Arunachalam: మనుషులు కొన్ని కోట్ల జన్మల నుంచి చేస్తున్న పాపాలు తొలగిపోవాలంటే ఈ కలియుగంలో ఏకైక మార్గం అరుణాచల గిరి ప్రదక్షిణ, అక్కడి శివయ్యను దర్శించుకోవడమేనన్నది పండితులు చెబుతున్న మాట.
అరుణాచల శివ..
అరుణాచల శివ..
అరుణాచల శివ..
అసలు అరుణాచలం వెళ్లాలన్న ఆలోచన రావడమే మీకున్న సమస్యలు తొలగిపోవడానికి మొదటి అడుగు అని చెబుతారు పెద్దలు. జీవుడు తన జీవితంలో ఒక్కసారి అయినా అరుణాచలం వెళ్లాలని, అప్పుడే చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడని ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెబుతారు. ఈ జీవుడు అరుణాచలం వెళ్లడానికి ముందు, ఆ తరువాత… అనే విధంగా జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతారాయన. ఈ విషయాన్ని ఎంతో మంది నిరూపించారు కూడా. కాబట్టే అరుణాచల గిరి ప్రదక్షిణకు రోజు రోజుకూ ఆదరణ అదే రకంగా పెరుగుతోంది.
అరుణాచలం వెళ్లాలని చాలా మంది కోరిక ఉంటుంది. కానీ, శివానుగ్రహం లేనిదే ఆ కోర్కె నెరవేరడం దాదాపు అసాధ్యం. వెళ్దామనుకుని చాలా సార్లు ఆగిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో వెళితే కోరిన కోర్కెలు పరమేశ్వరుడు నెరవేరుస్తాడని ప్రతీతి. అందుకే ప్రతి పౌర్ణమికీ అక్కడ ఇసకేస్తే రాలనంత మంది భక్తులు ఉంటారు. పౌర్ణమి రోజుల్లో సుమారు 14 లక్షల నుంచి 16 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేసుకుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక సాధారణ రోజుల్లోనూ ఇక్కడ గిరి ప్రదక్షిణ, దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి శివయ్య భక్తులు అరుణాచలానికి వస్తుంటారు.
అరుణాచలం ఆలయ ప్రాశస్త్యం..
అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ.. ఎర్రని కొండ అని అర్థం. అ-రుణ అంటే పాపాలను పరిహరించేదని అర్థం. కేవలం స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే గొప్ప క్షేత్రం ఇది. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్న అని భక్తులు విశ్వసిస్తారు. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచేత నిర్మించారని, దాని చుట్టూ అరుణమనే పురం వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ జరగాల్సిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞతో ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యం చెబుతోంది.
గిరి ప్రదక్షిణ ఎలా మొదలు పెట్టాలంటే..
అరుణాచల గిరి ప్రదక్షిణ రాజగోపురం వద్ద మొదలు పెట్టాలి. కర్పూరం తీసుకుని దీపాలు వెలిగించి అరుణాచలేశ్వరా.. పరమేశ్వరా.. అని మనసులో మొక్కుకొని బయల్దేరాలి. గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో అష్టలింగాలను దర్శించుకుంటూ వెళ్లాలి.
1. ఇంద్ర లింగం
మొదట ఇంద్రలింగం వస్తుంది. ఇంద్రుడు ఇక్కడి శివలింగాన్ని స్వయంగా ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది.
2. అగ్ని లింగం
రెండో లింగం అగ్ని లింగం వస్తుంది. దీన్ని అగ్నిదేవుడు ప్రతిష్టించాడని చెబుతారు.
3. యమ లింగం
మూడో లింగం యమలింగం వస్తుంది. దీన్ని యమధర్మరాజు ప్రతిష్టించాడు.
4. నైరుతి లింగం
ఇక నాలుగోది నైరుతి లింగం. దీన్ని నైరుతి ప్రతిష్టించాడు.
5. వరుణ లింగం
5వ లింగం అరుణ లింగం. వాన దేవుడు ప్రతిష్టించాడు.
6. వాయు లింగం
ఆరో లింగం వాయు లింగం వస్తుంది. వాయుదేవుడు ప్రతిష్టించాడు.
7. కుబేర లింగం
ఏడో లింగం కుబేర లింగం. కుబేరుడు ప్రతిష్టించాడు.
8. ఈశాన్య లింగం
ఆఖరిది ఈశాన్య లింగం.
