HomeAndhra PradeshPithapuram: పిఠాపురం.. ఎమ్మెల్యేగారి తాలూకానా? డిప్యూటీ సీఎం గారి తాలూకానా?

Pithapuram: పిఠాపురం.. ఎమ్మెల్యేగారి తాలూకానా? డిప్యూటీ సీఎం గారి తాలూకానా?

Pithapuram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ దగ్గర పడుతోంది. అటు కూటమి నేతలు, ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. తమకంటే తమకే ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని కుండబద్దలు కొడుతున్నారు. మరికొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గెలుపు లెక్కలు ఎవరికి ఎలా ఉన్నాయో బేరీజు వేసుకుంటున్నారు. అయితే, ఏపీ మొత్తం ఒక ఎత్తు.. పిఠాపురం నియోజకవర్గం మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే.. అక్కడ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ బరిలో ఉండటమే కారణం. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసైనికులు, డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ వైసీపియన్స్ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఏమిటీ స్టిక్కర్ సిత్రం.. అక్కడి రాజకీయంపై ఓ లుక్కేద్దాం రండి.

గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇరు స్థానాల్లోనూ ఓటమిని చవి చూశారు. కానీ ఇప్పుడు ఒక్క స్థానంలోనే పోటీ చేస్తున్నారు. అది కూడా తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం ఎంపిక చేసుకోవడంతోనే సగం గెలిచామని చెబుతున్నారు జనసేన పార్టీ నేతలు, శ్రేణులు. ఇక గోదావరి జిల్లాల్లో జనసేన ఓట్ల ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం కూడా లేకపోలేదు.

అయితే, పిఠాపురంలో మాత్రం పవన్‌కు గెలుపు అంత వీజీనా? వైసీపీ తరఫున అక్కడ పోటీ చేస్తున్న ఆడ సింహం.. వంగా గీతా విశ్వనాథ్ పరిస్థితి ఏమిటి? ఆమె అంత బలహీనంగా ఓటమిని ఒప్పుకొనే రకం కూడా కాదాయె. ఎన్నికల ప్రచారం చివరి రోజు కూడా వైసీపీ అధినేత జగన్‌.. పిఠాపురంలోనే ఆఖరి బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. గీతమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేసి నా పక్కన కేబినెట్‌లో కూర్చోబెట్టి పిఠాపురానికి మరింత మంచి చేయిస్తానంటూ మాట ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

అప్పటి నుంచి ఎన్నికలు పూర్తయినప్పటికీ అ్కడ రాజకీయం మాత్రం వేడిగానే ఉంది. తాజాగా ఎన్నికల కౌంటింగ్‌ దగ్గర పడుతున్న తరుణంలో అక్కడ రాజకీయం మరో మలుపు తిరిగింది. జనసైనికులు తమ అధినేత విజయం ఖాయమనే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే “పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా” అంటూ బైకులు, కార్లకు, ఇతర వాహనాలకు స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నారు.

మరోవైపు వంగా గీత ఫాలోయర్లు, వైసీపీ కార్యకర్తలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. “డిప్యూటీ సీఎం గారి తాలూకా” అంటూ స్టిక్కర్లు వేయించుకుని కౌంటర్‌ ఇస్తున్నారు. అంతేనా.. ఏపీలో మేము “దమ్మున్న లీడర్ తాలూకా..” “ఏపీకి పెద్ద కొడుకు తాలూకా…” అంటూ సోషల్‌ మీడియాలో వైసీపీ అభిమానులు స్టేటస్‌లు పెడుతున్నారు. ఇలా స్టిక్కర్ల రాజకీయం హోరెత్తుతూ పిఠాపురంలో పిచ్చి పీక్స్‌ కు చేరినట్లు కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో ఇరుపార్టీల కార్యకర్తల వీడియోలు, ఫొటోలు, స్టిక్కర్లు వైరల్‌గా మారాయి. పిఠాపురంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రేడియం స్టిక్కర్ల ఫైటింగే నడుస్తోందంటే ఆశ్చర్యం అవసరం లేదు. పిఠాపురంలో ముందునుంచీ ఉన్న ఇరుపార్టీల మధ్య ఆధిపత్య పోరు.. ఇప్పుడు పవన్‌ రాకతో మరింత ముదిరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు పిఠాపురం సెగ్మెంటుపై హాట్ హాట్ గా డిబేట్లు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి: YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్‌ స్పీచ్.. ఇక్కడ చదవండి
Pithapuram: పిఠాపురంలో మంటపెట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రకటన.. వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలం..!
Attack on CM Jagan: సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడికి బెయిల్
DBT Amount: మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు