YS Jagan in Pulivendula: సొంత కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయడానికి ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చేయలేదని, ప్రజలకు మంచి చేయడానికే తనకు దేవుడు ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడని సీఎం వైయస్ జగన్ అన్నారు. వైయస్‌ఆర్ జిల్లా పులివెందులలో ఇవాళ ఆయన పులివెందుల వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తొలుత సీఎస్‌ఐ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించి అనంతరం నామినేషన్ వేశారు. బహిరంగ సభలో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..
“పులివెందుల.. సిద్ధమేనా? నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం.. నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి అన్నకూ, నా ప్రతి తమ్ముడికీ, నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, నా ప్రతి తాతకూ, నా ప్రతి స్నేహితుడికీ మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.
పులివెందుల అంటే నమ్మకం. పులివెందుల అంటే ధైర్యం. పులివెందుల అంటే అభివృద్ధి. పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ. పులివెందుల ఓ విజయగాధ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది.. ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందులలో కనిపిస్తూ.. పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తుతూ ఉందంటే ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత, మనందరి ప్రియతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైయస్సార్ గారు, నాన్న గారు అయితే.. ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నా.
పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే, పులివెందులలో ఏమి లేదు చెప్పండీ అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని, మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగూ వేశాము, రాబోయే రోజుల్లో ప్రతి అడుగూ వేస్తాము కూడా.
ఇవీ మన కల్చర్
మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల.. మనకే కాదు.. మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని, మోసం చేయడన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువునా నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నా. కాబట్టే మన ప్రత్యర్థులకు.. ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కు, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదమేమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్.. ఎస్.. మన కల్చర్.. మంచి చేయటం మన కల్చర్. మంచి మనసు మన కల్చర్. మాట తప్పకపోవటం మన కల్చర్. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్.
పులివెందులను తెలుగు సీమ అభిమానించింది. నమ్మింది. కలిసి నడిచింది. ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందుల, మన కడప, మన రాయలసీమ మంచితనం, మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టే ఓ వైయస్సార్, ఓ జగన్ ను, ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించేవాళ్లు ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈరోజు కనిపిస్తున్నారు. అదే సమయంలో ఓ వైయస్సార్, ఓ జగన్ ల మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ వీరంతా ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు కదా. వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్య కాలంలో కొత్తగా వైయస్సార్ వారసులం అని మీముందుకు వస్తున్నారు వారి కుట్రలో భాగంగా. నేను అడుగుతున్నా ఈరోజు మీ అందరి సమక్షంలో. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతున్నాను.
ప్రజలు కాదా? అని అడుగుతున్నాను. ఆ వైయస్సార్ ను ప్రేమించేవారు కాదా? అని అడుగుతున్నాను. ఒక్క విషయం ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. ఆ దివంగత మహానేత మీద నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఒక వైయస్సార్ లెగసీని ఒక వైయస్సార్ ను ఉండకుండా చేయాలని చూస్తున్నది ఎవరు? ఒక వైయస్సార్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు ఇక లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు?
ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు. వైయస్సార్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా ఇవన్నీ సంగతులు తెలుసు. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అణగదొక్కాలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైయస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్లందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తున్న మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైయస్సార్ వారసులు అని అడుగుతున్నాను. ఒక్కటి ఆలోచన చేయమని కోరుతున్నా మీ అందరితో కూడా. వైయస్సార్ గారు బతికున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. వైయస్సార్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమానీ వైయస్సార్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి కార్యకర్తా ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతున్నా.
మరి ఆ వైయస్సార్ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ, వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కీటు మక్కీ చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతున్న వీళ్లా వైయస్సార్ వారసులు అని అడుగుతున్నా మీ అందరి సమక్షంలో. వైయస్సార్ కీర్తి ప్రతిష్టలను, ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైయస్సార్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని, బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెక్కలు చేస్తాము అని చెప్పి వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైయస్సార్ వారసులు అని అడుగుతున్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతున్నా.
ఇలాంటి వారికి ఓటు వేస్తే వైయస్సార్ లెగసీకి ఓటు వేసినట్టా? లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైయస్సార్ పేరును కనపడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్టా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థను చూడమని కోరుతున్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతున్నా. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతున్నారు.మీ బిడ్డ ఒక్కడు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంత మంది కలిసి ఏకమవుతున్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరికీ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఆలోచన చేయమని అడుగుతున్నా. రాజకీయాలు ఏ స్థాయి పతనమైపోయాయో గమనించమని కోరుతున్నా.
ఇక మా చిన్నాన్నగారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురదజల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజూ కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. అవును నేనే చంపాను అని అతి హేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజూ చూస్తున్నారు కదా?
చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే దానికి అర్థమేమిటి అని ఈ సందర్భంగా అడుగుతున్నా. చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా? కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా? కాదా?
అవినాశ్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్లాడు? వంటి అనేక ప్రశ్నలు అవినాశ్ తన అనేక ఇంటర్వ్యూస్ లో తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాశ్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తుండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ కూడా అడుగుతున్నా. ఆలోచన చేయమని ప్రతి ఒక్కరినీ అడుగుతున్నా. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని ఈ సందర్భంగా అడుగుతున్నా.
మరోవంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లెన్ని వచ్చాయా? నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్నివిడగొట్టిన ఆ కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైయస్సార్ గారి పేరును, ఆయన చనిపోయిన తర్వాత చార్జ్ షీట్ లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైయస్సార్ గారి పేరునే తుడిచి వేయాలని, కనపడకుండా చేయాలని ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటం అంటే దాని వల్ల ఎవరికి లాభం అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా? అని అడుగుతున్నాను.
ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా? అని అడుగుతున్నాను. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. అసలు ఎవరికి వైయస్సార్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతున్నా. ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎవరికి పులివెందుల, కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతున్నా. ఎవరికి ఈ పేర్లన్నీ ఓ వైయస్సార్ గారి పేరు, ఓ పులివెందుల పేరు, ఓ వైయస్సార్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా.
మరోవంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడుతున్న ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేర్లు లేకుండా కుట్రలు చేస్తున్నారు అన్నది గమనించమని కోరుతున్నా. మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? మరి వీరు వైయస్సార్ వారసులా? లేక వైయస్సార్ గారు ఎవరితో బతికుండగా యుద్ధం చేశారో, వైయస్సార్ గారిని ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్తా ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.
పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా,మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు కూడా.. ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదల్చుకున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది.. డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు. ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకు, మీ జగన్ కు ఇచ్చాడు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతున్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్క విషయం కూడా నిండుమనసుతో చెబుతున్నా. వైయస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాశ్ కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాశ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్నపిల్లాడైనా అవినాశ్ ను దూషించడం, అవినాశ్ ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమం అన్నది ప్రతి ఒక్కరూ గమనించమని అడుగుతున్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాశ్. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లందరూ మనుషులేనా అని ఈ సందర్భంగా అడుగుతున్నా.
ఈరోజు పులివెందులలోగానీ, కడపలోగానీ మొత్తం తెలుగు నేలమీద గానీ ఒక జలయజ్ఞం అన్నా, ఒక ఉచిత విద్యుత్ అన్నా, 108 అన్నా, 104 అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా.. వీటన్నింటితోపాటు మీ జగన్, మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మ ఒడి, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం, నాడునేడు స్కూళ్లు, ఆస్పత్రులు, చేయూత, వైయస్సార్ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలైనా, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లయినా, ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్, రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వాలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా జరుగుతున్న పాలన అయినా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇవన్నీ మన మనసు, మన మానవత్వాన్ని చూపే అంశాలు.
ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా? అని ఈ సందర్భంగా అడుగుతున్నా. మీరే గమనించండి. మీరే అందరూ గమనించమని కోరుతున్నా. జగన్ ను పథకాల్లో కొట్టలేరు. జగన్ ను పాలనలో, పనితీరులో కొట్టలేరు, జగన్ ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ ను రైతులకు అందించిన రైతు భరోసాలో, రైతు భరోసా కేంద్రాల్లో కొట్టలేరు. జగన్ ను అక్కచెల్లెమ్మలకు చేసిన మంచిలో, మేలులో కొట్టలేరు. జగన్ ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగగంలో కొట్టలేరు, ఆ అవ్వాతాతల ఆత్మగౌరవం కాపాడటంలో కూడా జగన్ ను కొట్టలేరు.
జగన్ ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో జగన్ ను కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చేయలేదు అని వీళ్లు చెప్పలేరు. జగన్ కంటే తమ 14 ఏళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాం అని కూడా వాళ్లు చెప్పలేరు. ఆలోచన చేయమని అడుగుతున్నా. మరి బ్రాండ్ జగన్, మరి బ్రాండ్ వైయస్సార్, మరి బ్రాండ్ కడప, మరి బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న వీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా?