ఇవే కాకుండా సూర్యలింగం, చంద్రలింగం, మోక్షమార్గం, ఆశ్రమాలు, పలు దేవాలయాలు వస్తాయి. 14 కిలోమీటర్ల పాటు వీటన్నింటినీ దర్శనం చేసుకోవచ్చు.
గిరిప్రదక్షిణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. షుగర్, ఇతర బాధితులు కాళ్లకు సాక్సులు వెళ్తుంటారు. వెళ్లలేని వాళ్లు ఆటోల్లోనూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. బరువు ఎక్కువగా ఉన్న బ్యాగులను తీసుకెళ్లవద్దు. రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేయడం ఉత్తమం. పగలు తారు రోడ్డుపై వేడి ఉంటుంది కాబట్టి కాళ్లు బొబ్బలు వస్తాయి. పౌర్ణమి రోజున చేయడం ఉత్తమం. వడివడిగా కాకుండా ఒకే తరహాలో మీడియం స్పీడ్ తో వెళ్తూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అలసట రాకుండా ఉంటుంది. మధ్యలో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోకుండా సాధ్యమైనంత వరకు నడక కొనసాగిస్తూనే వెళ్లాలి. అరుణాచల శివ అంటూ స్మరించుకుంటూ వెళ్లాలి. రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించండి. గిరి ప్రదక్షిణలో వచ్చే అన్ని ఆలయాలనూ దర్శించుకోండి. యువత అయితే 4 గంటలు, పెద్దలైతే 6 నుంచి 8 గంటలు గిరి ప్రదక్షిణకు సమయం పడుతుంది. పౌర్ణమి రోజుల్లో మరింత ఆలస్యం అవుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. మొదటిసారి వెళ్లే వారికి కాళ్లు బొబ్బలు వస్తాయి. దారిలో కాళ్ల నొప్పులకు ప్రత్యేకంగా ఆయిల్ విక్రయిస్తుంటారు. అవి తీసుకుని పూసుకోవడం వల్ల కాస్త తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. వేగంగా వెళ్లకపోవడం, నెమ్మదిగానే అడుగులు వేయడం వల్ల కాళ్ల బొబ్బలు రాకుండా చూసుకోవచ్చు.
ఏ వారం గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?
సోమవారం: సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుంది.
మంగళవారం: పేదరికం తొలగిపోతుంది. ఎంతటి పేదవాడైనా గిరిప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవుతాడు. మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుంది.
బుధవారం: లలిత కళలలో రాణిస్తారు. జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తారు.
గురువారం: ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
శుక్రవారం: వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
శనివారం: నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుంది. శనిదోషాలు హరించుకుపోతాయి. కష్ట కారుకుడైన శని శాంతిస్తాడు.
ఆదివారం: కైలాసప్రాప్తి కలుగుతుంది. పిల్లలు లేని భార్యాభర్తలు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు.
దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది?
గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత చాలా మందికి ఎనర్జీ తగ్గిపోతుంది. పౌర్ణమి రోజుల్లో అయితే దర్శనానికి 4 నుంచి 6 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. సాధారణ రోజుల్లో ఒక గంటలోపే దర్శనం పూర్తి చేసుకోవచ్చు. తిరుమల లాంటి వెయిటింగ్ సిస్టమ్ ఏమీ ఉండదు. వరుసగా, నెమ్మదిగా క్యూ కదులుతూనే ఉంటుంది. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని క్యూలైన్లో అరుణాచలేశ్వరుని దర్శనం పూర్తి చేసుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఎంత కష్టమైనా భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకుని అరుణాచలేశ్వరుని కూడా దర్శనం చేసుకుంటారు.
స్టే చేయడానికి గదులు ఉంటాయా?
దూర ప్రయాణం చేసి అరుణాచలం చేరుకున్న తర్వాత ఫ్రెష్ అప్ కావడానికి గదుల కోసం చాలా మంది వెతుకుతుంటారు. అరుణాచలేశ్వర ఆలయం చుట్టుపక్కల ఒకటి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో అనేక హోటళ్లు, ఆశ్రమాలు ఉన్నాయి. తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు సైతం ఉన్నాయి. రూ.500 నుంచి రూ.2,000 వేల వరకు ధరల్లో అందుబాటులో ఉంటాయి.
అరుణాచలం చేరుకోవడానికి మార్గాలు
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పట్టణాల నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంటుంది. విమానం ద్వారా కూడా వెళ్లొచ్చు. సొంత వాహనాల్లోనూ వెళ్లొచ్చు.
1. బస్సు ద్వారా వెళ్లే వారు ప్రముఖ పట్టణాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఆర్టీసీ తీసుకొచ్చింది. దగ్గర్లోని ఆర్టీసీ బస్టాండులో ఈ వివరాలు కనుక్కోవచ్చు. ప్రతి పౌర్ణమికీ ఆర్టీసీ ప్యాకేజీ బస్సులు నడుస్తాయి. ప్రయివేటు ట్రావెల్స్ కూడా ఉంటాయి. విడిరోజుల్లో ప్యాకేజీ కాకుండా వెళ్లాలనుకునే వారికి మొదట తిరుపతికి చేరుకోవాలి. అక్కడి నుంచి తిరువణ్ణామలై బస్సులు అందుబాటులో ఉంటాయి.
2. రైళ్ల ద్వారా వెళ్లే వారు కొన్ని ప్రాంతాల నుంచి నేరుగా తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ కు రైళ్లు వెళ్తాయి. మరికొన్ని ప్రాంతాల వారు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి తిరువణ్ణామలై వెళ్లాలి.
3. విమానంలో వెళ్లే వారు హైదరాబాద్ నుంచి లేదా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి తదితర విమానాశ్రయాల నుంచి చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి బస్సు లేదా ట్రైన్ ద్వారా తిరువణ్ణామలై వెళ్లాల్సి ఉంటుంది.
విజయవాడ నుంచి అరుణాచలం ఆర్టీసీ టూర్ ప్యాకేజీ వివరాలు
విజయవాడ నుంచి ప్రతి పౌర్ణమికీ ఆర్టీసీ ప్యాకేజీ బస్సులు నడుస్తాయి. ప్యాకేజీ ధర రానూ పోనూ కలిపి సుమారు రూ.2,500 ఉంటుంది. సొంత ఖర్చులు రూ.1,500తో కలిపి మొత్తం రూ.4,000తో అరుణాచలంతో పాటు మరికొన్ని ఆలయాలను దర్శించుకుని రావచ్చు. ఇందులో మొదట విజయవాడ నుంచి రాత్రి 9 గంటలకు బస్సు బయల్దేరుతుంది అనుకుంటే.. ఉదయం 5 గంటలకల్లా శ్రీకాళహస్తికి చేరుకుంటారు. అక్కడ పార్కింగ్ ప్లేస్ లో ఆర్టీసీ బస్సును ఆపుతారు. అక్కడే ఫ్రెష్ అప్ అవ్వొచ్చు. తర్వాత దర్శనం చేసుకుని, అక్కడే టిఫిన్ తినేసిన తర్వాత బస్సు ఉదయం 8 గంటలకు బయల్దేరుతుంది.
మధ్యాహ్నం 1 గంటకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ దర్శనం సుమారు 3 గంటలు పడుతుంది. సాయంత్రం 4 గంటలకు బయల్దేరి గోల్డెన్ టెంపుల్ కు చేరుకుంటుంది. అక్కడ అమ్మవారి దర్శనం 3 గంటలు పడుతుంది. అక్కడి నుంచి అరుణాచలం ఆలయం సుమారు 100 కిలోమీటర్లు ఉంటుంది. 3 గంటల్లో ఆలయం వద్దకు ఆర్టీసీ బస్సు చేరుకుంటుంది. ఆలయానికి 2 కిలో మీటర్లు ముందే ట్రాఫిక్ ఆపేస్తారు. రాత్రి 11 లేదా 12 గంటలకు అక్కడ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టొచ్చు. ప్రదక్షిణ, దర్శనం పూర్తి చేసుకుని మరుసటి రోజు సాయత్రం 3 గంటలకు బస్సు వద్దకు భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో భక్తులు వెళ్లాలనుకుంటే కంచి క్షేత్రం కూడా చూపిస్తారు. ఇందుకోసం రూ.200 అదనంగా చార్జ్ చేస్తారు. అనంతరం నేరుగా బస్సు విజయవాడకు చేరుకుంటుంది.
ఇవీ చదవండి: Arunachala Giri Pradakshina: అరుణాచల గిరి ప్రదక్షిణకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
Healthy Village: శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో హెల్తీ విలేజ్‌పై జాతీయ వర్క్‌షాప్
Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!
Lord Venkateswara: శ్రీవేంకటేశ్వర స్వామివారు ఎవరిని ఇష్టపడతారు? స్వామి గురించి రహస్యం ఇదిగో..!
