HomeAndhra PradeshYSR Politics: వైయస్ఆర్ చరిష్మా కోసం కొట్లాట? ఎవరు అసలైన వారసులు?

YSR Politics: వైయస్ఆర్ చరిష్మా కోసం కొట్లాట? ఎవరు అసలైన వారసులు?

YSR Politics: పంచకట్టులో ప్రపంచాన మొనగాడు.. అని డాక్టర్ సి.నా.రె. అన్నట్లుగా.. రాజశేఖరరెడ్డి పంచకట్టుతో జనంలోకి వచ్చాడంటే రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. తెలుగుదనానికి, గ్రామీణ వాతావరణానికి, రైతుదనానికి వైయస్ఆర్ నిదర్శనం. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. అంటూ తనదైన శైలిలో పంచులు వేయడం వైయస్సార్ స్టైల్. విశ్వసనీయత ఆయన మార్క్. మాట తప్పే అలవాటు లేదు, మడమ తిప్పే అలవాటు లేదన్నది ఆయన శైలి. వ్యవసాయం దండగ కాదు, పండుగ చేయాలన్నది ఆయన అభిమతం. ఒక చాకలి కొడుకు డాక్టర్ అయ్యాడంటే, ఒక మంగళి కుమార్తె ఇంజనీర్ అయ్యిందంటే అందుకు కారణం వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్లే. ఆరోగ్యశ్రీతో ఎందరో పేదల జీవితాలు నిలబెట్టిన ఘనచరితుడు రాజశేఖరరెడ్డి.

రాజశేఖరరెడ్డి అంటే ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి కేరాఫ్ గా నిలిచారు. ఆయన చేసిన మంచి ప్రతి గడపకూ వెళ్లింది. పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైయస్ఆర్ జీవితం రాజకీయాల్లో ఎవరికైనా ఓ ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీలో సుమారు మూడు దశాబ్దాల పాటు కష్టించి, శ్రమించిన నాయకుడు వైయస్ఆర్. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి, నేతలు, కార్యకర్తలను ఏకం చేసి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అధికారంలోకి రాగానే తన మార్క్ పాలనను చేసి చూపించారు. మరి ఇప్పుడు వైయస్ఆర్ రాజకీయ, ఆశయాల వారసత్వం ఇప్పుడు ఎవరు అందిపుచ్చుకున్నారు? ఆయన చరిష్మాను తమ సొంతం చేసుకోవాలని ఎవరెవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?

2009 సెప్టెంబర్ 2న ఆయన చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీనే ప్రాణంగా భావించారు. ఆయన మరణానంతరం ఉమ్మడి రాష్ట్రంలో వేగంగా పరిణామాలు మారిపోయాయి. ఆయన కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా అప్పటికే గెలిచారు. వైయస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించాలని చాలా మంది కోరుకున్నారు. ఈ క్రమంలో 151 మంది ఎమ్మెల్యేలు జగన్ సీఎం కావాలని సంతకాలు పెట్టారని చాలా మంది ఇప్పటికీ చెబుతారు. కానీ జగన్ మాత్రం రోశయ్యను ముఖ్యమంత్రిగా చేయాలని సిఫార్సు చేశారు. ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైయస్ మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలు ఆగిన కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది.

వారసత్వం కోసం జగన్ పోరాడాలా?
జగన్ పర్యటనలకు వేలాదిగా జనం తరలి వస్తుండటాన్ని సోనియా గాంధీ చూశారు. దీంతో రాజకీయ సంక్షోభం రాకూడదనే ఉద్దేశంతో జగన్ ను ఓదార్పు యాత్ర ఆపాలని సూచించారు. కానీ ఆయన వినలేదు. అటు తర్వాత జగన్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం, తల్లితో కలిసి స్వతంత్రంగా పోటీ చేసి కడప లోక్ సభ నుంచి జగన్, పులివెందుల నుంచి విజయమ్మ గ్రాండ్ విక్టరీ సాధించడం జరిగిపోయాయి. ఆ తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ స్థాపించారు. అటు తర్వాత కాంగ్రెస్ అధిష్టానం జగన్ పై కక్షగట్టి కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినా వెరవక పోరాడారు. 2014లో కేవలం 67 సీట్లకు పరిమితమైన జగన్.. అలసిపోకుండా పోరాడి 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఈ ప్రయాణంలో వైయస్ఆర్.. ప్రియతమ నేత, రాజశేఖరరెడ్డి గారు, నాన్న గారు.. అంటూ జగన్ తలచుకుంటూనే వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని నాలుగింతలు చేసిన జగన్.. వైయస్ఆర్ కు నిజమైన వారసుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు.

సోదరితో జగన్ కు విభేదాలు
2024 ఎన్నికల ముంగిట తన సోదరి షర్మిలతో జగన్ కు విభేదాలు వచ్చాయి. జైలుకు వెళ్లినప్పుడు పార్టీని కాపాడిన షర్మిల.. అటు తర్వాత ఏమి ఆశించారో, జగన్ ఏమి చేయలేకపోయారో, అనేక కథనాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా తన బావమర్ది బ్రదర్ అనిల్ కోరినట్లుగా ప్రాజెక్టులు, పనులు, డబ్బులు, ఆస్తులు ఇవ్వకపోవడంతోనే షర్మిల, జగన్ మధ్య చిచ్చురేపిందని చెబుతారు. కానీ.. పరిస్థితి చేయిదాటి పోయింది. నేరుగా జగన్ ను షర్మిల టార్గెట్ చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తెలంగాణలో వైయస్ఆర్ టీపీ పార్టీని పెట్టిన షర్మిల, అక్కడ నుంచి ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు వైయస్ఆర్ వారసత్వం తనదేనని, పాత కాంగ్రెస్ నేలందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఆమెలో బలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు తన తల్లి విజయమ్మ మద్దతు కూడా ఉందని కొందరు చెబుతారు.

