Free Sand: ఏపీలో కొత్తగా ఇసుక పాలసీని చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఉన్న ఇసుక పాలసీని మారుస్తూ జీవో జారీ చేసింది. కొత్త ఇసుక పాలసీ విధి విధానాలను రూపొందిస్తున్నారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు ట్రోల్స్ వస్తున్నాయి. అందుకు కారణం.. కొన్ని ప్రాంతాల్లో ఉచిత ఇసుక పాలసీ అని ఫ్లెక్సీలు పెట్టి.. టన్ను కేవలం రూ.1,394 మాత్రమేనంటూ అదే ఫ్లెక్సీలో కనిపించడం. దీనిపై ఏపీలో ప్రతిపక్షానికి చెందిన వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
ఉచిత ఇసుక పాలసీని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాలపై ఆదేశాలిచ్చినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఏ ఇసుక రీచ్ దగ్గరికైనా వెళ్లి ప్రజలు ఇసుక తీసుకోవచ్చన్నారు. సీనరేజీ, లోడింగ్ చార్జీలు మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవాల్సిన పని లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తూ కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం 120 స్టాక్ పాయింట్లలో 43 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వెల్లడించారు.
ఉచితం అని చెప్పి రూ.1,394 ఏంటి?
విశాఖపట్నం జిల్లా అగనంపూడి ఇసుక డిపో వద్ద నూతన ఉచిత ఇసుక విధానం అంటూ ఫ్లెక్సీని కట్టారు. ఇందులో దిగువన 8వ తేదీ నుంచిసామాన్యుడికి అందుబాటులో ఇసుక అంటూ పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక సరఫరా ఉంటుందన్నారు. అయితే, డిపో వద్ద ఇసుక ధర టన్నుకు రూ.1,394 అని, ఒకరికి ఒక ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేస్తారని పేర్కొన్నారు. ఈ ఫొటోతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు అంత వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇసుక పాలసీని పవన్ కల్యాణ్ విమర్శించిన వీడియోలు, ఓ టీవీ చానల్ లో ప్రసారమైనట్లుగా గతంలో జగన్ ప్రభుత్వంలో టన్ను ఇసుక రూ.375 ఉండేదన్న వార్తల క్లిప్పింగ్ లను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిపై మొదట్లోనే విమర్శలు రావడంతో ప్రభుత్వం ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: SADAREM: సదరం సర్టిఫికెట్ ఎలా పొందాలి? ఎక్కడ ఇస్తారు? పూర్తి వివరాలు ఇవీ..
Interesting facts: మీకు తెలుసా? మాంసాహారం కంటే శాకాహారం ధరే పెరిగిందట!
NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
