Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడంపై కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న వాలంటీర్ల వ్యవస్థ ఉండటానికి వీల్లేదంటూ ప్రతిపక్షాలు కోర్టులకెక్కాయి. ఆ తర్వాత ఈసీకి ఫిర్యాదులు చేయించాయి. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లడానికి వీల్లేదంటూ ఫిర్యాదు చేయించడంతో ఈసీ వాలంటీర్లపై నిషేధం విధించింది. దీంతో రెండు నెలలుగా పింఛన్‌దారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. పండుటాకులు ఏకంగా 50 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు సంక్షేమ పథకాలపై మరో షాక్ ఇచ్చింది ఈసీ.
డీబీటీ పథకాల నగదు ఇప్పుడు జమ చేయడానికి వీల్లేదంటూ ఈసీ అభ్యంతరం తెలిపింది. ఇందుకు అనుమతి కోరిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ తప్పలేదు. తాజాగా రూ.610 కోట్ల విద్యాదీవెన నిధులు విడుదలకు ఈసీ నిరాకరించింది. నిధుల బకాయిల విడుదలకు అనుమతి కోరిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రూ.149 కోట్ల అదనపు నిధుల విడుదలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో రూ.33.55 కోట్ల బిల్లుల చెల్లింపులకు కూడా సర్కారు ఈసీ అనుమతిని కోరింది. వీటికి ఈసీ నో చెప్పేసింది.
చంద్రబాబు అండ్ కో కుట్ర రాజకీయాలతో రైతులు, విద్యార్థులు, లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. లబ్దిదారులకు డబ్బులు అందకుండా టీడీపీ ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలుపుతుండడంతో గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లబ్ధిదారులకు ఇచ్చే డబ్బు విడుదలకు ఈసీ నో చెప్పేయడంతో ఉత్కంఠభరిత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.
గతంలో నో చెప్పలేదు.. ఇప్పుడెందుకో?
తుఫాన్, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే ఇన్ పుట్ సబ్సిడీ విడుదలకు ఈసీ నిరాకరణ తెలిపింది. ఖరీఫ్ కు సన్నద్ధమవుతున్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి. మరో వైపు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ లో సైతం ఇదే నిర్ణయం ఈసీ నుంచి వెలువడింది. ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నెపంతో ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బు విడుదలకు ఈసీ నో చెప్పింది. అమల్లో ఉన్న పథకాల విషయంలో ఈసీ తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఈసీ నో చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఈసీ అభ్యంతరాలు చెబుతుండడంపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
ఇవీ చదవండి: YSR Pension Kanuka: ఏపీలో రూ.3,000కు పెరిగిన పింఛన్.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్ సర్కార్
Wellfare shcemes: సంక్షేమ పథకాలను ఇంకా ఎక్కువ జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
Andhra Pradesh Pensions: పెన్షనర్లు ఎవరూ ఆందోళన చెందొద్దు.. సచివాలయాల్లో 3న పంపిణీ
Volunteers Andhra Pradesh: వాలంటీర్లకు పెరిగిన గౌరవం.. ప్రోత్సాహమిస్తూ సీఎం జగన్ చిరు సత్కారాలు..