తెలంగాణలోనూ వైయస్ నామ జపం
తెలంగాణలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ అయ్యారు. అప్పటిదాకా వైయస్ నుద్దేశించి పావురాల గుట్టలో పావురమైపోయాడంటూ కామెంట్స్ చేసిన రేవంత్.. సీఎం అయిన తర్వాత మా కాంగ్రెస్, మా నాయకుడు వైయస్ అని మాట మార్చారు. అప్పటిదాకా సోనియాను ఇటలీ దెయ్యం అని కామెంట్స్ చేసిన నోటితోనే జై సోనియమ్మ.. తెలంగాణ తల్లి అనే కామెంట్స్ చేశారు. షర్మిలతో విభేదాలు పక్కనపెట్టి ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామంటూ చెబుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కది మాత్రం మొదటి నుంచీ ఒకే తీరు. ఆయన కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచీ వైయస్ మనిషిగా పేరుంది. ఆయన పూజగదిలో సైతం వైయస్ఆర్ చిత్రపటం ఉంటుంది. ఆయన కూడా కాంగ్రెస్ లో నుంచి వెళ్లిన పాత నాయకులంతా తిరిగి వచ్చేయాలని తాజాగా ఆహ్వానించారు. వైయస్ వారసత్వాన్ని, చరిష్మాను వాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇటీవలి కాలంలో ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ లో వైయస్ మనుషులుగా గుర్తింపు పొందారు. ఇలాంటి వారంతా ఆయన చరిష్మాను మరువలేదు.

ముఖ్యమంత్రి కావాలని షర్మిల ఆకాంక్ష
విభజన తర్వాత ఏపీలో పూర్తిగా చేవచచ్చిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలని వైయస్ఆర్ తనయ షర్మిల ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, చంద్రబాబు, ఢిల్లీలో కొందరు పెద్దల సపోర్ట్ ఉందన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను రాజకీయంగా తమకు అడ్డు రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఏకమవుతున్నారన్నది కొందరి వాదన. దీనికి వైయస్ చరిష్మా, ఆశయాలు, వారసత్వం షర్మిలకే దక్కుతుందనే వాదనను తెరపైకి తెస్తున్నారు.

కాంగ్రెస్ పుంజుకోవడం ప్లస్ అవుతోందా?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాస్త పుంజుకుంది. ఇండియా కూటమిలో ఇతర నేతల సత్తా కూడా కలిసొచ్చింది. ఇక బీజేపీ 240 సీట్లకే పరిమితం కావడం కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాయిస్ వినిపించేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనూ ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ అయ్యింది. ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పాగా వేసింది. ఏపీలోనూ ఇదే జరగాలని ప్రయత్నాలు చేస్తోంది. జగన్ తమ దారికి రాడని, అందుకే షర్మిల అస్త్రంగా చేసుకుని వైయస్ చరిష్మాను ఇటు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడానికి అటువైపు నుంచి చంద్రబాబు సపోర్ట్ కూడా తీసుకోవాలని కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తనను వ్యతిరేకించే వారు ఎవరైనా వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలన్న కాంగ్రెస్, చంద్రబాబు లక్ష్యాలకు జగన్ ఒక్కడే సూటవుతాడని చెబుతున్నారు.

వైయస్ ను ఓన్ చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు
వైయస్ జయంతి సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు గతంలో లేని విధంగా చిత్రపటాలకు పూల మాలలు, విగ్రహాలకు పూలదండలు, జయంతి సభలు నిర్వహిస్తూ హడావుడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ సైతం 2024 ఎన్నికల ముంగిట ఇడుపులపాయ వెళ్లి వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అంతేకాదు.. తన భారత్ జోడో యాత్రకు వైయస్ఆర్ చేపట్టిన పాదయాత్ర స్పూర్తి అని కామెంట్స్ చేశారు.

ఎవరు అసలైన వారసులు?
వైయస్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే ఇన్నేళ్లు లేని ప్రేమాభిమాలను కొందరు నేతలకు, పార్టీలకు ఇప్పుడే ఎందుకు పుట్టుకొచచినట్లు? అని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలతో నడిచేవారు, షర్మిల నాయకత్వాన్ని బలపరచాలనుకునే వారు, కాంగ్రెస్ ఉన్నవారు మాత్రమే వైయస్ చరిష్మాను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులా? వైయస్ కుమారుడు జగన్ పై కేసులు పెట్టి 14 నెలలు జైలు పాలు చేసినప్పుడు జగన్ తో నడిచిన వారు వైయస్ చరిష్మాను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులు కారా? అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్.. తన పాలనలో 99 శాతం హామీలు నెరవేర్చడం వైయస్ఆర్ ఆశయాల సాధన కిందకు రాదా? విభజన అనంతరం వైయస్ఆర్ కు మా పార్టీతో సంబంధం లేదన్న కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఆయన ఆశయాల జపం చేయడం దేనికి సంకేతం? ఈ ప్రశ్నలు సామన్యుని మదిలో మెదులుతున్నాయి. అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

ఇవీ చదవండి: CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
YS Jagan in Nellore: దాడులు ఆపాలి.. చంద్రబాబుకు వైయస్ జగన్ హెచ్చరిక
Arunachalam: అరుణాచలం టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవీ..
Deputy CM Pawan Kalyan: కొత్త రక్తం.. నవ్య పథం.. గతితప్పిన రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాడా?
Reddy Community: సొంత సామాజికవర్గమే జగన్‌ను ముంచేసిందా? అంత వ్యతిరేకతకు కారణాలేంటి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు