాంటివేమీ ఆయన చేయలేదు.

పదవి అనేది ప్రజాసేవకే.. విలాసాలకు కాదు..
నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్.. ఒడిశాకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. తండ్రి నిర్మించి ఇచ్చిన నివాసంలోనే 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఉంటున్నారు. ఆ ఇంట్లోనే గత పాతికేళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా కొనసాగింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వేరే క్యాంపు కార్యాలయాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నవీన్ పట్నాయక్ ఇల్లు కూడా అతి సాధారణంగానే ఉంటుంది. రాజకీయం అంటే కేవలం ప్రజా సేవ మాత్రమేనని, ఆస్తులు, అంతస్తులు కూడబెట్టుకోవడానికి, విలాసాల కోసం కాదని నవీన్ పట్నాయక్ నమ్మి, ఆచరించి చూపించారు.

సీఎం ప్రమాణ స్వీకారానికి మాజీలు ఎప్పుడైనా వెళ్లారా?
మోహన్ మాంఝీ ప్రమాణ స్వీకారానికి స్వయంగా వెళ్లిన నవీన్ పట్నాయక్.. మొత్తం కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర నేతలందరూ ఆయనను సగౌరవంగా వేదికపైకి ఆహ్వానించారు. అంతటి హుందాతనం నవీన్ పట్నాయక్ సొంతం. నవీన్ పట్నాయక్ ఓటమిని ఒడిశాలో చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అభిమానులు కన్నీటి సంద్రమయ్యారు. రెండున్నర దశాబ్దకాలం తమకు ఏ లోటూ లేకుండా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆదుకుందని, పేదల కోసం ఆయన చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయంటూ పలువురు పేర్కొంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు..
అటు సోషల్ మీడియాలోనూ నవీన్ పట్నాయక్ దిగిపోగానే ఎవరూ కూడా ఆయనపై వ్యతిరేకంగా కామెంట్లు పెట్టలేదు. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేకపోవడం నవీన్ పట్నాయక్ మంచితనాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తోంది. సాధారణ జీవితం, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నవీన్ పట్నాయక్ నమ్ముతారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు నవీన్ పట్నాయక్ నుంచి ఏం నేర్చుకోవాలంటే..

* ముఖ్యమంత్రులు ఉండే ఇళ్లు, తిరిగే కార్లు, విలాసాలు, వందిమాగధులు.. ఇలా వీటికి ప్రాధాన్యం ఇవ్వకూడదని మన ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు నేర్చుకోవాలి. ఏ ముఖ్యమంత్రి పాలనలో అయినా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, రాష్ట్రం గొప్పగా ముందుకు వెళ్లాలి.

* వందల ఎకరాల భూముల కబ్జా, ప్రజల సొమ్ముతో విలాసాలు చేయకూడదు. కళ్లు చెదిరే ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు నిర్మించుకుని, భారీ సెక్యూరిటీ మధ్య జనానికి ఆమడదూరంలో ఉండేబదులు, ప్రజలకు దగ్గరగా, సాధారణ జీవితం గడపడంపై ప్రాధాన్యం ఇవ్వాలి.

* అవినీతికి పాల్పడకుండా, రాజభోగాలకు దూరంగా ఉండాలి. ప్రజల సొమ్ముతో విలాసాలు, విందులు, వైభోగాలు ఆపేయాలి.

* జనం కట్టే ట్యాక్స్ సొమ్ముతో ముఖ్యమంత్రులు, మంత్రులు సాగిస్తున్న దర్పం ఆగిపోవాలి. వందల కార్ల కాన్వాయ్ లు కాకుండా అవసరమైన మేరకే పొదుపుగా ప్రజాధనాన్ని వాడి, ఆ మిగిలిన సొమ్మును ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ఖర్చుపెట్టాలి.

* తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లుగా సీఎంలుగా పని చేసిన, చేస్తున్న చంద్రబాబు, కేసీఆర్, వైయస్ జగన్, రేవంత్ రెడ్డి.. వీళ్లెవరిదీ సింపుల్ లైఫ్ స్టైల్ కానే కాదు. ఇలాంటి వారు మన పాతకాలం ముఖ్యమంత్రులను, నేటి నవీన్ పట్నాయక్ ను చూసి ఇకనైనా నడత మార్చుకుంటారని ఆశిద్దాం.

Read also: YSR Politics: వైయస్ఆర్ చరిష్మా కోసం కొట్లాట? ఎవరు అసలైన వారసులు?
Free Sand: ఏపీలో ఉచిత ఇసుకపై దుమారం.. టన్ను కేవలం రూ.1,394 మాత్రమే!
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
Arunachalam: అరుణాచలం టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవీ..
YS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు….?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు