YSRCP Manifesto 2024: రైతు రుణ మాఫీ రూ.1 లక్ష చేస్తారని హామీ ఇస్తారనుకున్నాం..
డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తారనే మాట వింటాం అనుకున్నాం..
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆశించాం..
సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారేమోనని భావించాం..
రైతు భరోసా సొమ్ము రూ.20వేలు చేస్తారని ఆశించాం..
మెగా డీఎస్సీ… యువతకు ఉద్యోగాలు.. ఇలా ఏవేవో ఊహించుకున్నాం..
– ఇదీ వైయస్సార్ సీపీ మేనిఫెస్టోను పరిశీలించిన తర్వాత సగటు ఆంధ్రప్రదేశ్ వాసి నిర్వేదం.
జగన్ చెబితే చేస్తాడన్నది ఏపీలో బలంగా వినిపిస్తున్న మాట. ఇందుకు కూడా కారణం లేకపోలేదు. గత ఐదు సంవత్సరాలుగా వివిధ సంక్షేమ పథకాలు కావొచ్చు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే పెన్షన్లు, సర్టిఫికెట్లు, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు.. ఇలా ఒక్కటేమిటి.. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు సీఎం జగన్.
అందుకే జగన్ మాట ఇస్తే తప్పడు. వెనక్కు తగ్గడన్నది అధిక శాతం వర్గాల్లో ఏర్పడింది. అందుకే నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోపై రాష్ట్ర వ్యాప్తంగా యువత, మహిళలు, రైతులు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా అన్ని వర్గాలూ ఆశగా ఎదురు చూశాయి. తమకు ఇంకా బెటర్‌గా హామీలు లభిస్తాయని, అధికంగా లబ్ధి పొందుతామని భావించాయి. తెలుగుదేశం కూటమి ఇస్తున్న హామీల్లో సగమైనా ఇస్తారేమోనని చాలా మంది ఎదురు చూశారు.
కానీ.. కానీ.. జరిగింది వేరు. రుణమాఫీ లేదు.. ఫ్రీ బస్సు లేదు.. సూపర్ సిక్స్‌తో పోలికే లేదు. వైయస్సార్ సీపీ మేనిఫెస్టోలో చెప్పింది వేరు. సీఎం జగన్ తీరు కూడా పూర్తిగా వేరుగా ఉంది. ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రల్లో 20కి పైగా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ తన మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతూ వచ్చారు. తమ పార్టీ మేనిఫెస్టో త్వరలోనే విడుదల చేస్తామని, కానీ చేయగలిగేవి మాత్రమే చెబుతామని, చెప్పిన ప్రతి ఒక్కటీ నెరవేరుస్తామని తు.చ.తప్పక నెరవేరుస్తామని పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అనుకున్నట్టే ప్రజాకర్షక హామీలు, అలివిగాని హామీలు గుప్పించే కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు సీఎం జగన్.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 ఇవాళ సీఎం జగన్ చేతుల మీదుగా విడుదల చేశారు. జనాకర్షక మేనిఫెస్టో కాకుండా కేవలం గత ఐదు సంవత్సరాలుగా అమలు చేస్తున్న పథకాలనే కొనసాగిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కొత్తగా మేజర్‌గా ఏ హామీనీ ఇవ్వకపోవడం గమనార్హం.
ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చాను.. ప్రజలు తప్పక దీవిస్తారనే నమ్మకం సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆయన కాన్ఫిడెన్స్ ఎంతలా ఉందో మేనిఫెస్టో సాంతం పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. కేవలం అమ్మ ఒడి సాయం రూ.2 వేలు పెంచి రూ.17,000 ఇస్తామని, రైతు భరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16,000కు పెంచుతామని మాత్రమే సీఎం జగన్ కొత్తగా హామీలిచ్చారు.
పెన్షన్ రూ.500… అది కూడా 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో మరో రూ.250 మాత్రమే పెంచుతామన్నారు. ఇక ప్రజాకర్షణ కలిగించేలా ఏ పథకాలూ ప్రకటించలేదు. దీన్నిబట్టి జగన్ అమలు చేస్తున్న పథకాలపై ఎంత దీమాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇవీ చదవండి: YS Jagan Election Campaign: 28వ తేదీ నుంచి రోజూ మూడు ప్రాంతాల్లో జగన్ సభలు
YS Jagan in Pulivendula: బంధువులకు దోచిపెట్టడానికి సీఎం కాలేదు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
YS Jagan in Vizianagaram: డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ జగన్‌వి.. విజయనగరం సభలో సీఎం జగన్