పులివెందుల అభివృద్ధికి ఈ 5 ఏళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో నాలుగు మాటల్లో అవి కూడా వివరిస్తా. పులిందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తున్న మెడికల్ కాలేజ్. నాన్న కలలుగన్న ఆ మెడికల్ కాలేజ్ ఆరోజు నాన్న బిడ్డగా, ఈరోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో ఆస్పటల్ ను అంకితం చేశాం. ఈ జూలై, ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతున్నాం అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తున్నామో మీ అందరికీ కూడా కనిపిస్తూనే ఉంది. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ లో భాగంగా 900 కోట్ల రూపాయలతో కాలేటివాగు సామర్థ్యాన్ని పెంచి కరువు పీడిత చక్రాయిపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోవచ్చాయి.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో గతంలో ఎప్పుడూ కూడా మూడు నాలుగు టీఎంసీలకు మంచి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఆ గ్రామాలకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపు రూ.250 కోట్లు చెల్లించి 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వస్తున్నాం. రైతులకు మంచి జరిగిస్తూ.. పైడిపాలెం రిజర్వాయర్ ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం. యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఏకంగా రూ.1000 కోట్లతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా పనులు జరుగుతున్నది మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది.
వాటర్ గ్రిడ్ ద్వారా 480 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ తాగునీటిని సప్లయ్ చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది. పులివెందులలో స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ క్యాంపస్ ను కట్టడం పూర్తి చేసి, ఆ క్యాంపస్ ను ప్రారంభించడం కూడా అయిపోయింది. ఇదే ఏపీ కార్ల్ లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైయస్సార్ వ్యవసాయ కళాశాల, ఉద్యానవన కళాశాలలను కూడా నెలకొల్పడం జరిగింది. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమను కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు.. ఈరోజు పులివెందులలో కనిపిస్తున్న కార్యక్రమాలు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతోంది.
పులివెందులలో కొత్త బస్టాండ్, పులివెందులలో క్రికెట్ స్టేడియం, పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తున్నారు. మొత్తంగా దాదాపుగా రూ.5900 కోట్లతో ఈ 58 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాక ఇంటింటికీ మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం, ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పంపించిన నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాలా మరో రూ.2069 కోట్లు అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా.
మన పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్న వారు ఎన్ని గడపలో తెలుసా? ఏకంగా 94.4 శాతం గడపలకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం. జరుగుతున్న పరిస్థితులు కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది. చీనీ అమ్మకాలకు పులివెందుల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత పరిస్థితులను మార్చి పులివెందులలోనే అమ్మే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ చేశాం అంటే దానికి కారణం మళ్లీ మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా.
నాన్నగారి మరణం తర్వాత పదేళ్లపాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. మళ్లీ పులివెందుల దశ మారింది ఎప్పుడు? మళ్లీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 58 నెలల్లో కాదా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. ఇంకా పులివెందులను అభివృద్ధి చేయాలి. ఇంకా వైయస్సార్ జిల్లాను అభివృద్ధి చేయాలి. మరింత అభివృద్ధి చెందబోతున్నాయి మన ప్రాంతాలు. వచ్చే 5 ఏళ్లలో మీ అండతో ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా.
పులివెందుల, కడప, రాయలసీమ, వైయస్సార్, వైయస్ జగన్.. ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదా? అని అడుగుతున్నాను. ఈ పేర్లను చెరిపేయాలనుకునే వారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కోరుతున్నాను. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో 5 ఏళ్ల ప్రయాణాన్ని, ఇంటింటి ప్రయాణానికి మన పులివెందుల ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ, మీ బిడ్డకు చరిత్రలోకనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన ఈ గడ్డను, మరోసారి అలాంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
అలాగే అవినాశ్ ను కూడా అంతే ఆప్యాయతతో, అలాంటి గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు, ఆ దేవుడి దయ ఎల్లప్పుడూమీ బిడ్డకు ఉండాలి అని మనసారా ప్రార్థిస్తూ, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొక్కసారి రెండు చేతులూ జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇవీ చదవండి: Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
YS Jagan in Vizianagaram: డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ జగన్‌వి.. విజయనగరం సభలో సీఎం జగన్
YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
