Andhra Pradesh: పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఏపీలోని పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది. చంద్రగిరి, తాడిపత్రి, పల్నాడు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.
చంద్రగిరిలో 144 సెక్షన్ అమలు
అల్లర్ల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గుంపులుగా తిరగవద్దంటూ ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. చంద్రగిరిలో జరిగే వారపు సంత రద్దు చేశారు. సంతకు ఎవరూ రావద్దని పోలీసులు సూచించారు.
తాడిపత్రిలో కొనసాగుతున్న 144 సెక్షన్
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించేపనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటివరకు వైసీపీ, టీడీపీకి చెందిన 91 మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం
కంప్యూటర్లు, ఫర్నీచర్ ను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసుల చర్యలను తప్పుబడుతూ ఈసీకి వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. వీడియో ఫుటీజీలతో ఈసీకి ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన వీడియో వైరల్ అయ్యింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఇంటిపై దాడి చేశారు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ ను పెద్దారెడ్డి అనుచరులు బయటపెట్టారు. పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు.
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. పలువురు నేతల ఇళ్లల్లో మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
చింతమనేనిపై పెదవేగి పీఎస్ లో కేసు నమోదు
కస్టడీలోని ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లారని చింతమనేని ప్రభాకర్ తో పాటు 30 మంది పై కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు రవి అనే వ్యక్తిపై రాజేష్ దాడి చేశాడు. నిన్న రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి స్టేషన్ కు వచ్చి రాజేష్ ను కస్టడీ నుంచి తీసుకెళ్లిన చింతమనేనిపై కేసు నమోదు చేశారు.
ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్
జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఇంటెలిజెన్స్ సూచించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇవీ చదవండి: Telangana: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల
Chinna News: సంక్షిప్త వార్తలు… ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
Palnadu Review: పల్నాడులో గణనీయంగా తగ్గిన నేరాలు.. సమీక్షలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
Varikapudisela: మారనున్న పల్నాడు రూపురేఖలు.. వరికపూడిశెల ఎత్తిపోతల సాకారం దిశగా అడుగులు!
